Abn logo
Jan 14 2021 @ 03:20AM

సహకార ఆర్థికమే ప్రత్యామ్నాయం

రైతులు మరోసారి చరిత్రాత్మక ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయక ఉత్పత్తుల అమ్మకాలపై నియంత్రణలను ఎత్తివేసి, వాటి క్రయవిక్రయాలలో ప్రైవేట్ వ్యాపారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్న కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు తమ ఆగ్రహాన్ని ప్రశాంతంగా, దృఢ నిశ్చయంతో వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లలో రైతుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తున్న చట్టాలలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు సేద్యరంగానికి హానికరమైనవని ఆందోళనకారులు ఘోషిస్తున్నారు. ఆ కొత్త చట్టాల వల్ల తాము ఆదాయ భద్రతనే కాదు, అసలు తమ భూములను సైతం కార్పొరేట్ కంపెనీలకు కోల్పోవలసిన విపత్కర పరిస్థితి దాపురించనున్నదని రైతులు అమితంగా వ్యాకులపడుతున్నారు.


మార్కెట్ ఆధారిత ఆర్థికవ్యవస్థలో వ్యక్తుల స్వప్రయోజనాలు, వైయక్తిక నిర్ణయాలే ఆర్థిక కార్యకలాపాలను నిర్దేశిస్తాయని 1776లో ప్రచురితమైన తన ‘జాతుల సంపద’ (వెల్త్ ఆఫ్ నేషన్స్)లో ఆడమ్ స్మిత్ (1723–-1790) వివరించాడు. సామాజిక శ్రేయస్సు కోసం స్వేచ్ఛామార్కెట్ల ద్వారా సమాజపు పరిమిత వనరులను ఎలా వినియోగించుకోవాలో వ్యక్తుల ప్రయోజనాలు, నిర్ణయాలే సమష్టిగా నిర్దేశిస్తాయని ఆయన అన్నారు. ప్రతి వ్యక్తీ తన స్వప్రయోజనం కోసం పాటుపడే అవకాశం, స్వేచ్ఛ లభిస్తే జనబాహుళ్యానికి శ్రేయోదాయకమైన ఆర్థికవ్యవస్థ సహజంగానే ఏర్పడుతుందని, తద్వారా ప్రతి వ్యక్తి శ్రేయస్సు సంరక్షించబడుతుందని ఆర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ విశ్వసించారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే పరిపూర్ణ పోటీదాయక మార్కెట్ ద్వారా గిరాకీ–సరఫరా శక్తుల కార్యకలాపాలు, వనరుల కేటాయింపును ప్రభావితం చేసి సామాజిక సామర్థ్యానికి, గరిష్ఠ సామాజిక సంక్షేమానికి దారి తీస్తాయని ఆడమ్ స్మిత్ భావించాడు. అయితే వాస్తవిక ప్రపంచంలో పరిపూర్ణ పోటీ అనేది ‘పరిపూర్ణమైనది’ కాదు. అది న్యాయబద్ధంగానూ ఉండదు. అయినప్పుడు పరిపూర్ణ పోటీ గరిష్ఠ సామాజిక సంక్షేమానికి హామీ పడదు. మార్కెట్లు సామాజిక సామర్థ్యాన్ని సాధించడంలో విఫలమవుతాయి. దీనినే ‘మార్కెట్ వైఫల్యం’ అని ఆర్థికవేత్తలు అంటారు. మార్కెట్ సంప్రదాయ రీతుల్లో పని చేయదనే వాస్తవాన్ని వినియోగదారులు, ఉత్పత్తిదారులకు స్పష్టం చేయడంలో సరుకుల ధరలు విఫలమవడమే మార్కెట్ వైఫల్యం. ఈ ఆర్థిక వాస్తవమే మనదేశంలోని వ్యవసాయ మార్కెట్ల తీరుతెన్నులలో స్పష్టంగా, కచ్చితంగా ప్రతిబింబిస్తోంది. ఫలితంగానే సరుకుల ధరలు ఉత్పత్తిదారులను గానీ, వినియోగదారులను గానీ సంతృప్తిపరచడం లేదు. ఉత్పత్తిదారులను ఆదాయ అభద్రత, వినియోగదారులను ధరల భారం తరచు కుంగదీస్తున్నాయి.


అయితే పన్నులు, సబ్సిడీలు, వేతనాలు, ధరల నియంత్రణలు, ఇతర క్రమబద్ధీకరణల రూపేణా ప్రభుత్వ విధానపరమైన జోక్యాలు సైతం వనరుల కేటాయింపు అసమర్థంగా జరిగేందుకు దారితీస్తాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే వనరుల కేటాయింపు సమరీతిలో నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. మార్కెట్ వైఫల్యం లాంటిదే ఇది కూడా. ఈ రెండు వైఫల్యాలు అటు వ్యక్తుల పైన, ఇటు సమాజం పైన అమిత ఆర్థికభారాన్ని మోపుతాయి. ఈ రెండు వైఫల్యాల నుంచి ఆర్థికవ్యవస్థను ఎలా బయటపడవేయడమనేది విధాననిర్ణేతలను సదా సతమతం చేసే సమస్య. ఈ సమస్యను సమర్థంగా పరిష్కరించేందుకు బ్యాంకింగ్‌రంగంలోనూ, సెక్యూరిటీల క్రమబద్ధీకరణలోనూ ప్రభుత్వం కీలకపాత్ర వహించి తీరాలి. దేశపౌరులు అందరికీ ప్రత్యక్ష నగదు బదిలీ, కాంట్రాక్టులు, ఆస్తిహక్కుల అమలు మొదలైన చర్యల ద్వారా పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరచాలి. ఆర్థికవ్యవస్థలో మార్కెట్, ప్రభుత్వం నిర్వహించాల్సిన పాత్రల మధ్య ఒక సరైన సమతుల్యతను కనుగొనడంతో పాటు మార్కెట్లు, ప్రభుత్వాలకు ఆవల రైతుల సంక్షేమానికి కొత్త సంస్థాగత ఏర్పాట్లకు గల అవకాశాలను అన్వేషించడమే నేడు మన ముందున్న ఒక నిజమైన సవాల్. 


ప్రముఖ అర్థశాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత ఎలినార్ అస్ట్రోం (1933–2012) పరిశోధనలు రైతులకు సంక్షేమాన్ని సమకూర్చే ప్రత్యేక సంస్థాగత ఏర్పాట్ల సుసాధ్యమని నిరూపించాయి. సంపద సృష్టి, మానవశ్రేయస్సుకు రాజ్యవ్యవస్థ, ప్రైవేటీకరణ విధానాలు, మార్కెట్లకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తులు, ప్రభుత్వాలు, మార్కెట్ల మధ్య వివిధ స్థాయిలలో ఉన్న స్వచ్ఛందసంస్థలు, ఉమ్మడిసంఘాలు, ఉత్పత్తిదారుల సంస్థలు, సహకారసంఘాలు, ఉత్పత్తిదారుల కంపెనీలు మొదలైనవి ఉమ్మడి వనరులు సమాజంలోని ప్రతి ఒక్కరి శ్రేయస్సుకు తగినట్లుగా వినియోగమయ్యేందుకు అవసరమైన పద్ధతులు, ప్రక్రియలను రూపొందించగలవన్నది విదితమే. సమర్థమైన, భద్రమైన ప్రత్యామ్నాయ వ్యాపార నమూనాలు అమల్లో ఉన్నాయన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజల యాజమాన్యంలో అటువంటి వినూత్న ప్రత్యామ్నాయ వ్యాపారాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు, వాటి క్రయవిక్రయాలలో 50శాతం నలభైకోట్లమంది రైతులు సభ్యులుగా ఉన్న వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే జరుగుతున్నాయి. ప్రపంచపు అత్యంత సఫల, సుస్థిర ఆర్థిక వ్యవస్థలలోనే ఎంతగానో విజయవంతమైన సహకార ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతుండడం యాదృచ్ఛికమేమీ కాదు. సన్నకారు, చిన్నకారు రైతులను ఆధునిక మార్కెట్లతో సంధానపరచడంలో రైతుల ఉమ్మడిసంఘాలు కీలకపాత్ర వహిస్తున్నాయి. నవీన మార్కెట్‌ల ద్వారా చిన్నరైతులు లబ్ధి పొందేందుకు ఆ సంఘాలు విశేషంగా తోడ్పడుతున్నాయి. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ప్రపంచీకరణ దుష్ఫలితాల నుంచి చిన్న రైతులను కాపాడగలిగేవి, ఆధునిక పోటీదాయక మార్కెట్లలో వారు విజయవంతంగా భాగస్వాములు కావడానికి విశేషంగా తోడ్పడగలిగేవి ఉత్పత్తిదారుల సంఘాలు మాత్రమే అన్న వాదన సహేతుకమైనదే అనడంలో సందేహం లేదు. తమకు అవసరమైన సేద్యపు దినుసులను కొనుగోలు చేసుకోవడంలోనూ, తమ పంట దిగుబడులను విక్రయించుకోవడంలోనూ రైతులకు ఉత్పత్తిదారులసంఘాలు ప్రయోజనకరమైన సహాయ సహకారాలను అందిస్తాయి. క్రయవిక్రయాల లావాదేవీల వ్యయాలు స్వల్పస్థాయిలో ఉంచేందుకు తోడ్పడంతో పాటు ఉత్పాదక కార్యకలాపాలకు అవసరమైన సాంకేతికతలు సమకూర్చడంతో పాటు సామాజిక మూలధనం (సోషల్ కేపిటల్ - పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు మొదలైన సమాజ ఆస్తులు)ను సైతం ఉత్పత్తిదారులసంఘాలు సృష్టిస్తాయి. 


ఇందుకొక తిరుగులేని ఉదాహరణ ‘గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్’. ఈ సహకార సంఘంలో 28లక్షల మంది పాల ఉత్పత్తిదారులు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం వారి అమూల్ బ్రాండ్ ఉత్పత్తులకు మన దేశంలోని ప్రతి కుటుంబమూ ఒక వినియోగదారే అనడంలో అతిశయోక్తి లేదు. ఆ ఉత్పత్తుల నుంచి లభించే ఆదాయంలో 82 శాతాన్ని ఉత్పత్తిదారులకే అప్పగించడం ఒక విశేషం. ఇలా విజయవంతంగా నడుస్తున్న సహకార సంఘాలు ఇంకా అనేకం మనదేశంలో ఉన్నాయి. సన్నకారు, చిన్నకారు రైతుల సంక్షేమం ధ్యేయంగా అటువంటి సహకార సంఘాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 


చిన్న కమతందారులను ‘వ్యవసాయ విలువ గొలుసు’ (అగ్రికల్చరల్ వ్యాల్యూ చైన్ – ఒక వ్యవసాయక ఉత్పత్తి పొలం నుంచి అంతిమంగా వినియోగదారుకు చేరేందుకు అవసరమైన మొత్తం వస్తుసేవలకు సంబంధించి ఈ భావనను ఈ సహస్రాబ్ది ఆరంభం నుంచి వాడుతున్నారు)లో భాగస్వాములను చేసేందుకు భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ నాబార్డ్ ప్రశంసనీయమైన చొరవ తీసుకున్నాయి. ఇందులో భాగమే సభ్యుల ఆధారిత ‘ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్’ (ఎఫ్‌పిఓ)ల ఏర్పాటు. దాదాపు 5000 ఎఫ్‌పిఓలను ఏర్పాటు చేశారు. వీటిలో మూడువేలకు పైగా ఎఫ్‌పిఓలను ప్రొడ్యూసర్ కంపెనీలుగా నమోదు చేశారు. అవసరమైన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో పాటు ఉత్పత్తుల విక్రయాలకు అవసరమైన మార్కెట్ సదుపాయాలు కల్పించడంలో కూడా రైతులకు ఇవి తోడ్పడుతాయి. ఇదొక మౌలిక వాణిజ్య నమూనా. మార్కెట్‌శక్తుల ప్రభావం లేని, ప్రభుత్వాల మద్దతు అవసరం లేని వాణిజ్య విధానం. రైతుల సంక్షేమానికి కచ్చితంగా దోహదం చేయగల వాణిజ్య నమూనా. ఇది సక్రమంగా పని చేయాలంటే సంబంధిత వ్యక్తుల మధ్య పరస్పర విశ్వాసం ఉండాలి. వారు సమష్టిగా పూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించగలగాలి. మార్కెట్లు, ప్రభుత్వాల వలే కాకుండా ఇది ఒక సమష్టి, సహకార కార్యాచరణ. నిర్వహణా సమర్థత, సమన్యాయ భావన సమ్మిళితమయ్యే ఆదర్శ వాణిజ్య విధానం. ఇటువంటి సహకార ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కుటుంబాల సంక్షేమానికి, పర్యావరణ పరిరక్షణకు అవి విశేషంగా మేలు చేస్తాయి. 

డాక్టర్ రమేష్ చెన్నమనేని 

వ్యాసకర్త శాసనసభ్యులు, వ్యవసాయరంగ నిపుణుడు

Advertisement
Advertisement
Advertisement