కోరమాండల్‌ రూ.600 కోట్ల పెట్టుబడులు!

ABN , First Publish Date - 2021-05-05T06:52:41+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టులపై కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ దాదాపు రూ.500-600 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది...

కోరమాండల్‌ రూ.600 కోట్ల పెట్టుబడులు!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టులపై కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ దాదాపు రూ.500-600 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. కరోనా, ఇతర కారణాల వల్ల 2020-21 ఏడాదికి ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులను కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసింది. మెయింటెనెన్స్‌ పెట్టుబడులకు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు కేటాయించాలని భావిస్తోంది. సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ప్లాంట్‌ బ్యాక్‌వర్డ్‌ ఇంటిగ్రేషన్‌పై దృష్టి పెట్టనుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మరింత విస్తరించాలని.. ముడి పదార్థాల విషయంలో వ్యయ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. సస్య రక్షణ విభాగంలో 3-4 మాలిక్యూల్స్‌ను ప్రవేశపెట్టనుంది. 


విశాఖలో ఎవాపరేటర్‌ ప్లాంట్‌: గాఢ ఫాస్పారిక్‌ ఆమ్లం లభ్యతను మెరుగుపరుచుకోవడానికి విశాఖపట్నంలో ఎవాపరేటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయున ఫాస్పారిక్‌ యాసిడ్‌ను కాకినాడ ప్లాంట్‌లోని అవసరాలకు వినియోగించుకోనుంది. విశాఖలోనే పైలట్‌ లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. హైదరాబాద్‌, త్యాగవల్లిలోని ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలను నవీకరిస్తున్నట్లు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎండీ సమీర్‌ గోయెల్‌ తెలిపారు.   


Updated Date - 2021-05-05T06:52:41+05:30 IST