మొక్కజొన్న విక్రయాలకు ఆన్‌లైన్‌ సమస్య

ABN , First Publish Date - 2020-11-26T05:03:06+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మొక్కజొన్నను విక్రయించేందుకు ఆన్‌లైన్‌ సమస్యలు ఎదురవుతున్నాయి.

మొక్కజొన్న విక్రయాలకు ఆన్‌లైన్‌ సమస్య
షాద్‌నగర్‌లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం

షాద్‌నగర్‌అర్బన్‌: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మొక్కజొన్నను విక్రయించేందుకు ఆన్‌లైన్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. మొక్కజొన్న సాగుచేసిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్న రైతుల పేర్లపైనే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ఎకరాకు 21 క్వింటాళ్ల వరకే మొక్కజొన్నను కొనుగోలు చేసేలా సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచారు. ఒక రైతు ఒకేసారి మొక్కజొన్న విక్రయానికి సాఫ్ట్‌వేర్‌ తక్‌పట్టీని జనరేట్‌ చేస్తున్నది. రైతులు మొక్కజొన్నలో సగం ఒకరోజు, మిగిలిన సగం మరోరోజు తీసుకువస్తే సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయం తెలియక రెండోసారి మొక్కజొన్నను తీసుకువచ్చిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అలాగే వానాకాలం మొక్కజొన్నను సాగుచేయొద్దని, సాగుచేస్తే రైతుబంధు వర్తించదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేసినా చాలామంది రైతులు మొక్కజొన్నను సాగుచేశారు. కానీ ఆన్‌లైన్‌ నమోదుకు సరైన సమాచారాన్ని ఇవ్వలేదు. మొక్కజొన్నను సాగుచేసి, ఇతర పంటలను సాగుచేసినట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చిన రైతులు.. ఇప్పుడు మద్దతు ధరకు విక్రయించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓపెన్‌ మార్కెట్‌లో రూ.1,450 ధర ఉండడం, ప్రభుత్వం మాత్రం రూ.1,850కి కొనుగోలు చేస్తుండడంతో రైతులందరూ మద్దతు ధరకు విక్రయించడానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు. అవకాశం ఉన్న తోటి రైతుల పేర్లపై విక్రయించడానికి రైతులు ప్రయత్నిస్తున్నారు. 


రైతులందరికీ అవకాశం ఇవ్వాలి

రైతులు ఉత్పత్తి చేసిన మొక్కజొన్నను మద్దతు ధరకు పూర్తిస్థాయిలో విక్రయించుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి. సాగు వివరాలు ఆన్‌లైన్‌లో లేవని, రెండోసారి మొక్కజొన్న తెస్తే కంప్యూటర్‌ ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు. ఆన్‌లైన్‌ సమస్యలతో సంబంధం లేకుండా ప్రతి రైతు నుంచి మొక్కజొన్నను కొనుగోలు చేసి ఆదుకోవాలి.

- ఎతిని శ్రీశైలం, రైతు, చిల్కమర్రి


ఆన్‌లైన్‌లో ఉంటేనే అవకాశం

మొక్కజొన్న సాగుచేసినట్లుగా ఆన్‌లైన్‌ వివరాలు ఉన్న రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. గుంటకు బస్తా, ఎకరానికి 21 క్వింటాళ్లు మాత్రమే తీసుకోవడానికి వీలుంది. రైతులు కూడా అర్థం చేసుకుని తమకు సహకరించాలి. అలాగే నాణ్యమైన వరి, మొక్కజొన్నను మాత్రమే తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలి. 

- ఎం. వెంకటయ్య, సీఈవో చేగూరు

Updated Date - 2020-11-26T05:03:06+05:30 IST