ఆటలపై ఉత్తుత్తి మాటలే!

ABN , First Publish Date - 2022-05-26T06:47:16+05:30 IST

వేసవిలో చిన్నారులతో సందడిగా ఉండాల్సిన క్రీడా మైదానాలు ప్రస్తుతం కళావిహీనంగా కనిపిస్తున్నాయి.

ఆటలపై ఉత్తుత్తి మాటలే!

ఈ ఏడాది వేసవి క్రీడా శిబిరాలు హుళక్కే!

ప్రభుత్వపరంగా క్రీడాకారులకు అందని శిక్షణ 

స్పందించని జీవీఎంసీ

క్రీడా సామగ్రిని కూడా పంపిణీ చేయని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ

నిధుల లేమి కారణమని వివరణ 

సొంత ఖర్చుతో అరకొరగా ఏర్పాటుచేసిన ఔత్సాహికులు 

జిల్లాలోని క్రీడాకారుల భవిష్యత్తుపై నీలినీడలు 


వేసవిలో చిన్నారులతో సందడిగా ఉండాల్సిన క్రీడా మైదానాలు ప్రస్తుతం కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఉచిత శిక్షణ శిబిరాలు పూర్తిగా కనుమరుగైపోయాయి. మునిసిపల్‌ కార్పొరేషన్‌తో పాటు పోర్టు స్పోర్ట్సు కౌన్సిల్‌, రైల్వే స్పోర్ట్సు అసోసియేషన్‌ వంటి సంస్థలు కూడా శిబిరాల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నాయి. కోచ్‌లు, సీనియర్‌ క్రీడాకారులు ముందుకు రావాలని ఆర్భాట ప్రకటన చేసిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ...నిధుల లేమితో క్రీడా సామగ్రిని కూడా పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. 

విశాఖపట్నం (స్పోర్ట్సు), మే 25:

క్రీడలను ప్రోత్సహిస్తున్నామని, అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలు ఉత్తిత్తివేనని తేలిపోయింది. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన తరువాత నిర్వహించే ఉచిత క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకే ఈ ఏడాది దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారులు ఆటలకు ప్రాధాన్యం ఇస్తారు. వివిధ క్రీడాంశాల్లో తమకున్న ప్రతిభను మెరుగుపరచుకునేందుకు యత్నిస్తారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఆటల పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వాలు ఏటా రాష్ట్ర వ్యాప్తంగా వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహించేవి. 

కరోనాతో రెండేళ్లు దూరం 

కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత కరోనా ప్రభావంతో వరుసగా రెండేళ్లు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఏర్పడినా ఈ ఏడాది శిబిరాల జాడ కనిపించడం లేదు. క్రీడా ప్రాధికార సంస్థ వద్ద శిబిరాల నిర్వహణకు తగిన నిధులు లేకపోవడంతో ఈ ఏడాది ఉచిత శిక్షణ మూలనపడింది. 

సొంత ఖర్చులతో శిబిరాలు 

నగరంలో కొన్ని క్రీడా సంఘాలు తమ సొంత ఖర్చుతో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పల్‌ స్టీల్‌ సంస్థతో కలిసి జిల్లా క్రికెట్‌ సంఘం కొన్ని శిబిరాలు నిర్వహిస్తోంది. ఇక, జిల్లాలోని 59 కేంద్రాలలో పలు క్రీడాంశాల ఉచిత శిబిరాలను నిర్వహించేందుకు కోచ్‌లు, సీనియర్‌ క్రీడాకారులను ఆహ్వానించిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సామగ్రిని కూడా పంపిణీ చేయలేకపోయింది. కరోనా కారణంగా మూతపడిన బీచ్‌రోడ్డులోని ఆక్వా స్పోర్ట్సు కాంప్లెక్సులోని స్విమ్మింగ్‌పూల్‌ను ఇప్పటికీ తెరవకపోవడం, రైల్వే క్రీడా సముదాయంలోని స్విమ్మింగ్‌పూల్‌ను ప్రైవేటుకు లీజుకు ఇవ్వడంతో స్విమ్మింగ్‌ క్రీడా సంఘం శిక్షణ శిబిరాల నిర్వహణ మాటే మరచిపోయింది.

ముఖం చాటేసిన సంస్థలు

కొన్నేళ్లుగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలతో చిన్నారులను ప్రోత్సహిస్తున్న జీవీఎంసీ, పోర్టు, రైల్వే తదితర ప్రధాన ప్రభుత్వ సంస్థలు ఈ ఏడాది ముఖం చాటేశాయి. స్థానిక క్రీడాభివృద్ధికి సహకారం, ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత కలిగిన ఈ సంస్థలు మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో తగిన శిక్షణ లభించక చిన్నారులు వీధుల్లో ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతర పోర్టులలో నిర్వహిస్తున్న టోర్నీల్లో పాల్గొనడంతో పోర్టు స్పోర్ట్సు కౌన్సిల్‌ ఈ ఏడాది శిబిరాల నిర్వహణపై దృష్టి సారించలేదని సమాచారం.  

రైల్వేదీ అదే తీరు..

రైల్వేకు రూ.కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రౌండ్స్‌, ఆధునిక సౌకర్యాలతో క్రీడా సముదాయాలు ఉన్నాయి. అయితే వీటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేయడంతో తమ చేతిలో ఏమీ లేదని తేల్చేస్తూ శిబిరాలకు మంగళం పాడేసింది. క్రికెట్‌ స్టేడియం, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌ గ్రౌండ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ హాలు ప్రైవేటు నిర్వాహకుల చేతిలో ఉన్నాయి. రైల్వే నిర్వహించే క్రీడా కార్యక్రమాలకు ఏడాదిలో  కొన్ని రోజులు కేటాయించాలని అధికారిక లీజు ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు...చిన్నారులను ప్రోత్సహించే వేసవి శిబిరాలు నిర్వహించాలనే ఆలోచన చేయకపోవడం విచారకరం. 

స్పందించని జీవీఎంసీ

వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్పందించడం లేదు. కనీసం జీవీఎంసీ పరిధిలోని పాఠశాలల విద్యార్థుకైనా శిక్షణ శిబిరాలు నిర్వహించే ఆలోచన చేయలేదు. కార్పొరేటర్లకు క్రీడా పోటీలు నిర్వహించేందుకు రూ.లక్షలు వెచ్చించిన జీవీఎంసీ...ప్రతిభ కలిగిన వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.


Updated Date - 2022-05-26T06:47:16+05:30 IST