శిక్ష పడితే పదవి పోయినట్లే

ABN , First Publish Date - 2020-02-21T09:30:14+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమ మార్గాల ద్వారా గెలిచినా.. తప్పు నిరూపణ అయి శిక్ష పడితే పదవిని వదులుకోక తప్పదు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌

శిక్ష పడితే  పదవి పోయినట్లే

  • సస్పెండైన సర్పంచ్‌పై ఆరేళ్లు పోటీ నిషేధం
  • క్రిమినల్‌ కేసులున్న వ్యక్తులు ఎన్నికైతే తొలగింపు
  • అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల శిక్ష
  • 13 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు
  • 15 రోజుల్లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ
  • ఆర్డినెన్స్‌ జారీచేసిన గవర్నర్‌సస్పెండైన సర్పంచ్‌పై..
  • ఆరేళ్లు పోటీ  చేయకుండా నిషేధం
  • రూ.10 వేల జరిమానా కూడా..
  • వార్డు ఇక పంచాయతీ ప్రాదేశిక విభాగం
  • సర్పంచులు గ్రామాల్లోనే ఉండాలి
  • షెడ్యూల్డ్‌ ఏరియాలో పదవులన్నీ ఎస్టీలకే
  • ఆర్డినెన్స్‌ జారీచేసిన గవర్నర్‌
  • పంచాయతీరాజ్‌ చట్టానికి పలు సవరణలు
  • త్తర్వులిచ్చిన రాష్ట్రప్రభుత్వం

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమ మార్గాల ద్వారా గెలిచినా.. తప్పు నిరూపణ అయి శిక్ష పడితే పదవిని వదులుకోక తప్పదు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆర్డినెన్స్‌ చేశారు. ఇటీవల కేబినెట్‌లో ఆమోదించిన మేరకు పంచాయతీరాజ్‌ చట్టానికి అనేక సవరణలను ఈ ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. అనంతరం  వాటన్నిటినీ ఉత్తర్వుల రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వ్యక్తులు గెలిచి జైలులో ఉన్నా పదవుల్లో ఉండేవారు. తాజా సవరణల ప్రకారం.. క్రిమినల్‌ కేసులున్న వ్యక్తులు ఎన్నికైతే పదవి నుంచి తొలగిస్తారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు మూడేళ్లు వరకు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తారు.


అలాగే గ్రామ పంచాయతీ సక్రమంగా పనిచేయడానికి జిల్లా కలెక్టర్‌ లేదా కమిషనర్‌ లేదా ప్రభుత్వ ఉత్తర్వులను ఉపేక్షించినప్పుడు.. లేదా అమలు చేసేందుకు నిరాకరించినప్పుడు.. లేదా తన హోదాను లేదా తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేసినప్పుడు.. లేదా తన కర్తవ్యాలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు.. గ్రామ పంచాయతీ నిధుల స్వాహా చేసినప్పుడు.. గ్రామ పంచాయతీ కార్యకలాపాలకు విఘాతం కలిగించినప్పుడు.. నిర్వహణలో అసమర్థుడైనప్పుడు... వివరణకు అవకాశమిచ్చిన తర్వాత సర్పంచ్‌ లేదా ఉపసర్పంచ్‌ను కలెక్టర్‌ తొలగించవచ్చు. నిర్దుష్ట కాలపరిమితిలోపు గ్రామ పంచాయతీ ఖాతాలను ఆడిట్‌ చేయడంలో విఫలమైనా.. ప్రధాన పరిపాలనశాఖ ఇచ్చిన జీవో 791 ప్రకారం గ్రామ సభ సమావేశాలను నిర్వహించడంలో విఫలమైనా.. కలెక్టర్‌ రాతపూర్వకంగా సర్పంచ్‌ లేదా ఉపసర్పంచ్‌కు తెలియజేసి మరీ తొలగిస్తారు. రాజీనామా.. లేక ఇతర కారణాల ద్వారా సర్పంచ్‌ పదవి కోల్పోయినా రికవరీలు, ప్రొసీడింగులు, క్రిమినల్‌ చర్యలు కొనసాగుతాయి. ఇవన్నీ ఏడాదిలోపు పూర్తి చేయాలి. సస్పెన్షన్‌కు గురైన సర్పంచ్‌.. తొలగించిన తేదీ నుంచి ఆరేళ్లపాటు వార్డు సభ్యుడిగా గానీ, సర్పంచ్‌గా గానీ తిరిగి పోటీ చేయడానికి అర్హత కోల్పోతారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు 13 రోజుల్లో.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 15 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది.


మరిన్ని సవరణలు ఇవీ..

  • గ్రామ పంచాయతీ వార్డులను ఇక గ్రామ పంచాయతీ ప్రాదేశిక విభాగాలుగా పరిగణిస్తారు.
  • నూరుశాతం గిరిజనులు నివశిస్తున్న గిరిజన నివాసిత ప్రాంతాలు/గిరిజన తండాల విషయంలో, అలాంటి గ్రామాల్లోని అన్ని వార్డులనూ ఎస్టీలకు రిజర్వు చేయాలి. ఆయా నివాసిత ప్రాంతాలు/తండాల్లోని సర్పంచ్‌ పదవులు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్‌ చేయాలి.
  • గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెట్లను పెంచి గ్రీన్‌ కవరేజ్‌ నిర్వహించడం, గ్రామ పంచాయతీలు సమర్థంగా పనిచేసేందుకు సర్పంచులు గ్రామాల్లో నివాసముండి క్రమబద్ధంగా పంచాయతీ కార్యాలయాలను సందర్శించాలి.
  • అత్యవసర అధికారాలు సర్పంచులకే. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం.. విపత్తు సమయాల్లో.. అగ్ని ప్రమాదాలు, అంటు వ్యాధులు, తాగునీటి లేమి వంటి అత్యవసర సందర్భాల్లో సర్పంచ్‌,ు పంచాయతీ లేదా పంచాయతీ కమిటీలు వెంటనే ఉపశమన చర్యలకు ఆదేశించాలి. అత్యవసరంగా తీసుకున్న ఈ చర్యలు, కారణాలను తదుపరి సమావేశంలో గ్రామసభకు తెలియజేయాలి.
  • రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌కు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో సీట్ల రిజర్వేషన్‌.. గ్రామ పంచాయతీలోని సామాజిక వర్గాల జనాభా దామాషాలో ఉండాలి. ఎస్టీల రిజర్వేషన్లు.. వార్డు సభ్యులు, ఎంపీటీసీల మొత్తం సీట్ల సంఖ్యలో సగానికి కంటే తక్కువగా ఉండరాదు. అంతేగాక గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, మండల పరిషత్‌ అధ్యక్షుల పదవులన్నిటినీ, మొత్తం జడ్పీటీసీలను ఎస్టీలకే కేటాయించాలి.


ఎన్నికలకు నిర్దుష్ట షెడ్యూల్‌

  • పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ జారీచేసిన రోజు నుంచి మూడో రోజు సాయంత్రం 5 గంటలలోపు రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల నోటీసు జారీచేయాలి.
  • ఐదో రోజు సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల స్వీకరణ.. ఆరో రోజు సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల పరిశీలన.. 7వ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల తిరస్కరణపై ఆర్డీవో/జిల్లా కలెక్టర్‌కు అప్పీలు.. 8వ రోజు సాయంత్రం 3 గంటలకు అభ్యర్థిత్వాల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ.. 13వ రోజు అవసరమైన చోట ఎన్నికల నిర్వహణ.. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
  • ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నోటిఫికేషన్‌ జారీచేసినప్పటి నుంచి మూడో రోజు సాయంత్రం 5 గంటల లోపు రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల నోటీసు జారీచేస్తారు.
  • ఐదో రోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.. ఆరో రోజు సాయంత్రం 5 గంటల దాకా నామినేషన్ల పరిశీలన.. 7వ రోజు సాయంత్రం ఐదు గంటల లోపు నామినేషన్ల తిరస్కరణపై ఆర్డీవో/జిల్లా కలెక్టర్‌కు అప్పీలు.. 8వ రోజు సాయంత్రం 3 గంటల వరకు అభ్యర్థిత్వాల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ.. 15వ రోజు అవసరమైన చోట ఎన్నికల నిర్వహణ.
  • ఎస్‌ఈసీ నిర్ధారించిన సమయం, తేదీ ప్రకారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. సెలవు రోజులైనా ఇదే షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలి.

Updated Date - 2020-02-21T09:30:14+05:30 IST