మార్పేదీ ?

ABN , First Publish Date - 2020-08-15T10:06:34+05:30 IST

వెసులుబాటనుకున్నారో ? వదిలేశారనుకున్నారో ? ఏమోగానీ ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం

మార్పేదీ ?

 సమయం పెంచినా అదే తీరు

 గుంపులుగుంపులుగానే జనం

 బ్యాంకులు, సచివాలయాల వద్ద కనిపించని భౌతిక దూరం

 వ్యాపార సముదాయాల్లో శానిటైజర్‌కు తిలోదకాలు

 ఉదాశీనంగా అధికారులు

 కరోనా ఉధృతికి అడ్డుకట్ట ఎలా ?


 అనంతపురం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వెసులుబాటనుకున్నారో ? వదిలేశారనుకున్నారో ? ఏమోగానీ ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం పొడిగించినా జన ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు జనంతో నిండిపోతున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా, మరణాలు పెరిగిపోతున్నా ప్రజల్లో అదే అజాగ్రత్త కనిపిస్తోంది. ఇందుకు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిస్థితులే అద్దం పడుతున్నాయి.


దాదాపు నాలుగున్నర నెలల నుంచి కరోనా లాక్‌డౌన్‌ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ వ్యాపారాలు చేసుకునేందుకు లాక్‌డౌన్‌ సడలింపు ఇచ్చారు.  ఈ ఐదు గంటల వ్యవధిలో జనాలంతా ఒక్కసారిగా అవసరాల కోసం రోడ్లపైకి రావడంతో కరోనా ఉధృతి పెరిగింది. దీంతో వివిధ వ్యాపార వర్గాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు జిల్లా యంత్రాంగం సడలింపును మరో మూడు గంటలు పొడిగించింది. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకూ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ సమయాన్ని అటు ప్రజలు, ఇటు వ్యాపార వ ర్గాలు సద్వినియోగం చేసుకోవడంలో కొంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


నిబంధనలకు తిలోదకాలు 

దుకాణాల వద్ద కొవిడ్‌ నిబంధనలకు నీళ్లు వదిలేసినట్టు కనిపిస్తోంది. మాస్కులు ధరించడం లేదు. శానిటైజర్‌ను అందుబాటులో ఉంచడం లేదు. భౌతికదూరం పాటించడం లేదు. ఎంత మంది వస్తే... అంత మందిని దుకాణంలోకి అనుమతిస్తున్నారు. తద్వారా కరోనా సోకే ప్రమాదం ఉంది. బ్యాంకుల వద్ద ఖాతాదారులు బారులు తీరుతున్నారు. తాజాగా వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కావడంతో  ఆ డబ్బును డ్రా చేసుకునేందుకు పోటీపడుతున్నారు. దీంతో కొవిడ్‌ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు.


  ఈ పరిస్థితి అనంతపురం నగరంలోనే అధికంగా కనిపిస్తోంది. ఆగస్టు 15న తలపెట్టిన ఇంటి పట్టాల పంపిణీ వాయిదా పడినా సచివాలయాల ద్వారా బాండ్లు ఇస్తున్నారన్న సమాచారంతో అర్హులందరూ గుంపులు గుంపులుగా అక్కడికి పోటెత్తుతున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతోనే వారంతా సచివాలయాల వద్దే పడిగాపులు కాశారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడుతుండటం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువవుతోంది. 


చేతులెత్తేసిన అధికారులు

లాక్‌డౌన్‌ సడలింపులతో కొవిడ్‌ నిబంధనలు వ్యాపారులు పాటించేలా పర్యవేక్షించడంలో అధికారులు ఉదాసీనత పాటిస్తున్నారు. బ్యాంకుల వద్ద రద్దీని నియంత్రించి భౌతికదూరం పాటించేలా చూడాల్సిన బ్యాంకర్లు చేతు లెత్తేస్తున్నారు. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా, కూడళ్లల్లో ఎక్కడబడితే అక్కడ జనం గుంపులుగా లేకుండా చూడాల్సిన పోలీసు అధికారులు ఆ బాధ్యతను మరచిపోయారు. ఈ పరిణామాలన్నీ కరోనా వైరస్‌ వ్యాప్తికి మరింత ఊతమిస్తున్నాయి. 


 కర్ఫ్యూ ఎత్తివేత

జిల్లాలో ప్రతి శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకూ అమలు చేస్తున్న కర్ఫ్యూను ఎత్తి వేస్తున్నట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఇదివరకూ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ జిల్లా అంతటా కర్ఫ్యూ ఉత్తర్వులు అమల్లో ఉన్న విష యం తెలిసిందే. ఆ ఉత్తర్వులను శుక్రవారం కలెక్టర్‌ రద్దు చేశారు.

Updated Date - 2020-08-15T10:06:34+05:30 IST