మక్క రైతు వెక్కివెక్కి..

ABN , First Publish Date - 2021-10-13T09:17:46+05:30 IST

దిగుబడి వచ్చిన ఆనందంలో ఉన్న మక్క రైతులు, మార్కెట్లో ధరలను చూసి తలపట్టుకుంటున్నారు.

మక్క రైతు వెక్కివెక్కి..

 మార్కెట్లో దారుణంగా పడిపోతున్న ధరలు 

 సీజన్‌ తొలినాళ్లలో క్వింటాకు రూ.2,100

 ఇప్పుడు చాలాచోట్ల రూ.1600లోపే 


హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): దిగుబడి వచ్చిన ఆనందంలో ఉన్న మక్క రైతులు, మార్కెట్లో ధరలను చూసి తలపట్టుకుంటున్నారు. సీజన్‌ మొదట్లో మంచి ధర రాగా, మార్కెట్‌కు పంట వస్తున్నకొద్దీ ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ వానాకాలం సీజన్‌ మొదట్లో మద్దతు ధర రూ.1875కు మించి క్వింటాకు రూ. 2,100 చొప్పున పలికితే ఇప్పుడు నాలుగైదు వందల దాకా తక్కువ వస్తోంది. కోళ్ల దాణా కంపెనీలు మక్కల ధరను తగ్గించటంతో ట్రేడర్లు ధరలు తగ్గిస్తున్నారు.


ప్రభుత్వరంగ కొనుగోలు సంస్థ టీఎస్‌ మార్క్‌ఫెడ్‌ రంగంలో లేకపోవటంతో ప్రైవేటుగానే మక్కల కొనుగోలు జరుగుతోంది. అడ్తి వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు రైతుల నుంచి కొని వ్యాపారులకు అప్పగిస్తున్నారు. వారేమో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోళ్ల దాణా, లిక్కర్‌ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఫైనల్‌గా కొనుగోలుచేసేది కంపెనీలే కావటం, వారంతా సిండికేట్‌గా ఏర్పడటంతో ధరలను శాసిస్తున్నారు. కంపెనీల ధరలకు అనుగుణంగా మక్కలు సరఫరా చేయటానికి వ్యాపారులు క్వింటాకు రూ. 1,600 చొప్పున కొంటున్నారు. రూ. 50 ఖర్చు, రూ. 100 రవాణా, రూ. 50 కమీషన్‌ చూసుకొని రూ. 1,800కు కంపెనీలకు అప్పగిస్తున్నారు. సోమవారం వరకు ఈ తరహాలోనే కొనుగోలు జరిగింది. మంగళవారానికి వచ్చేసరికి మార్కెట్లో ధరలు మరింత పతనమయ్యాయి. 


వివిధ మార్కెట్లలో.. 

తిరుమలగిరి మార్కెట్లో మోడల్‌ ధర క్వింటాకు కేవలం రూ. 1,289 చెల్లించారు. అచ్చంపేటలో రూ. 1,406, నాగర్‌ కర్నూల్‌లో 1,469, కరీంనగర్‌లో రూ. 1,478, జనగామాలో రూ. 1,549, జహీరాబాద్‌లో రూ. 1,562, జగిత్యాలలో రూ. 1,580, సిద్దిపేటలో రూ. 1,551, వరంగల్‌లో రూ. 1,649, మహబూబాబాద్‌లో రూ. 1,650, కేసముద్రంలో రూ. 1,689 చొప్పున కొన్నారు. వ్యాపారులను రైతులు నిలదీస్తే, కంపెనీలు ధరలు తగ్గించటంతోనే తాము ఽతగ్గిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లోనే మక్కల కొనుగోలు జరుగుతోంది. మార్కెట్‌ కమిటీలు వ్యాపారులను నియంత్రించటంలేదు. రైతులకు మద్దతు ధర ఇప్పించే ప్రయత్నం చేయటంలేదు.   మార్కెట్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మద్దతు ధరకు మక్కలు కొనుగోలుచేస్తే కంపెనీలు, ట్రేడర్లు దారికొస్తారనే చర్చ నడుస్తోంది. లేకపోతే మక్కల ధరలు మరింత పతనం అవుతాయని, రైతులు మరింత తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మార్క్‌ఫెడ్‌ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతికోసం ఎదురుచూస్తోంది. 


డబ్బుల చెల్లింపుల్లోనూ జాప్యం

తక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాదు..  రైతులకు డబ్బులు చెల్లించటంలోనూ వ్యాపారులు జాప్యం చేస్తున్నారు. నాలుగైదు రోజులు వాయిదా పెట్టి, నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే... పౌల్ట్రీ దాణా కంపెనీలు తమకు సకాలంలో పేమెంట్లు చేయటంలేదని సమాధానమిస్తున్నారు. ఒక ప్రముఖ కంపెనీ, సరుకు తీసుకున్న తర్వాత 100 రోజులకు కూడా డబ్బులు చెల్లించటంలేదని ట్రేడర్లు వాపోతున్నారు. జమ్మికుంట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మంజిల్లాల్లో సదరు కంపెనీ ప్రభావంతో రైతులకు సుమారు రూ. 5 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి వివిధ జిల్లాల నుంచి మక్కలు తరలించిన ట్రేడర్లకు లారీల కిరాయిలు కూడా ఇచ్చే పరిస్థితి కంపెనీలకులేదు. 

Updated Date - 2021-10-13T09:17:46+05:30 IST