Abn logo
Jul 22 2021 @ 02:30AM

Jagan పై ఆర్ఎస్ఎస్ పత్రిక సంచలన కథనం

మతమార్పిడులే జగన్‌ అజెండా

క్రిస్టియన్‌ మిషనరీ తరహాలో అమలు

దీనివల్ల దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం

అధికారం కోసం హిందూ వ్యతిరేక అజెండా

విధానాలపై విమర్శలతోనే రఘురామ అరెస్ట్‌ 

ఎమర్జెన్సీలోనూ ఇలాంటి వేధింపుల్లేవు 

ప్రధానిని, జడ్జీలనూ టార్గెట్‌ చేస్తారేమో? 

జగన్‌కు ఉద్యోగం లేదు.. వ్యాపారమూ లేదు

అయినా ఆయన సంపద వందల కోట్లు 

ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ‘ది ఆర్గనైజర్‌’ కథనం


అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మతమార్పిడులే అజెండాగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగుతోందని ఆర్‌ఎ్‌సఎస్‌ పత్రిక ‘ది ఆర్గనైజర్‌’ విమర్శించింది. జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు పాశ్చాత్య క్రిస్టియన్‌ మిషనరీ అజెండాను అమలు చేస్తున్నారని పేర్కొంది. దీనివల్ల దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారం కోసం జగన్‌ కుటుంబం ప్రమాదకరమైన హిందూ వ్యతిరేక అజెండాను అనుసరిస్తోందని  ఆరోపించింది. జగన్‌ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ అనిల్‌ కుమార్‌ పేర్లను కూడా ఈ కథనంలో ప్రస్తావించింది. క్రిస్టియానిటీలోనికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లడం దేశానికి ప్రమాదకరమని పేర్కొంది. జగన్‌ పాలన విధ్వంసకరంగా సాగుతోందని దుయ్యబట్టింది. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, కూల్చివేత.. ఎంపీ రఘురామ కృష్ణరాజును అంతమొందించేందుకు జగన్‌ కుట్ర పన్నారంటూ ఆయన భార్య బాహాటంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కథనం రాయాల్సి వస్తోందని వెల్లడించింది. ఈ నెల 17న ది ఆర్గనైజర్‌లో ప్రచురితమైన ప్రత్యేక కథనంలో ముందుమాటగా పేర్కొంది. ఒకప్పుడు వలస పాలనలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్టుగా ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి విధ్వంస రచన జరుగుతోందనే ప్రచారం జరుగుతోందని తెలిపింది. 


విమర్శించినందుకే రఘురామ అరెస్ట్‌ 

జగన్‌ పాలనలో హిందూ వ్యతిరేక విధానాలు, అవినీతి, కులతత్వంపై వరుసగా విమర్శలు చేయడం వల్లే రఘురామరాజును అరెస్ట్‌ చేయించారని ‘ది ఆర్గనైజర్‌’ కథనంలో పేర్కొంది. రఘురామ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు జోక్యంతో ఆయనకు ఊరట కలిగిందని పేర్కొంది. ఎమర్జెన్సీ విధించినపుడు కూడా ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి వేధింపులు జరగలేదని పేర్కొంది. అక్రమాస్తుల కేసులో జగన్‌ 16 నెలలు జైలులో ఉన్నారని, ఆ కాలంలో ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించినట్టు ఆరోపణలు రాలేదని పేర్కొంది. 


ఇది సిగ్గుచేటు కాదా..? 

అక్రమాస్తుల కేసులో 2012లో సీబీఐ జగన్‌ను అరెస్టు చేసిందని.. ఆ సమయంలో ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా ఆరోపణలు వచ్చాయని ది ఆర్గనైజర్‌ పేర్కొంది. తన తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు గాను పలు కంపెనీలకు లబ్ధి కలిగేలా కుట్రపన్నారని సీబీఐ చార్జిషీటులో పేర్కొందని వెల్లడించింది. ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదా అని ప్రశ్నించింది. బెంగళూరు, పులివెందుల, హైదరాబాద్‌లలో జగన్‌ విలాసవంతమైన భవంతులు నిర్మించారని, అమరావతిలోనూ అత్యంత ఖరీదైన భవంతిని నిర్మించారని వెల్లడించింది. 2011లో హైదరాబాద్‌లోని జగన్‌ నివాసంలో సీబీఐ దాడులు చేసినప్పుడు.. ఎకరా విస్తీర్ణంలో 75 గదులున్న ఆ భవనంలో విచారణ చేసేందుకు సీబీఐకి పది గంటల సమయం పట్టిందని తెలిపింది. ఈ భవనం విలువ దాదాపు రూ.400 కోట్లు ఉంటుందని అనధికారిక అంచనా అని వెల్లడించింది. ఈ భవనంపై హెలిప్యాడ్‌ నిర్మించే యోచనలో జగన్‌ ఉన్నారంటూ ప్రచారం జరిగిందని, బెంగళూరులోని ఆయనకు చెందిన 31 ఎకరాల భవన సముదాయంలో హెలిప్యాడ్‌ ఉందని వెల్లడించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. దేశ జనాభాలో అత్యధికులు సాదాసీదా జీవితం గడుపుతుంటే.. జగన్‌ అత్యంత విలాసవంతంగా ఉన్నారని పేర్కొంది. 


ఏం చేయకున్నా వందల కోట్ల ఆస్తులు

జగన్‌ ఒక్క ఉద్యోగం కూడా చేయలేదని, వ్యాపారమూ నిర్వహించలేదని, అయినా ఆయన సంపద వందల కోట్లు    ఉంటుందని ఘాటుగా విమర్శించింది. ఓ సిట్టింగ్‌ ఎంపీనే టార్గెట్‌ చేసినపుడు.. రేపు జగన్‌ అజెండాను విమర్శిస్తే ప్రధాని, హోం మంత్రి, సుప్రీం కోర్టు/హైకోర్టు న్యాయమూర్తులను కూడా టార్గెట్‌ చేయరా అనే సందేహాలు కలుగుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో చట్టాలు సరిగా పనిచేయడం లేదని, జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే 24 గంటల్లో అరెస్ట్‌ చేస్తారని చాలామంది చెబుతున్నారని వ్యాఖ్యానించింది. ఆర్‌ఎ్‌సఎస్‌ పత్రిక ది ఆర్గనైజర్‌లో జగన్‌పై ప్రత్యేక విమర్శనాత్మక కథనం రావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.