ప్రజలను ప్రసన్నం చేసుకునేలా పోలీసుల వినూత్న సేవలు!

ABN , First Publish Date - 2020-04-03T20:39:38+05:30 IST

లాక్‌డౌన్ సందర్భంగా రోడ్ల మీదికి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తుండడంపై ప్రజల నుంచి...

ప్రజలను ప్రసన్నం చేసుకునేలా పోలీసుల వినూత్న సేవలు!

బెంగళూరు: లాక్‌డౌన్ సందర్భంగా రోడ్ల మీదికి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తుండడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో బెంగళూరు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు ఏదైనా అవసరమైతే 100 నంబర్‌కి డయల్ చేయాలనీ... మరుక్షణమే పోలీస్ పెట్రోల్ వాహనాలు ఇంటి ముందు ఉంటాయని చెబుతున్నారు. దాదాపు 250 పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు ఇప్పటి వరకు 4500 మంది అవసరాల్లో పాలుపంచుకున్నాయని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు వెల్లడించారు.


‘‘డయాలసిస్‌, కీమోథెరపీలకు వెళ్లాల్సిన పేషెంట్లతో పాటు గర్భిణీ స్త్రీలను ఆస్పత్రులకు తరలించాం. గుండె సమస్యలు ఉన్నవారి నుంచి వచ్చిన ఎమర్జెన్సీకాల్స్‌ పైనా పలుమార్లు స్పందించాం. ఇలా చేసేందుకు మా వాహనాలేమీ టాక్సీ సర్వీసులు కాదు.. అయితే సంక్షోభ సమయంలో ఉన్నందున విధి నిర్వహణలో భాగంగానే ఈ మేరకు స్పందిస్తున్నాం..’’ అని బెంగళూరు పోలీస్ చీఫ్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న కారణంగా ప్రజలెవరూ బయటికి రాకూడదనీ.. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తమకు ఫోన్ చేయాలన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లడడమే కాకుండా చికిత్స ముగిసిన తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే తిరిగి ఇంటికి తీసుకెళ్తామన్నారు. నిత్యావసరాల కోసం మాత్రం ఎవరికి వారే సమీపంలోని షాపులకు వెళ్లిరావాలని భాస్కర్ రావు సూచించారు. 

Updated Date - 2020-04-03T20:39:38+05:30 IST