కరోనాతో ‘ఖాళీ’

ABN , First Publish Date - 2020-08-09T07:57:16+05:30 IST

కరోనా మహమ్మారి రోజురోజుకు జిల్లాలో పడగ విప్పుతోంది. రోజుకు వందకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో ..

కరోనాతో ‘ఖాళీ’

  • పట్టణాల్లో వ్యాపారాలు వెలవెల
  • పలుచోట్ల మూతపడుతున్న దుకాణాలు 
  • ఏ వీధి చూసినా కనిపిస్తున్న టులెట్‌ బోర్డులు
  • ఇదే తీరున అద్బె ఇళ్ల పరిస్థితి 


ఖమ్మం, ఆగస్టు 8(ప్రతినిధి): కరోనా మహమ్మారి రోజురోజుకు జిల్లాలో పడగ విప్పుతోంది. రోజుకు వందకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో ఇళ్లలోనుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. కరోనా ప్రభావంతో వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. గడిచిన మూడు నెలలుగా అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో షాపుల యజమానులు ఉన్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే అప్పుల భారం తప్పదని ముందే మేలుకుని షాపులు ఖాళీ చేస్తున్నారు. చదువులు, వ్యాపారాల నిమిత్తం గ్రామాలు వదిలి పట్టణాలకు వచ్చి అద్దెకుఉంటున్న ఇంటి యజమానులు సైతంస్వగ్రామాలకు వెళుతున్నారు దీంతో ఖమ్మంతోపాటు ఉమ్మడి జిల్లాలోని మునిసిపల్‌ పట్టణాల్లో షాపులు ఖాళీ అవుతుండగా అపార్టుమెంట్లు, ఇళ్లు సైతం ఖాళీచేసి స్వగ్రామాల్లో సొంత ఇంటి బాటపడుతున్నారు.


ఈ పరిస్థితి కారణంగా గత వారం పదిరోజులుగా ఖమ్మం పట్టణంతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర పట్టణాల్లో షాపుల ముందు టూలెట్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రోజువానీ వ్యాపారాలతో వచ్చేలాభాలతో అద్దెలు చెలిస్తున్న యజమానులు మూడునెలలుగా టర్నోవర్‌ పడిపోవడం, కరెంట్‌బిల్లుల భారం, ఇటు ఇంటి అద్దెల నెలవారిగా యజమానులకు చెల్లించడం ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితి కలిగిస్తోంది. దీంతో షాపుల్లో ఉన్న సరుకు అమ్ముకుని షాపులు ఖాళీ చేస్తున్నారు. కొత్తగా పెట్టినవారు సైతం కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికి పోతున్నారు. టులెట్‌ బోర్డు పెట్టినా ఖమ్మంనగరంలో గతంలో గంటల్లోనే షాపులు బుక్‌ అయ్యేవి. ఇప్పుడు వైరారోడ్డుతోపాటు గాంధీచౌక్‌, బస్‌డిపోరోడ్డు, ఇలా ఏ వీధిలో టులెట్‌బోర్డు ఉన్నా కొత్తగా వచ్చి వ్యాపారాలు పెట్టేందుకు ఎవరూ ఇష్టపడడంలేదు. దీంతో ఖాళీగా టులెట్‌బోర్డులు దర్శనమిస్తున్నాయి. అపార్లుమెంట్లు, ఇతర ఇళ్లు సైతం టులెట్‌ బోర్డులు పెడుతున్నా కొత్తగా వచ్చేవారు కనిపించడంలేదు. పరిస్థితి తీవ్రంగా ఉండి కరోనాతో ఉద్యోగులు, వ్యాపారులు అన్నీ రంగాల ప్రజలు ఆర్థికగా చితికిపోతున్నా షాపుల యజమానులు, ఇంటియజమానులు అద్దెలు తగ్గించడంలేదు. 


గతంలో ఉన్న అద్దెలే చెబుతూ అద్దెలు కడితేనే ఉండండి లేకపోతే ఖాళీచేయండని చెబుతున్నారు. ఈ పరిస్థితితో సామాన్యులు, చిరువ్యాపారులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. చాలామంది పరిస్థితి గ్రహించి ఆర్థికభారం మోయలేక ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోతుండడంతో టులెట్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కరోనా ప్రభావం ఇదే పరిస్థితి కొనసాగితే ఇలా అపార్టుమెంట్లు, ఇళ్లలో అద్దెకు ఉంటున్న మరికొందరు ఖాళీచేసే పరిస్థితి ఉంది. అలాగే షాపులు నిర్వహిస్తున్న పలువురు వ్యాపారులు సైతం ఖాళీచేసి వ్యాపారాలకు స్వస్తిపలికే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంమీద కరోనా ప్రభావం అన్నీ రంగాలపై చూపిస్తుండడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. 

Updated Date - 2020-08-09T07:57:16+05:30 IST