సమన్వయమే సహజీవన బాట

ABN , First Publish Date - 2022-05-27T06:13:04+05:30 IST

గతంలో కూల్చివేతకు గురైన దేవాలయాలను ‘పునరుద్ధరించాలని’ కోరేవారితో ఎలా వాదించాలి? పాఠశాలలో నేను చర్చల్లో ఆసక్తిగా పాల్గొనేవాణ్ణి. చర్చలో తొలుత నీ ప్రత్యర్థుల అభిప్రాయాలకు అనుకూలమైన వాదనలను నివేదించమని...

సమన్వయమే సహజీవన బాట

గతంలో కూల్చివేతకు గురైన దేవాలయాలను ‘పునరుద్ధరించాలని’ కోరేవారితో ఎలా వాదించాలి? పాఠశాలలో నేను చర్చల్లో ఆసక్తిగా పాల్గొనేవాణ్ణి. చర్చలో తొలుత నీ ప్రత్యర్థుల అభిప్రాయాలకు అనుకూలమైన వాదనలను నివేదించమని మా నాన్నగారు చెపుతుండేవారు. వారి వాదనలను తిరస్కరించడం లేదా పరిహసించడం కాకుండా, సమర్థించే సూక్ష్మ అంశాలను పేర్కొనాలని ఆయన సూచించేవారు. మరి నా ప్రత్యర్థులు ఎప్పుడూ అంత తెలివైన వాదనలు విన్పించేవారుకాదని నేను అనేవాణ్ణి. అయినా మా నాన్న నాతో ఏకీభవించేవారుకాదు. నీవు నీ ప్రత్యర్థి అభిప్రాయాలను నిష్పాక్షికంగా నివేదించకపోతే నీ అనంగీకారాన్ని ఎవరూ పట్టించుకోరని ఆయన గట్టిగా చెప్పేవారు. ఆయన తన జీవితమంతా ‘ఇతరుల’ దృక్పథాన్ని సానుభూతితో వివరించి, ఆ తరువాత తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెపుతుండేవారు.


మా నాన్నగారు ఇచ్చిన మేధో శిక్షణ స్ఫూర్తితోనే నేను జేఎన్‌యూలో ప్రొఫెసర్ రాజీవ్ భార్గవ రాజకీయ తత్వ శాస్త్ర కోర్సులను తీసుకున్నాను. మా నాన్న తన సహజ జ్ఞానంతో ఇచ్చిన శిక్షణను ప్రొఫెసర్ భార్గవ మరింత శాస్త్రీయంగా ఇచ్చారు. ఒక వాదన నీకు ఇష్టం లేదు గనుక దాన్ని తిరస్కరించడం సమంజసమైన విషయం కాదని, తర్కరహిత వాదనలను తార్కికంగా పరిశీలించవలసిన అవసరముందని ఆయన నేర్పారు. నిజానికి ఇది భారతీయ తత్వశాస్త్ర సంప్రదాయమని ఆ తరువాత నేను తెలుసుకున్నాను.


జ్ఞాన్‌వాపి మసీదు ఘర్షణతో వివాదాస్పద స్థలాలలో తాజాగా తవ్వకాలు ప్రారంభమైన నేపథ్యంలో నేను ఈ విషయాల గురించే ఆలోచిస్తున్నాను. ఏమిటీ ఉన్మాదమని నేను ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాలలో కీర్తిశేషుడైన మా నాన్నగారి వివేచనాయుత, వివేకశీల వాణి నాకు విన్పించేది: వారి యథార్థ వాదనలను నీవు నిష్పాక్షికంగా పరిగణనలోకి తీసుకున్నావా?


కూల్చివేత లేదా అపవిత్రీకరణకు గురైన దేవాలయాలను పునరుద్ధరించాలన్న వాదనను విపులంగా చూద్దాం. గతాన్ని మరచిపోవాలనే వాదన, ఒక సామాజిక సముదాయానికి విలక్షణ అస్తిత్వాన్ని ఇచ్చే చారిత్రక స్మృతులకు అన్యాయం చేస్తుంది. చారిత్రక తప్పులను సరిదిద్దాలన్న భావన ప్రపంచ సమాజాలన్నీ అంగీకరిస్తున్న ఒక సార్వజనీన సూత్రం. ఆదివాసీలు లేదా మూలవాసుల హక్కుల విషయంలో ఈ భావనను ఉపయోగించి వారికి కొంతలో కొంత న్యాయం చేయడం జరుగుతోంది. చారిత్రక అన్యాయం అనేది మన దేశంలో కులాధారిత రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఉన్నదని మరి చెప్పనవసరం లేదు. మరి ఆ వాదనను హిందువులకు జరిగిన చారిత్రక అన్యాయాలకూ ఎందుకు వర్తింపచేయకూడదు? భారత్‌కు విజేతలుగా వచ్చిన ముస్లిం పాలకులు హిందువులకు పలు విధాల అన్యాయం చేశారు. ముఖ్యంగా వారి ప్రార్థనా స్థలాలను కూల్చివేశారు, లేదంటే అపవిత్రీకరించారు. నిస్సహాయులై పోయిన హిందువులు తమకు జరిగిన ఈ అన్యాయాల పట్ల ఆలోచించలేకపోయారు. ఆలోచించినా ఏమీ చేయలేని అసహాయ స్థితి కదా వారిది. మసీదులను నిర్మించేందుకు ధ్వంసం చేసిన దేవాలయాలను పునరుద్ధరించడం ఒక ప్రత్యార్పణ చర్య. జరిగిన తప్పును సరిదిద్దే సత్సంకల్పం. ఇది హిందువుల సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. తద్వారా భారతీయనాగరికత, జాతి పునరుజ్జీవానికి దోహదం చేకూరుతుంది.


ప్రత్యర్థి పక్షం వారి వాదనలకు నా యీ సంక్షేపాన్ని మా నాన్న అంగీకరించి ఉండేవారని నేను భావిస్తున్నాను. ఆయన దృక్పథాన్ని అనుసరించి నా ‘గౌరవనీయ ప్రత్యర్థుల’తో ఎక్కడ ఏకీభవిస్తున్నానో కూడా వివరిస్తాను. చారిత్రక అన్యాయాలను విస్మరించలేమనే వారి వాదన సహేతుకమే. ముస్లిం పాలకులు హిందూ ఆలయాలను ధ్వంసం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేయడం పూర్తిగా అర్థం చేసుకోదగిన విషయమే. అసలు ఏ సామాజిక సముదాయానికైనా పవిత్రమైన ఒక స్థలాన్ని లేదా కట్టడాన్ని ధ్వంసం చేయడం తప్పు అనడంలో సందేహం లేదు. అందునా రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకుని ఉద్దేశపూర్వకంగా అటువంటి విధ్వంసక చర్యకు పాల్పడడం నిస్సహాయ ప్రజలను మరింతగా అవమానపరచడమే. ఇది వారికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఆ బాధిత హృదయాలను మరింతగా కలవరపరుస్తుంది.


మరి దేవాలయాల పునరుద్ధరణకు అటువంటి పరిస్థితి సరైన సందర్భమవుతుందా? నాలుగు అదనపు పరిస్థితులను కూడా మనం పరిగణనలోకి తీసుకోవలసిన అవసరముంది. ధ్వంసమైన దేవాలయాల పునరుద్ధరణ అనేది నేడు మనం సరిదిద్దవలసిన అవసరం ఉన్న ప్రధాన చారిత్రక అన్యాయమై ఉండాలి. ఇది మొదటి షరతు. రెండో షరతు– బాధితుడి, అన్యాయం చేసిన వాడి వారసులుగా స్పష్టంగా గుర్తింపబడేవారు వర్తమాన సమాజంలో ఉండి తీరాలి. మూడో షరతు–చారిత్రక అన్యాయం వల్ల జరిగిన హాని ‘బాధిత’ సమాజాన్ని ఇప్పటికీ ప్రతికూలంగా కొనసాగుతూ ఉండి తీరాలి. నాలుగో షరతు– ప్రతి పాదిత కార్యాచరణ అంటే ప్రస్తుత సందర్భంలో దేవాలయాల పునరుద్ధరణ అనేది చారిత్రకంగా సంక్రమించిన అన్యాయాన్ని తొలగించి, సమాజం స్మృతిలో ఆ చారిత్రక తప్పుకు తావులేకుండా చేసేందుకు సహాయపడాలి. నిజం చెప్పాలంటే దేవాలయాల పునరుద్ధరణ అనేది ఈ నాలుగు పరీక్షలలోనూ విఫలమయింది.


ఎందుకు విఫలమయిందో చూద్దాం. భారతదేశ చరిత్రలో ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడమనేది ప్రార్థనా స్థలాల విధ్వంసానికి ఏకైక నిదర్శనం కాదు. ఇదొక్కటి మాత్రమే మనం శ్రద్ధచూపవలసిన చారిత్రక అన్యాయం కాదు. యుద్ధాల్లో విజయం సాధించిన హిందూరాజులు హిందూ ఆలయాలను కూల్చివేయడం జరిగింది. అలాగే హిందూరాజులు జైన మత ఆరాధనా మందిరాలు, బౌద్ధ విహారాలు ఎన్నిటినో కూల్చివేశారు. ఈ తరహా విధ్వంసక చర్యలకు దేశచరిత్రలో అనేకానేక ఉదాహరణలు ఉన్నాయి. దేశ విభజన సమయంలో వాఘా సరిహద్దుకు ఈవల ఎన్నో మసీదులను, ఆవల అసంఖ్యాక ఆలయాలను ధ్వంసం చేశారు. ‘వివాదాస్పద’ మసీదులను కూల్చివేసి, ఆలయాలను పునరుద్ధరించాలనే వాదన కొన్ని సుప్రసిద్ధ హిందూ దేవాలయాలతో సహా పలు ఇతర ఆరాధనా మందిరాలను కూల్చివేయాలనే డిమాండ్‌ను అనివార్యం చేస్తుంది.


వర్తమాన హిందూ సమాజం చారిత్రక అన్యాయానికి బాధితురాలని, వర్తమాన ముస్లిం సమాజం ఆ చారిత్రక అన్యాయానికి పాల్పడిన వర్గమనే భావనే పూర్తిగా అసత్యం. ఏమాత్రం సమంజసత్వం లేని వాదన అది. ఎందుకంటే వారసత్వ అనుబంధాలు అనేవి చాలా సంక్లిష్టమైనవి. మధ్యయుగాల భారతదేశంలో మొగల్ పాలకులు చారిత్రక అన్యాయాలకు పాల్పడ్డారని అనుకుందాం. నేటి ముస్లింలను వారి వారసులుగా పరిగణించడంలో తర్కమేమైనా ఉందా? మరి మొగల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం సామాజిక వర్గాల విషయమేమిటి? రాజ్‌పుట్‌లు, ఇతర హిందూ కులీనులు మొగల్ చక్రవర్తులకు పూర్తిగా సహకరించలేదా? ఆ కాలంలో, తమ పూర్వీకులు హిందువులుగా ఉన్న నేటి ముస్లిం సామాజిక సముదాయాల విషయమేమిటి? తమకు జరిగిన చారిత్రక అన్యాయాలకు గాను నేడు ఆ ముస్లింలను శిక్షించాలనడంలో సహేతుకత ఉందా?


దేవాలయాల విధ్వంసం వల్ల హిందువులు, ముస్లింల మధ్య శాశ్వత విరోధ భావం నెలకొందని, ఐదు శతాబ్దాల అనంతరం కూడా అది కొనసాగుతూనే ఉందనే వాదన సబబేనా? ముస్లింల పాలనలో ముస్లిం ప్రజలు మాత్రమే అన్ని విధాల లబ్ధి పొందారని, హిందువులకు తీరని అన్యాయాలు జరిగాయని అంటున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంలో కులీన ముస్లింలు పొందిన ప్రయోజనాలు అన్నీ బ్రిటిష్ వారి పాలనలో ఒక్కసారిగా సమసిపోలేదా? వర్తమాన భారతదేశంలో ముస్లింలు, హిందువుల కంటే అన్ని విధాల తక్కువ స్థాయిలో ఉన్నారని 2006లో సచార్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది.


ఒక మతానికి చెందిన కట్టడాలను కూల్చివేపి వాటి స్థానంలో మరో మత నిర్మాణాలను పునరుద్ధరించడం అనేది సమస్యకు పరిష్కారం కానేకాదు. అసలు అది ఎంత మాత్రం వివేకవంతమైన చర్య కాదు. అది ఏదైనా సాధిస్తుందేమోకానీ సమస్యకు న్యాయబద్ధమైన ముగింపును ఇవ్వదు, ఇవ్వబోదు. అసలు ఇవ్వలేదు కూడా. దేవాలయాల పునరుద్ధరణకు సంబంధించి ప్రస్తుత డిమాండ్ న్యాయం గురించి కాకుండా విజయం సాధించడం గురించి మాత్రమే అని చెప్పక తప్పదు. ప్రతీకారం తీర్చుకోవడంలో అది సఫలమవుతుందేమో కానీ, ఘర్షణ పడుతున్న ఉభయ వర్గాల మధ్య సమన్వయాన్ని సాధించలేదు ముస్లింలలో అభద్రతా భావాన్ని, సకల రంగాలలో వారికి ప్రతికూల పరిస్థితులను మాత్రమే మరింతగా పెంచుతుంది. మరో చారిత్రక అన్యాయానికి అది ఆరంభం మాత్రమే అవుతుంది. మన సమాజంలోనూ, మన జాతి జీవితంలోనూ విభేదాలు మరింతగా పెచ్చరిల్లుతాయి. మరి మార్గాంతరమేమిటి? 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో మత సంబంధిత కట్టడాలు ఏవైనా సరే ఏ రూపంలో ఉన్నాయో అదే రూపంలో కొనసాగి తీరాలి. వాటి స్థితిగతులను ఎట్టి పరిస్థితులలోనూ మార్చకూడదు. ‘ప్రార్థనా స్థలాల చట్టం–1991’ చెప్పింది కూడా ఇదే కదా. ఆ చట్టం మనకు మార్గదర్శి కావాలి. మత కట్టడాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకునేందుకు మనం దాన్ని ఔదల దాల్చాలి. అది మన దేశ చట్టం (నిజానికి ఆ చట్టాన్ని ఏ రోజు అయినా రద్దుచేసే అవకాశం ఎంతైనా ఉన్నది) అయినందువల్ల కాకుండా మన నాగరీక మనుగడను క్రమబద్ధీకరించినందునే దాన్ని మనం విధిగా గౌరవించి, పాటించాలి. సర్దుబాటుతో సహజీవనం నెరపేందుకు అవసరమైన పద్ధతులు ఇప్పుడు మనకు అవసరం. ఇందుకు మనం విధ్వంస సత్యాలను అంగీకరించాలి. కేవలం హిందువుల విషయంలో మాత్రమేకాదు, ఇతర మతాల వారూ తమ ప్రార్థనా స్థలాల అపవిత్రీకరణ, కూల్చివేతల వల్ల తీవ్ర మనస్తాపానికి గురయారన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలి. మరి ఘర్షణ పడుతున్న ఉభయ వర్గాల మధ్య సమన్వయానికి మార్గమేది? జ్ఞాన్‌వాపినే అడగడం మంచిదేమో?!


యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2022-05-27T06:13:04+05:30 IST