మొక్కజొన్నను కొనుగోలు చేసేనా?

ABN , First Publish Date - 2020-11-29T04:34:55+05:30 IST

మొక్కజొన్నలను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఆశపడిన రైతులకు నిరాశే మిగులుతోంది.

మొక్కజొన్నను కొనుగోలు చేసేనా?
పరిగి శివారులో అమ్ముకోలేక వర్షానికి తాడిపత్రిలతో కప్పి ఉంచిన మొక్కజొన్నలు

  • అడ్డంకిగా మారిన నిబంధనలు


పరిగి: మొక్కజొన్నలను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఆశపడిన రైతులకు నిరాశే మిగులుతోంది. ఖరీఫ్‌ ప్రారంభంలో మొక్కజొన్న సాగు చేయకూడదని ప్రభుత్వం సూచించిన రైతులు పట్టించుకోకుండా మొక్కజొన్నను సాగుచేశారు. రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో సీఎం కేసీఆర్‌ మొక్కజొన్నలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మొక్కజొన్న కేంద్రాలను హడావిడిగా ప్రారంభించారు. కానీ కొనుగోళ్ళు మాత్రం జరగడం లేదు. రైతుబంధు రాదేమోనని పంటల సాగు వివరాలు తప్పుగా నమోదు చేయించారు. మొక్కజొన్న పంటను సాగుచేసి పత్తి సాగు చేసినట్లు అధికారులకు తెలియజేశారు. ఇప్పుడు రికార్డుల్లో పత్తిసాగు అని ఉంది. దీంతో మొక్కజొన్నలు కొనుగోలు చేయమని అధికారులు చెబుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు ఉన్న రైతుల వద్ద కూడా కొనుగోలుకు కొర్రీలు పెడుతున్నారు. 14 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. వ్యవసాయ అధికారులు రికార్డులను మార్క్‌ఫెడ్‌ వారికి అనుసంధానం చేశారు. అయితే ఎకరాకు 20క్వింటాళ్లే కొనుగోలు చేయాలి. ఒక్క క్వింటా కూడా ఎక్కువ ఉన్నా ఆన్‌లైన్‌లో తీసుకోదు. ఈ విధంగా ఆన్‌లైన్‌లో పంట వివరాలు నమోదు కాని రైతులు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడు నమోదు చేయించుకుంటున్నారు. ఇప్పుడు నమోదు చేయించుకుంటే ఎప్పుడు కొంటారని ప్రశ్నిస్తున్నారు. చాలాచోట్ల దశాబ్దాల తరబడి పంటలు సాగు చేసుకుంటున్నా పట్టాలు, హక్కు పత్రాల జారీ కాలేదు. ఎలాంటి ఆధారాలు లేని ఇతర రైతులు మొక్కజొన్నలను ఎక్కడ విక్రయించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

  

టోకెన్ల జారీ ఒక ప్రహసనం

మొక్కజొన్నలు విక్రయించాలనుకునే రైతులకు ఆ ప్రాంత ఏఈవో టోకెన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. టోకెన్‌ జారీచేసే సమయంలో రైతుకు ఎంత భూమి ఉన్నది. అది పట్టానా, అసైన్డ్‌ భూమా..? ఉన్న భూమి ఆన్‌లైన్‌లో ఏ పంట సాగు చేసినట్లు నమోదు అయిందో తనిఖీ చేయాలి. నమోదుకు మించి ఒక్క బస్తాకు కూడా ఎక్కువ టోకెన్‌ ఇవ్వడానికి వీల్లేదు. దీంతో ఏఈవోలు టోకెన్లు జారీ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. టోకెన్ల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆన్‌లైన్‌ రికార్డులు లేని రైతుల పొలాలు, ఇంటి వద్ద ఉన్న మొక్కజొన్న కుప్పల వద్దకు వెళ్లి పరిశీలించి టోకెన్లు జారీ చేస్తామని సమాధానం ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.


పంటను కొనకపోతే ఎలా..

మూడు ఎకరాల్లో మక్కలు సాగు చేశా. 75 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. 60 క్వింటాళ్ళే కొంటా అంటే ఎలా..? అందులో తేమశాతం పేరిట కొర్రీలు. ఇలా తాము పండించిన పంటనే అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కొనుగోళ్ళపై నిబంధనలు సడలించాలి..           

- రాములు, రైతు

Updated Date - 2020-11-29T04:34:55+05:30 IST