ఛిద్రమైన పుచ్చకాయలను చూస్తూ పెద్దాయన కన్నీరు..

ABN , First Publish Date - 2022-04-16T23:03:11+05:30 IST

ధర్వాడ్ : కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు విక్రయిస్తున్న పండ్లు కళ్లెదుటే నేలపాలయ్యాయి. బతుకుబండిని నడిపిస్తున్న తోపుడుబండి ముక్కలుచెక్కలైంది.

ఛిద్రమైన పుచ్చకాయలను చూస్తూ పెద్దాయన కన్నీరు..

ధర్వాడ్ : కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు విక్రయిస్తున్న పండ్లు కళ్లెదుటే నేలపాలయ్యాయి. బతుకుబండిని నడిపిస్తున్న తోపుడుబండి ముక్కలుచెక్కలైంది. ఛిద్రమైన పుచ్చకాయలను చూస్తూ కంటతడి పెట్టడమే 6 పదుల వయసు దాటిన ఓ పెద్దాయనకు ఎదురైంది. సాక్షాత్తూ ఆ హనుమంతుడి గుడి ఆవరణలోనే ఓ వృద్ధుడికి ఎదురైన ఈ పరాభవం కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ధర్వాడ్‌కు సమీపంలోని నుగ్గికేరి గ్రామంలో హనుమంత ఆలయం ఆవరణలో నిబీసాబ్ కిల్లెదార్ దాదాపు 20 ఏళ్ల నుంచి పండ్లను విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఏడు రోజుల క్రితం వరకు ఆయన వ్యాపారం సాఫీగానే కొనసాగింది. కానీ ఏప్రిల్ 9న జీవితంలో ఎన్నడూ ఎదురవ్వడని పరాభవం ఎదురైంది. ఓ సంస్థకు చెందిన 10 మంది సభ్యులు ఆగ్రహంతో తన తోపుడు బండి, పుచ్చకాయలను ధ్వంసం చేశారని నబీసాబ్ ఆవేదనకు గురయ్యాడు. హనుమంత గుడి వద్ద  గతంలో ఎప్పుడూ ఇలాంటి వివక్షకు గురికాలేదని పెద్దాయన కళ్లు చెమర్చాడు. ఘటన జరిగిన రోజును గుర్తుచేస్తూ.. తన పండ్లు, తోపుడు బండిని ధ్వంసం చేస్తున్నా పోలీసులు మౌనంవహించారు. అస్సలు కలుగజేసుకోలేదని చెప్పాడు. 


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టింది. కర్ణాటకలో ప్రముఖ రాజకీయ నాయకులు సైతం స్పందించారు. నబీసాబ్‌కు ఆర్థిక సాయాన్ని అందించేందుకు నిధుల సేకరణ ప్రచారాన్ని మొదలుపెట్టారు. నబీసాబ్ ఖాతాలో కొంత డబ్బు జమ అయ్యింది. ఆర్థిక సాయంపై నబీసాబ్ స్పందిస్తూ.. ‘‘ నా అకౌంట్‌కు ఎవరెవరు డబ్బులు పంపించారో నాకు తెలియదు. ఖాతాలో కొంత డబ్బు జమఅయినట్టు కొన్ని మెసేజులు వచ్చాయి. నాకు తోడుగా నిలిచిన అందరికీ రుణపడి ఉంటాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అనుమతిస్తే.. మళ్లీ ఎప్పటిలాగానే హనుమంత గుడి వద్ద భక్తులకు పండ్లను విక్రయించాలనుకుంటున్నట్టు మనసులో మాట చెప్పాడు. దాదాపు 100 ఏళ్లుగా అందరం ఇక్కడే కలిసి బతుకుతున్నాం. ఇక్కడి ముస్లింలు, హిందువులు కలిసి తింటారు, కలిసి పనిచేసుకుంటారు. గత నాలుగైదు తరాలుగా ఇక్కడ ఇదే కొనసాగుతోంది. నా తోపుడు బండిని ధ్వంసం చేసినవారు వేరే గ్రామానికి చెందినవారు. నాకు తెలిసిన హిందూ స్నేహితులు కాదు. పుట్టుకతోనే ముస్లింగా పుట్టాను. కానీ హనుమాన్ చాలీసా లేదా ఇతర శ్లోకాలు కంఠస్తం చేయకుండా నా మతం అడ్డురాలేదు.’’ అని నబీసాబ్ అన్నాడు. 


కాగా నిందితులను నిలువరించకుండా పోలీసులు కలగజేసుకోలేదనే విమర్శలపై కర్ణాటక డీజీ, ఐజీపీ స్పందించారు. ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదయ్యిందని ఆయన వెల్లడించారు. ఈ ఘటన వెనుకున్న నలుగురు కీలకమైన నాయకులను అరెస్ట్ చేశామని, జ్యుడీషియల్ కస్టడీకి పంపించామని ఆయన వివరించారు. ఇలాంటి ఘటనలకు సహించబోమని హెచ్చరించారు.

Updated Date - 2022-04-16T23:03:11+05:30 IST