భోగి మంటల్లో సాగుచట్టాల ప్రతులు

ABN , First Publish Date - 2021-01-14T07:27:17+05:30 IST

భోగి మంటల్లో సాగుచట్టాల ప్రతులు

భోగి మంటల్లో సాగుచట్టాల ప్రతులు

ఖలిస్థాన్‌ జెండా ఎగరేస్తే 2.5 లక్షల డాలర్ల రివార్డ్‌.. నిషేధిత సంస్థ ప్రకటన


న్యూఢిల్లీ/చండీగఢ్‌, జనవరి 13: కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు ఆ చట్టాల ప్రతులను భోగి మంటల్లో దహనం చేసి తమ అసంతృప్తి ప్రకటించారు. పంజాబ్‌, హరియాణాల్లో ఽరబీ పంట ధాన్యపురాశులు ఇంటికి చేరే ఈ సమయాన్ని లోహ్రీ పేరుతో పండగగా జరుపుకుంటారు. మంటలు వేసి వాటిలో ధాన్యపు గింజలు, ఇతర సరకులు విసురుతూ ఆ మంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ఈ సారి లోహ్రీని (భోగి- సంక్రాంతి) సింఘూ, టిక్రీ సరిహద్దు పాయింట్ల వద్ద జరుపుకున్న రైతులు లక్షలాది సాగు చట్టాల కాపీలను ఆ మంటల్లో వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ నుంచి పంజాబ్‌, హరియాణ మార్గాల వెంబడి అంతటా వందల కొద్దీ భోగిమంటలు వేశారు. కాగా, రిపబ్లిక్‌ దినోత్సవం రోజున ఇండియా గేట్‌ వద్ద ఖలిస్థానీ జెండా ఎగరేసిన వారికి రెండున్నర లక్షల డాలర్ల మొత్తాన్ని బహుమతిగా ఇస్తామని ఓ నిషేధిత ఉగ్రవాద సంస్థ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌జేఎఫ్‌) ప్రకటించింది. ప్రత్యేక ఖలిస్థాన్‌ ఏర్పాటే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంస్థను 2019లోనే భారతప్రభుత్వం నిషేధించింది. ఈ సంస్థ తాజా ప్రకటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నది. ఆ గ్రూపు కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఈ సంస్థ మాటలతో ఎవరైనా ప్రభావితులై అవాంఛనీయ చర్యలకు దిగితే, వారిపై  దేశద్రోహ నేరం కింద విచారణ జరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాశ్‌ చౌదురి హెచ్చరించారు.  రైతుల ఆందోళనలో ఖలిస్థానీ ఉగ్రవాదులు జొరబడ్డారని సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం తెలియపర్చింది. దీనికి ఎస్‌జేఎఫ్‌ ప్రకటనను కూడా జతచేసి అటార్నీ జనరల్‌ గురువారం అఫిడవిట్‌ను సమర్పించనున్నారు.

Updated Date - 2021-01-14T07:27:17+05:30 IST