చల్లచల్లగా...తనివితీరగా...!

ABN , First Publish Date - 2021-04-03T05:47:57+05:30 IST

ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చల్లటి పానీయాలు తాగాలని అనిపిస్తుంది. జల్‌జీరా, సత్తు షర్బత్‌,

చల్లచల్లగా...తనివితీరగా...!

ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చల్లటి పానీయాలు తాగాలని అనిపిస్తుంది. జల్‌జీరా, సత్తు షర్బత్‌, ఆమ్‌ పన్నా, రూహ్‌ అఫ్జా మోజిటో, లస్సీ, మల్బరీ జ్యూస్‌ లాంటివి ఒంటికి చల్లదనాన్ని ఇచ్చేవే. శరీరానికి సత్తువను కూడా ఇచ్చే  ఈ డ్రింక్స్‌ వేసవితాపం నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇంకెందుకాలస్యం ఈ వారం  మీరూ  వీటిని రుచి చూడండి. 


జల్‌జీరా


చల్లదనంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచే డ్రింక్‌ జల్‌జీరా. ఇంట్లో లభించే పదార్థాలతో తయారుచేసుకోగలిగే ఈ డ్రింక్‌ను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తాగుతారు. 


కావలసినవి

పుదీనా - ఒక కట్ట, నిమ్మరసం - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - రెండు గ్లాసులు, జీలకర్ర - రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, అల్లం - కొద్దిగా, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఇంగువ - చిటికెడు, చింతపండు - కొద్దిగా.


తయారుచేయు విధానం

 పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్‌ చేసి పెట్టుకోవాలి. జీలకర్రను వేగించాలి. 

 మిక్సీలో పుదీనా, కొత్తిమీర, చింతపండు వేసి పట్టుకోవాలి. వేగించిన జీలకర్ర, అల్లం ముక్క వేసి మరోసారి బ్లెండ్‌ చేయాలి. 

 ఇంగువ, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి, నీళ్లు పోసి మరోసారి పట్టుకోవాలి.

 సన్నటి జాలీతో వడబోసి, ఐస్‌క్యూబ్‌లు వేసి చల్లగా సర్వ్‌ చేయాలి.




మల్బరీ జ్యూస్‌

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింక్‌ వేసవిలో చల్లదనంతో పాటు శక్తిని అందిస్తుంది. 

కావలసినవి

మల్బరీ జ్యూస్‌ - 60మి.లీ పైనాపిల్‌ జ్యూస్‌ - 20మి.లీ, యాపిల్‌ జ్యూస్‌ - 20 మి.లీ, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని, సోడా - 90 ఎంఎల్‌, బ్లాక్‌సాల్ట్‌ - చిటికెడు, నిమ్మరసం - కొద్దిగా.

తయారీ విధానం

 అన్ని జ్యూస్‌లను మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. 

 సోడా, బ్లాక్‌ సాల్ట్‌, నిమ్మరసం కలపాలి.

 ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని మల్బరీ జ్యూస్‌ను సర్వ్‌ చేసుకోవాలి.




పంజాబీ లస్సీ

ఇంట్లో సులభంగా తయారుచేసుకునే సమ్మర్‌ డ్రింక్‌ ఇది. శరీరానికి చలువ చేసే ఈ పానీయం తయారీ చూద్దాం...

కావలసినవి

పెరుగు - ఒకటిన్నర కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని, చల్లటి నీళ్లు - రెండు గ్లాసులు.

తయారీ విధానం

 పెరుగును మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి.

 తరువాత పంచదార, కుంకుమపువ్వు రేకులు, యాలకుల పొడి వేయాలి.

 ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవాలి. చల్లటి నీళ్లు కలపాలి. 

 మరొక్కసారి బ్లెండ్‌ చేసుకోవాలి. 

 గ్లాసుల్లో పోసుకుని సర్వ్‌ చేయాలి.




రూహ్‌ అఫ్జా మోజిటో

రూహ్‌ అఫ్జాతో చేసుకునే డ్రింక్‌ ఇది. ఈ పానీయాన్ని ఎలా తయారుచేసుకోవాలంటే...

కావలసినవి

రూహ్‌ అఫ్జా - రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, సోడా - అరగ్లాసు, తులసి ఆకులు - నాలుగైదు, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.

తయారీ విధానం

 ఒక గ్లాసులో మిరియాలపొడి, నిమ్మరసం, రూహ్‌ అఫ్జా తీసుకోవాలి.

 తరువాత అందులో చల్లటి నీళ్లు పోసి బాగా కలపాలి.

 ఇప్పుడు సోడా, ఐస్‌క్యూబ్స్‌ వేయాలి.

 తులసి ఆకులతో గార్నిష్‌ చేసి చల్లటి రూహ్‌ అఫ్జాను అందించాలి.




ఆమ్‌ పన్నా

పచ్చిమామిడికాయలతో చేసే ఈ డ్రింక్‌ను ఒక్కసారి రుచిచూస్తే మళ్లీమళ్లీ తాగుతారు. ఆమ్‌ పన్నాను ఎలా తయారుచేయాలంటే...

కావలసినవి

పచ్చి మామిడికాయలు - రెండు, పంచదార - కొద్దిగా, ఉప్పు - ఒక టీస్పూన్‌, బ్లాక్‌ రాక్‌ సాల్ట్‌ - రెండు టీస్పూన్లు, జీలకర్రపొడి - రెండు టీస్పూన్లు, పుదీనా ఆకులు - కొన్ని, ఐస్‌క్యూబ్స్‌ - తగినన్ని.

తయారీ విధానం

 మామిడికాయల లోపలి భాగం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. 

 చల్లారిన తరువాత మామిడికాయల తొక్క తీసి, లోపలి భాగాన్ని గుజ్జుగా చేయాలి.

 ఇప్పుడు మిక్సీలో మామిడికాయ గుజ్జు వేసి, పంచదార, ఉప్పు, బ్లాక్‌ రాక్‌సాల్ట్‌, జీలకర్రపొడి వేసి బ్లెండ్‌ చేసుకోవాలి.

 పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుని, ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లగా ఉండగానే తాగాలి. 




సత్తు షర్బత్‌


కావలసినవి

శనగపిండి - పావు కప్పు, నీళ్లు - ఒక గ్లాసు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్‌, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పచ్చి మామిడికాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.

తయారీ 

 ముందుగా జీలకర్రను వేగించాలి. పుదీనాను కట్‌ చేసుకోవాలి. మామిడికాయ సన్నగా తురుముకోవాలి. 

 తరువాత వాటిని ఒక పాత్రలోకి తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. నిమ్మరసం వేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 

 పుదీనా ఆకులతో గార్నిష్‌ చేయాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి కూల్‌ కూల్‌గా టేస్ట్‌ చేయాలి.


Updated Date - 2021-04-03T05:47:57+05:30 IST