అట్టపెట్టెల్లోనే..!

ABN , First Publish Date - 2022-08-20T05:13:24+05:30 IST

ప్రభుత్వం సచివాలయాలకు అందించిన ఫాగింగ్‌ యంత్రాలు, హైపవర్‌ టాయిలెట్‌ క్లీనర్లు మూలకు చేరాయి. దోమలవ్యాప్తి నివారించి, పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వీటిని అందించింది. అయితే అధికారులు వీటి వినియోగంపపై శ్రద్ధ చూపకపోవడంతో అట్ట పెట్టెల్లోనే భద్రంగా ఉన్నాయి.

అట్టపెట్టెల్లోనే..!
తులసిగాం సచివాలయంలో అట్టపెట్టెలో ఫాగింగ్‌ యంత్రాలు

మూలకు చేరిన ఫాగింగ్‌ యంత్రాలు, టాయిలెట్‌ క్లీనర్లు
దోమలతో ప్రజల ఇబ్బందులు
(ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రభుత్వం సచివాలయాలకు అందించిన ఫాగింగ్‌ యంత్రాలు, హైపవర్‌ టాయిలెట్‌ క్లీనర్లు మూలకు చేరాయి. దోమలవ్యాప్తి నివారించి, పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వీటిని అందించింది. అయితే అధికారులు వీటి వినియోగంపపై శ్రద్ధ చూపకపోవడంతో అట్ట పెట్టెల్లోనే భద్రంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో మురుగునీరు బయటకుపోయే మార్గాలు లేవు. దీంతో దోమల వ్యాప్తి అధికమైంది. తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో రాత్రిపూట ప్రజలు దోమలతో యుద్ధం చేయాల్సి వస్తోంది.
 జిల్లాలో 912 గ్రామ పంచాయతీల పరిధిలో 657 గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం ఫాగింగ్‌ యంత్రాలను 5 నెలల కిందట పంపిణీ చేసింది. వీటితో పాటు సచివాలయాల్లో మరుగుదొడ్లు శుభ్రపరిచేందుకు 657 హైపవర్‌ టాయిలెట్‌ క్లీనర్లు అందించింది. అయితే వీటిని వినియోగించకుండా మూలన పెట్టారు. కొన్ని గ్రామాల్లో ప్యాకింగ్‌ సీలు కూడా విప్పలేదు. ఫాగింగ్‌ యంత్రాలు ఎలా వాడాలో పంచాయతీ సిబ్బందికి శిక్షణ ఇవ్వలేదు. సరైన అవగాహన లేకుండా వాడలేమంంటూ పారిశుధ్య కార్మికులు వాటి జోలికి వెళ్లడం లేదు. హైపవర్‌ టాయిలెట్‌ క్లీనర్లు సైతం ఇంతకు ముందెన్నడూ పారిశుధ్య సిబ్బంది వినియోగించలేదు. దీంతో అర్థంకాక నిరుపయోగంగా పడేశారు.

తీవ్ర ఇబ్బంది పడుతున్నాం
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దోమల వ్యాప్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కంటి మీద కునుకు లేకుండా పోయింది. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలన్నీ దోమల ఆవాసాలుగా మారుతున్నాయి. దోమల నివారణ మందు పిచికారీ చేయించడం లేదు. తక్షణమే ఫాగింగ్‌ యంత్రాలు వినియోగించి దోమల వ్యాప్తి నివారించాలి.
- బి.గోపాల్‌, ఈదుపురం, ఇచ్ఛాపురం

త్వరలో శిక్షణ ఇస్తాం
ఫాగింగ్‌ యంత్రాలు, టాయిలెట్‌ క్లీనర్ల వాడకంపై పారిశుధ్య కార్మికులకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ అధికారులు శిక్షణ ఇస్తారు. జిల్లాలో ఇప్పటికే 10 మండలాల్లో వీటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ లేకుండా వీటిని వినియోగించడం ప్రమాదం. పారిశుధ్య సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం.
- ఎస్‌.హరిహరరావు, డీఎల్‌పీవో, టెక్కలి.

 

Updated Date - 2022-08-20T05:13:24+05:30 IST