Abn logo
Mar 4 2021 @ 03:17AM

త్వరలో సహకార చట్ట సవరణలు

ఆర్థిక అంశాల్లో రాజకీయ జోక్యం వద్దు

బోర్డుల్లో నిపుణులను నియమించాలి

ప్యాక్స్‌ ఆడిటింగ్‌పై థర్డ్‌పార్టీ విచారణ 

సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు


అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సహకార వ్యవస్థ బలోపేతానికి త్వరలో చట్ట సవరణలు తేవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని, సహకార సంస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. డీసీసీబీల పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల స్వభావం పోవాలని, పీఏసీఎ్‌సల్లో క్రమం తప్పకుండా ఆడిటింగ్‌ జరపాలని, రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే థర్డ్‌పార్టీతో స్వతంత్రంగా విచారణ చేయించాలని సూచించారు. ఆప్కాబ్‌, డీసీసీబీల్లో నిపుణులను నియమించాలని, వ్యవసాయ, బ్యాంకింగ్‌, ఆర్థిక అకౌంటెన్సీల్లో నిపుణులైనవారిని బోర్డుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సహకార రంగం పునర్‌వ్యవస్థీకరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని, వాటి లైసెన్సులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. 45% పీఏసీఎ‌స్‌లు పూర్తి నష్టాల్లో ఉన్నాయని, 49% మండలాలకు డీసీసీబీల నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని, దీని వల్ల రుణాలు తక్కువగా ఇవ్వడం, కేవలం పంట రుణాలకే పరిమితం కావడం, మోసాలకు అవకాశం ఏర్పడుతోందని అధికారులు వివరించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ ‘ఆప్కాబ్‌, డీసీసీబీ, ప్యాక్స్‌ బోర్డుల్లో మూడింట ఒక వంతు మందిని డైరెక్టర్లుగా నియమించాలి. సగం మంది ప్రతి రెండున్నరేళ్లకు విరమించేలా సహకార ప్యాక్స్‌ చట్ట సవరణ తీసుకురావాలి. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకులను పీఏసీఎస్‌ సభ్యులుగా తీసుకురావాలి. సహకార రంగంలో సమగ్ర బ్యాంకింగ్‌ సేవల కోసం ఆప్కాబ్‌, డీసీసీబీలు, పీఏసీఎ్‌సలను 3నెలల్లో కంప్యూటరీకరించాలి. ప్రతి 3 ఆర్బీకేలకు ఒక పీఏసీఎస్‌ ఉండేలా చూడాలి. సహకార సంస్థలను సమర్థవంతంగా నడిపేందుకు యాజమాన్య పద్ధతుల్లో నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసె్‌స-నాబ్కాన్స్‌ సిఫారసులపై దృష్టిపెట్టాలి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేపట్టే కార్యక్రమాలకు డీసీసీబీలు దన్నుగా నిలవాలి. సహకార బ్యాంకుల మార్కెట్‌ షేర్‌ 20% వరకు పెంచాలి.  ఆర్బీకేలకు ఆర్థికంగా అండగా ఉండే లా డీసీసీబీల రుణ ప్రణాళికలు తయారు చేయాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసే ఎంఎస్‌ఎంఈలకు దన్నుగా ఉండేలా డీసీసీబీ రుణ ప్రణాళికలు ఉండాలి.


ఈ మేరకు చట్టసవరణలు చేపట్టాలి’ అని అధికారులను సీఎం ఆదేశించారు. సహకార చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్‌ ఉత్పత్తిపై దృష్టి పెడితే, చక్కెర మిల్లులకు ఊరట లభిస్తుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూ.12వేల కోట్లతో చేపడుతున్న మల్టీపర్పస్‌ సెంటర్లపై సమీక్షించి, గోడౌన్ల నిర్మాణానికి ఏప్రిల్‌ 15కల్లా టెండర్లు ఖరారు చేసి, ఏడాదిలోగా వీటిని పూర్తి చేసి, రైతులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కాగా, అమూల్‌ ప్రాజెక్ట్‌ను మిగతా జిల్లాలకు విస్తరిస్తున్నామని, గేదెపాలు, ఆవుపాలకు గతంలో కంటే ప్రస్తుతం రైతుకు ఎక్కువ ధర వస్తోందని అధికారులు  సీఎంకు చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement