ఆలయాల బాట పడుతున్న ఆస్ట్రేలియా రాజకీయ నేతలు..! కారణం ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-04-17T21:46:46+05:30 IST

ఓవైపు ముంచుకొస్తున్న ఫెడరల్ ఎన్నికలు.. మరోవైపు.. చైనాతో పెరిగిన దూరం వెరసి.. ఆస్ట్రేలియా రాజకీయ నేతల దృష్టంతా ఇప్పుడు భారత సంతతి వారివైపు మళ్లింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భారతీయ సంతతి వారు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. వారి ఓట్ల కోసం ఆస్ట్రేలియా నేతలు అందరూ ‘భారతీయత’ మంత్రాన్ని జపిస్తున్నారు.

ఆలయాల బాట పడుతున్న ఆస్ట్రేలియా రాజకీయ నేతలు..! కారణం ఏంటో తెలిస్తే..

ఎన్నారై డెస్క్: ఓవైపు ముంచుకొస్తున్న ఫెడరల్ ఎన్నికలు.. మరోవైపు.. చైనాతో పెరిగిన దూరం వెరసి..  ఆస్ట్రేలియా రాజకీయ నేతల దృష్టంతా ఇప్పుడు భారత సంతతి వారివైపు మళ్లింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భారతీయ సంతతి వారు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. వారి ఓట్ల కోసం ఆస్ట్రేలియా నేతలు అందరూ ‘భారతీయత’ మంత్రాన్ని జపిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని స్కాట్ మారిసన్ భారతీయ వంటకాన్ని వండుతూ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవల ఇండియా-ఆస్ట్రేలియా మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సందర్భంగా ఆయన ఈ ఫొటోను షేర్ చేశారు.


తన స్నేహితుడు మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు చెందిన వంటకాన్ని వండుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఆ తరువాత.. లేబర్ పార్టీకి చెందిన నేత ఆంథొనీ ఆల్బనీస్  ఓ ఆలయాన్ని సందర్శించిన వైనం కూడా అమితంగా వైరల్ అయింది. భారతీయుల మద్దతు కూడగట్టే క్రమంలో ఆయన.. ‘‘మీరు లేని ఆస్ట్రేలియాను ఊహించలేము’’ అంటూ వ్యాఖ్యానించారు. మరో నేత ఆండ్రూ చార్ల్‌టన్ కూడా ఇటీవల హడావుడిగా సిడ్నీలోని శ్రీ స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించారు. భారతీయుల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఆ వర్గంలోని ప్రముఖులతో విస్త్రత సంప్రదింపులు జరిపారు. 


చైనా సంతతి రాజకీయ నేతలకు అధిక ప్రాధాన్యమిచ్చే ఆస్ట్రేలియా మీడియా తీరులోనూ ఈ తరహా మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అక్కడి మీడియా ఇటీవల కాలంలో భారత సంతతి ప్రజలు, నేతలపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఆస్ట్రేలియా-చైనా దౌత్య సంబంధాలు బలహీన పడటమే దీనికి కారణం. ఒకప్పుడు చైనాతో ఆస్ట్రేలియా సంబంధాలు ఉచ్ఛస్థితిలో ఉండేవి. అప్పట్లో చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ నేరుగా ఆస్ట్రేలియా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు కూడా! అయితే.. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రదర్శిస్తున్న దుడుకు వైఖరి, ఆస్ట్రేలియా సమాజంలో అన్ని పార్శ్వాల్లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా.. రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా సంతతికి చెందిన ఆస్ట్రేలియా రాజకీయ నేత ఒకరు ప్రస్తుతం లో- ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నారు. బీజింగ్‌తో సన్నిహితంగా ఉందన్న ఆరోపణలు అధికమవడంతో ఆమె మీడియా, ప్రజలు దృష్టికి దూరంగా ఉంటున్నారు. 


2010లో ఆస్ట్రేలియాలోని భారత సంతతి వారి సంఖ్య 3.10 లక్షలు కాగా.. ప్రస్తుతం వారి జనాభా 8 లక్షలు దాటింది. దీంతో.. ఇండియన్ ఆస్ట్రేలియన్లు రాజకీయంగా ఓ బలమైన వర్గంగా మారారు. అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేయగల స్థాయికి చేరుకున్నారు. ఇప్పటికే దక్షిణ సిడ్నీలోని హారిస్ ప్రాంతాన్ని స్థానికులు ‘లిటిల్(చిన్న) ఇండియా’ అని పిలుస్తున్నారంటే...భారతీయులు అక్కడి సమాజంలో ఎంతగా వేళ్లూనుకుపోయారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే ఆస్ట్రేలియా నేతలు ప్రస్తుతం  ‘భారతీయత’ మంత్రాన్ని పఠిస్తున్నారు. తాను బాలివుడ్ పాటలకు బానిసైపోయానంటూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-04-17T21:46:46+05:30 IST