ఫుట్‌బాల్‌ పండుగ

ABN , First Publish Date - 2021-06-12T10:38:05+05:30 IST

ఎన్నో రోజులుగా ఫుట్‌బాల్‌ ప్రేమికులు ఎదురుచూస్తున్న సాకర్‌ సమరం వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి యూరో కప్‌ మొదలవగా.. దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ ఆధ్వర్యంలో

ఫుట్‌బాల్‌ పండుగ

రేపటి నుంచి కోపా అమెరికా కప్‌

మొదలైన ‘యూరో’ సమరం


బ్రెజీలియా:  ఎన్నో రోజులుగా ఫుట్‌బాల్‌ ప్రేమికులు ఎదురుచూస్తున్న సాకర్‌ సమరం వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి యూరో కప్‌ మొదలవగా.. దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ ఆధ్వర్యంలో కోపా కప్‌ ఆదివారం నుంచి జరగనుంది. మొత్తం పది దేశాల మధ్య జరిగే కోపా కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బ్రెజిల్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్రెజిల్‌లోని ఐదు వేదికల్లో సందడి చేయనున్న ఈ మెగా ఈవెంట్‌ వచ్చేనెల 10న ముగియనుంది. పది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడుతున్న ఈ టోర్నీ నాకౌట్‌ పద్ధతిలో జరగనుంది.


గ్రూప్‌-ఎ (నార్త్‌జోన్‌) నుంచి అర్జెంటీనా, బొలీవియా, చిలీ, పరాగ్వే, ఉరుగ్వే.. గ్రూప్‌-బి (సౌత్‌జోన్‌) తరఫున ఆతిథ్య బ్రెజిల్‌, కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, వెనిజులా పాల్గొంటున్నాయి. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో టైటిల్‌ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న బ్రెజిల్‌తో వెనిజులాతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. జూనియర్‌ నెమార్‌ సారథ్యంలోని బ్రెజిల్‌కు స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ ఆధ్వర్యంలోని అర్జెంటీనా జట్టు గట్టి పోటీ ఇవ్వనుంది. 


‘యూరో’ పదకొండు దేశాల్లో..:  మొత్తం 24 జట్లు ఆరు గ్రూపులుగా విడిపోయి పోటీపడుతున్న యూరో కప్‌లో ఈసారి ఏకంగా 11 దేశాల్లో నిర్వహిస్తుండడం విశేషం. వచ్చేనెల 12న ఫైనల్‌ జరగనుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి రోమ్‌లో ఆతిథ్య ఇటలీ, టర్కీ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్‌ జరిగింది. ఈ టోర్నీ తెలుగు వీక్షకుల కోసం సరికొత్తగా ఆవిష్కరించిన సోనీటెన్‌-4 చానెల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వాస్తవానికి ఈ రెండు టోర్నీలు షెడ్యూల్‌ ప్రకారం నిరుడు జరగాల్సి ఉన్నా.. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. కరోనా ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ కొద్ది మంది ప్రేక్షకులను యూరో కప్‌ మ్యాచ్‌లకు అనుమతించారు.

Updated Date - 2021-06-12T10:38:05+05:30 IST