తీగ లాగితే మోసం బయటపడే..!

ABN , First Publish Date - 2021-03-04T07:17:22+05:30 IST

గ లాగితే భారీ మోసం బయట పడింది. ఓ రోడ్డు ప్రమాదం కేసు విచారణ సందర్భంగా లారీలు, ఇతర రవాణా వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాలను సృష్టిం చే ముఠా గుట్టురట్టయింది.

తీగ లాగితే మోసం బయటపడే..!
వివరాలను వెల్లడిస్తున్న కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు

రవాణా వాహనాలకు నకిలీ బీమా పత్రాలు 

గుంటూరు జిల్లాలో ముఠాను  అరెస్ట్‌ చేసిన కందుకూరు పోలీసులు 

వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు 

కందుకూరు, మార్చి 3 : తీగ లాగితే భారీ మోసం బయట పడింది. ఓ రోడ్డు ప్రమాదం కేసు విచారణ సందర్భంగా లారీలు, ఇతర రవాణా వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాలను సృష్టిం చే ముఠా గుట్టురట్టయింది. గుంటూరు జిల్లాకు చెందిన మొత్తం ఐదుగురిని  అరెస్టు చేశారు.  బుధవారం కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో వివరాలను వెల్లడించారు. 2020 అక్టోబరు 20న హైవేపై గుడ్లూరు మండలం శాంతినగర్‌ రోడ్డు క్రాసింగ్‌ బ్రిడ్జిపైన అర్ధరాత్రి సమయంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఓ లారీ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల కు లారీ డ్రైవర్‌ వసంతవరపు శ్రీను ఫ్యూచర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి సంబంధించినవిగా పేర్కొంటూ నకిలీ ధ్రువపత్రాలను అందించారు. ఆ పత్రాలతో మృతుల కుటుంబీకులకు బీమా కోసం క్లైం చేయగా మంజూరు కాలేదు. అవి నకిలీ  పత్రాలని తేలటంతో ఆ కంపెనీ మేనేజరు రూపినేని వేణుబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు  విచారణ ప్రారంభించారు. తొలుత కారంపూడిలో లారీడ్రైవర్‌ వసంతవరపు శ్రీనుని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అక్కులూరి గాంధీ, వెహికిల్‌ కన్సల్టెన్సీగా పనిచేస్తున్న షేక్‌ గౌస్‌బాషా, గొల్లపల్లి వెంకటకృష్ణ, ఇన్సూరెన్స్‌ ఏజెన్సీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ సయ్యద్‌ మస్తాన్‌షరీఫ్‌ సహాయంతో ఈ వ్యవహారం పెద్దఎత్తున నడుస్తున్నట్లు నిర్థారణకు వచ్చారు. దీంతో గాంధీ, గౌస్‌బాషా, వెంకటకృష్ణలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ వ్యవహారానికి సూత్రధారి కంప్యూటర్‌ ఆపరేటర్‌ మస్తాన్‌ షరీఫ్‌ అని తేల్చారు. వారిని అదుపులోకి తీసుకున్నాక నరసరావుపేటలోని మస్తాన్‌ షరీఫ్‌ పనిచేసే కార్యాలయానికి పోలీసులు వెళ్లగా ఆయన నకిలీ బీమా పత్రాలను సృష్టించే పనిలో బిజీగా ఉన్నాడు. అతని వద్ద సిద్ధంగా ఉన్న వివిధ కంపెనీలకు చెందిన  నకిలీ పత్రాలు, కంప్యూటర్‌ ప్రింటర్‌, హార్డ్‌డిస్క్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి పంపించామని డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో కందుకూరు సీఐ విజయకుమార్‌ పాల్గొన్నారు.




Updated Date - 2021-03-04T07:17:22+05:30 IST