‘సహకార’ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా!?

ABN , First Publish Date - 2020-12-04T06:11:19+05:30 IST

వ్యవసాయ రంగానికి వెన్నెముఖలాంటి సహకార సంఘాలకు సుమారు మూడేళ్ల నుంచి పూర్తిస్థాయి పాలక వర్గాలు లేవు. గత ఏడాది నవంబరు వరకు సహకార శాఖ అధికారులు, సిబ్బంది ఇన్‌చార్జులుగా వ్యవహరించారు.

‘సహకార’ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా!?

పర్సన్‌ ఇన్‌చార్జులతోనే కాలక్షేపం

ఆరు నెలలకొకసారి పదవీ కాలం పొడిగింపు

మూడోసారి పొడిగిస్తూ నేడో, రేపో ఉత్తర్వులు

కనీస అధికారాలు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారిన పర్సన్‌ ఇన్‌చార్జిలు

33 నెలల నుంచి పాలక వర్గాలు లేని వైనం


విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగానికి వెన్నెముఖలాంటి సహకార సంఘాలకు సుమారు మూడేళ్ల నుంచి పూర్తిస్థాయి పాలక వర్గాలు లేవు. గత ఏడాది నవంబరు వరకు సహకార శాఖ అధికారులు, సిబ్బంది ఇన్‌చార్జులుగా వ్యవహరించారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం మాజీ చైర్మన్లు/ డైరెక్టర్లను పర్సన్‌ ఇన్‌చార్జులుగా నియమించింది. ఈ ఏడాది జూన్‌తో ఆరు నెలల గడువు ముగియడంతో, మరో ఆరు నెలలు పొడిగించింది. ఇది కూడా గురువారంతో ముగిసింది. అయితే...ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే సూచనలు లేకపోవడంతో మూడోసారి పొడిగింపునకు నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం వుందని సహకార వర్గాల సమాచారం.


ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరి 19న ప్రాథమిక సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఎన్నికలు జరిగాయి. 2018 ఫిబ్రవరితో ఆయా సంఘాల పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. అనంతరం అప్పటి ప్రభుత్వం ఆయా సంఘాల కార్యదర్శులు, సీఈవోలకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. గత ఏడాది ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అధికారుల పాలననే కొనసాగించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు...గతంలో సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్లుగా వ్యవహరించిన వారిని పర్సన్‌ ఇన్‌ చార్జులుగా నియమించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ప్రభుత్వం మాజీ చైర్మన్లను పర్సన్‌ ఇన్‌చార్జులు (వైసీపీకి చెందిన నాయకులు ఉన్నచోట మాత్రమే)గా నియమించింది. అన్ని ప్రాథమిక సహకార సంఘాలకు ముగ్గురు మాజీ డైరెక్టర్‌లతో ఇన్‌చార్జి కమిటీలను వేసింది. పర్సన్‌ ఇన్‌చార్జి లేనిచోట ముగ్గురు డైరెక్టర్‌లలో వైసీపీకి చెందిన నాయకుడికి అధికారం అప్పగించింది. అదేవిధంగా డీసీసీబీ/డీసీఎంఎస్‌లకు ఏడుగురితో పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలను ఏర్పాటుచేసింది. అయితే ఎవరికీ పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వలేదు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికి లేదు. 


పర్సన్‌ ఇన్‌చార్జిల పదవీకాలం మరోసారి పొడిగింపు?

సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు పర్సన్‌ ఇన్‌చార్జుల నియామకం జరిగి ఈ నెల 3వ తేదీకి ఏడాది పూర్తయ్యింది. వాస్తవంగా పదవీకాలం ఆరు నెలలే. గత ఏడాది డిసెంబరులో నియమితులైన పర్సన్‌ ఇన్‌చార్జుల పదవీ కాలాన్ని జూన్‌ నెలలో ఒకసారి పొడిగించారు. డిసెంబరు 3వ తేదీతో ఆరు నెలలు పూర్తయ్యింది. ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోవడంతో పర్సన్‌ ఇన్‌చార్జుల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించవచ్చని, ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడవచ్చని సహకార అధికారి ఒకరు పేర్కొన్నారు.


ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది

- ఉప్పలపాటి సుకుమారవర్మ, డీసీసీబీ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌

జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు 23 మంది డైరెక్టర్లతో పూర్తిస్థాయి పాలక వర్గం ఉండేది. కానీ ఇప్పుడు మూడో వంతు మంది కూడా లేరు. పైగా అధికారాలు పరిమితంగానే ఉన్నాయి. అయినప్పటికీ బ్యాంకుపరంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చాం. బ్యాంకు వ్యాపారం పెరిగింది. ఏది ఏమైనప్పటికీ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, పూర్తిస్థాయి పాలకవర్గాలు ఏర్పాటైతే మంచిది.

Updated Date - 2020-12-04T06:11:19+05:30 IST