కూలీలపై కనికరమేదీ ?

ABN , First Publish Date - 2021-04-19T06:24:27+05:30 IST

జిల్లాలో ఎండలు మండిపోతున్నా ఉపాధి కూలీలకు పని ప్రదేశం లో కనీస సౌకర్యాలు కల్పించటం లేదు. దీంతో కూలీలు వడదెబ్బ తగిలి విలవిల్లాడుతున్నారు. సంబంధిత అధికా రులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కూలికి వెళితేనే పూట గడిచే దుస్థితిలో ఉన్నవారు వేసవిలోనూ పనులకు వెళుతున్నారు.

కూలీలపై కనికరమేదీ ?

నీడకు షామియానాలు లేవు  

మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్‌ పంపిణీ అస్సల్లేదు 

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులకూ దిక్కులేదు 

వడదెబ్బకు గురవుతున్నా పట్టించుకోని యంత్రాంగం 

అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్‌ 18:  జిల్లాలో ఎండలు మండిపోతున్నా ఉపాధి కూలీలకు పని ప్రదేశం లో కనీస సౌకర్యాలు కల్పించటం లేదు. దీంతో కూలీలు వడదెబ్బ తగిలి విలవిల్లాడుతున్నారు. సంబంధిత అధికా రులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  కూలికి వెళితేనే పూట గడిచే దుస్థితిలో ఉన్నవారు వేసవిలోనూ పనులకు వెళుతున్నారు. మరికొందరు ఎండ భయంతో పనులకు దూరంగా ఉంటున్నారు. జిల్లా వ్యాప్తంగా  6 లక్షల జాబ్‌ కార్డుల్లో 11.91 లక్షల మంది కూలీలున్నారు. వీరిలో 4.16 లక్షల కుటుంబాలకు చెందిన 7.51 లక్షల మంది ఉపాధి పనులకు వెళుతున్నారు. ఈ సీజనలో ప్రతి రోజు 4.5 లక్షల మంది కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అయితే ప్రస్తుతం రోజుకు 1.80 ల క్షల నుంచి 2 లక్షల మందికే పనులు కల్పిస్తున్నారు. 


కానరాని మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు  

ఏప్రిల్‌ నుంచి జూన వరకు ఉపాధి పనులకు వచ్చే కూలీలకు రోజుకు ఒక మజ్జిగ ప్యాకెట్‌ను ఇవ్వాలి. గతంలో ఒక్కో మజ్జిగ ప్యాకెట్‌కు రూ.5లు చొప్పున మేట్ల ఖాతా కు నిధులు జమ చేసేవారు. ముందుగా మేట్లు లేదా మజ్జిగ సరఫరాదారుడు మజ్జిగను పంపిణీ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని మేట్లకు జమ చేస్తారు. ఉపాధి పనులకు వచ్చినకూలీలకు ప్రతి ఒక్కరికీ రోజూ ఒక మజ్జిగ ప్యాకెట్‌ ఇవ్వాలి. అయితే ఇప్పటి దాకా మజ్జిగ ప్యాకెట్ల పంపిణీకి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేసవి కాలం లో ఉపాధి కూలీలకు తప్పనిసరిగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించాలి. సంబంధిత అధికారులు,సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను తెచ్చుకొని కూలీలకు అందించాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన మోతాదు మేరకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు లేకపోవడంతో ఉపాధి సిబ్బందికి ఇవ్వడం లేదు.  ప్రభుత్వం ఉచితంగా అందించే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


షామియానాలు, ఫస్ట్‌ఎయిడ్‌ బాక్సులు ఏవీ ? 

ప్రతి ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన నెలాఖరు వరకు ఉపాధి పనులు చేసే ప్రాంతాల్లో కూలీలకు కనీస సౌక ర్యాలు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత అ త్యధికంగా 41- 43 డిగ్రీల వరకు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎండ వేడిమి నుంచి కూలీలకు రక్షణ కల్పిం చేందుకు పనులు చేసే ప్రాంతాల్లో నీడ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, షెడ్ల ద్వారా నీడ కల్పించాలి. ఇప్పటి దాకా జిల్లా వ్యాప్తం గా ఉపాధి పనులు చేసే ప్రాంతాల్లో ఎక్కడా షామినాయాలు ఏర్పాటు చేయలేదు. దీంతో మండుటెండలోనే పనులు చేయడం ద్వారా పలు ప్రాంతాల్లో కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. వేసవిలో ఇచ్చే ఇన్సెంటెవ్‌ డబ్బులు వైద్య ఖర్చులకే సరిపోతుందని కూలీలు వా పో తున్నారు. అలాగే జిల్లాలో ఎక్కడా ఫస్ట్‌ఎయిడ్‌ బాక్సులు ఉంచడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా వేసవి సీజన లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు చాలా ముఖ్యం. కూలీలు ఎవరైనా వడడెబ్బకు గురైతే  ప్రథమ చికిత్స అందిం చేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న వాదనలు ఆ శాఖ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. 


ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం 

ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు,సిబ్బంది తమకేమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.  ఉన్నతాధికారులు పర్యవేక్షణా లోపంతోనే క్షేత్ర స్థాయిలో  పనుల పర్యవేక్షణ అస్తస్యంగా మారిందన్న విమర్శలు న్నాయి. దీనిపై సంబంధిత అధికారులను ఎవరైనా ప్రశ్ని స్తే అన్ని చోట్ల అంతా సవ్యంగా జరుగుతోందని బుకాయి స్తున్నట్లు తెలిసింది.  


ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు 

ఈ సారి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేం దుకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. అనుమ తులు వస్తే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి పనులు చేసే ప్రాంతాల్లో తప్పని సరిగా కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించాం. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణను మరింతపెంచి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.  సమస్యలుంటే పీడీ కార్యాలయం దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. 


ఎండకు అల్లాడిపోతున్నాం 

ఎండకు ఉపాధి పనులు చేయలేక అల్లాడిపోతున్నాం.  కొంత సేపు నీడలో కూర్చునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎక్కడా నీడ కోసం షామినాయాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటి దాకా ఒక్క రోజు కూడా మజ్జిగ ప్యాకె ట్లు పంపిణీ చేయలేదు. పొట్ట కూటి కోసం ఎర్రటి ఎండ లో తప్పని పరిస్థితుల్లో పనులు చేస్తున్నాం. మా బాధలు ఎవరు పట్టించుకుంటారో ఏమో. 

నారాయణ, ఉపాధి కూలీ, శింగనమల  


కనీస సౌకర్యాలు కల్పించలేదు 

ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. మేము తెచ్చుకున్న నీరు అయిపోతే దప్పిక తీర్చుకోవడానికి వ్యవసాయ బోరుబావుల వద్దకు పరుగులు పెట్టాల్సిందే. ఉపాధి పనులు చేస్తున్న చోట నీరు, నీడ సౌకర్యాలు కల్పించడం లేదు. ఇప్పటి దాకా మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకె ట్లు ఎవరూ ఇవ్వలేదు. ఇదేమని అడిగితే ఉన్నతాధికా రులు చెప్పలేదంటున్నారు.  

దూదేకుల కుళ్లాయప్ప, ఉపాధి కూలీ, శ్రీరంగపురం, బెళుగుప్ప మండలం 





Updated Date - 2021-04-19T06:24:27+05:30 IST