అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత.. 10 మంది మృతి!

ABN , First Publish Date - 2021-03-23T14:12:56+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. కొలరాడోలోని బౌల్డర్ నగరంలో ఓ సూపర్ మార్కెట్‌లో ప్రవేశించిన సాయుధుడు విచక్షణ రహితంగా కాల్పులకు తెబడ్డాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 10 మంది మృతి చెందారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని కొలరాడో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత.. 10 మంది మృతి!

బౌల్డర్, కొలరాడో: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. కొలరాడోలోని బౌల్డర్ నగరంలో ఓ సూపర్ మార్కెట్‌లో ప్రవేశించిన సాయుధుడు విచక్షణ రహితంగా కాల్పులకు తెబడ్డాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 10 మంది మృతి చెందారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని కొలరాడో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొలరాడోలోని బౌల్డర్ నగరంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. స్థానిక కింగ్ సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి వినియోగదారులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఓ పోలీస్ అధికారి సహా పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. చనిపోయిన పోలీస్ అధికారిని ఎరిక్ టాల్లీగా గుర్తించారు. 


కాగా, కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీస్ చీఫ్ మారిస్ హెరొల్డ్ తెలిపారు. ఈ ఘటనపై కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఇదొక మతిలేని చర్య అని జారెడ్ అన్నారు. అలాగే బౌల్డర్ మేయర్ సామ్ వీవర్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక అట్లాంటాలో వారం రోజుల కింద ఆసియా మసాజ్ పార్లర్లే లక్ష్యంగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరవకముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరం.   



Updated Date - 2021-03-23T14:12:56+05:30 IST