కేంద్ర పథకాల పరిశీలన అధికారులకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-10-19T07:04:41+05:30 IST

జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలన నిమిత్తం ఇద్దరు సభ్యుల గల టీమ్‌ జిల్లాకు రావడం జరిగిందని, సంబంధిత శాఖల అధికారులు వారికి సహకారం అందించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు.

కేంద్ర పథకాల పరిశీలన అధికారులకు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 18: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలన నిమిత్తం ఇద్దరు సభ్యుల గల టీమ్‌ జిల్లాకు రావడం జరిగిందని, సంబంధిత శాఖల అధికారులు వారికి సహకారం అందించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నేషనల్‌ లెవల్‌ మానిటరింగ్‌ టీమ్‌ సభ్యులతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ థకం, దీన్‌దయాల్‌ అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, నేషనల్‌ సోషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాం, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన, దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌసల్య యోజన, సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ్‌యోజన, ప్రధానమంత్రి సించాయి యోజన (వాటర్‌షెడ్‌), డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్సు మోడెర్నై జేషన్‌ ప్రోగ్రాం, పంచాయతీరాజ్‌, బేసిక్‌ వెరిఫికేషన్‌, గ్రామ పంచాయతీ, పరిపాలన అంశాల పై ఈ నెల 18వ తేదీ నుంచి 24 వరకు ఐదు మండలాల్లోని గుర్తించిన గ్రామాలలో పరిశీలిస్తారని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వ టీమ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు డా.ఎం.ముత్తుకుమార్‌, డా.కె.దేవన్‌లు ఆయా గ్రామాల్లో పర్యటిస్తారని, వారి వెంట సంబంధిత శాఖల అధికారులు ఉంటారని తెలిపారు. ఈ నెల 19న బోథ్‌ బ్లాక్‌లోని పాట్నాపూర్‌, ఇచ్చోడ మండలం ముక్రాకె); 20,21 తేదీలలో గుడిహత్నూర్‌ బ్లాక్‌లోని మచ్చాపూర్‌, మన్నూర్‌, సీతాగొందీ, తోషం, 22, 23న ఇంద్రవెల్లి బ్లాక్‌లోని గౌరపూర్‌, కేస్లాపూర్‌,కేస్లాపూర్‌, రాంపూర్‌(బి), వాల్గొండ హీరాపూర్‌, 24న నార్నూర్‌ బ్లాక్‌లోని కైర్‌డాట్వా, మాలాంగి, మన్కానూర్‌, బాబెఝరి గ్రామాలలోపర్యటిస్తారని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాలపై వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, ఆర్డీవో రాజేశ్వర్‌, అదనపు జిల్లా గ్రామీణాబివృద్ధి అధికారి రవీందర్‌రాథోడ్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పని సరిగా తీసుకోవాలి..

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పని సరిగా తీసుకోవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగం కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదుల విభాగంలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు. అర్జీదారులు వ్యాక్సిన్‌ తీసుకోవాలని, ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకోని వారు ఇక్కడ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రంలో తప్పని సరిగా తీసుకోవాలన్నారు. 

Updated Date - 2021-10-19T07:04:41+05:30 IST