ఎనహెచ-65ని ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చాలి

ABN , First Publish Date - 2022-01-23T06:06:10+05:30 IST

రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి(ఎనహెచ-65)ని ఎనిమిది వరసల ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎనహెచ-65ని ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చాలి
రామకృష్ణ, అతని కుమారుడి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

చౌటుప్పల్‌ టౌన, జనవరి 22: రోడ్డు  ప్రమాదాల నివారణకు హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి(ఎనహెచ-65)ని ఎనిమిది వరసల ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మునిసిపాలిటీ పరిధిలోని లక్కారానికి చెందిన డాకోజీ రామకృష్ణ (38), అతని చిన్న కుమారుడు విశ్వసాయి(9) లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి మృత దేహాలపై  పూలమాలలు వేసి ఎంపీ వెంకట్‌రెడ్డి శనివారం నివాళులర్పించారు. రామకృష్ణ కుటుంబం దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురి కావడం పట్ల ఎంపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షలు సాయంగా ఎంపీ అందజేశారు.  హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రామకృష్ణ బార్య శ్రీలక్ష్మి, పెద్ద కుమారుడు మణి చరణ్‌లకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, అందుకు అవసరమైన ఖర్చులను తానే భరిస్తానని ఎంపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని కామినేని హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌కు ఎంపీ ఫోన చేసి చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ జరిగిన మణిచరణ్‌కు ప్రత్యేక వార్డులో చికిత్స అందించాలని ఎంపీ సూచించారు. మణిచరణ్‌ను  తానే చదివిస్తానని, ఆర్థికంగా ఉన్న వారు ఆ కుటుంబానికి తోచిన విధంగా సహాయం అందించాలని ఎంపీ కోరారు.  అనంతరం విలేకరులతో  ఎంపీ మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్న హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిని ఎనిమిది వరసల ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చడంతో పాటు, సమాంతర జాతీయ రహదారిని సైతం ఏర్పాటు చేస్తామని  విభజన చట్టంలో పేర్కొన్నారని ఆయన తెలిపారు. విభజన చట్టంలోని అంశాలను  పార్లమెంట్‌లో ఇప్పటికే ప్రస్తావించానని ఆయన అన్నారు. హైదరాబాద్‌- విజయవాడ మధ్య ఉదయం వెళ్లి సాయంత్రం వస్తున్నారని, దీంతో రెండు రాష్ట్రాల మధ్య హైవేపై ట్రాిఫిక్‌  రోజు రోజుకు పెరిగి పోతోందని ఆయన తెలిపారు. హైవేపై పెరిగిన ట్రాఫిక్‌కు సరిపడు రోడ్డు వెడల్పు లేక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆయన అన్నారు. చౌటుప్పల్‌, చిట్యాల వంటి పట్టణాల్లో ఫ్లై ఓవర్‌లు లేక పోవడంతో ప్రతి రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని, సర్వీస్‌ రోడ్లు సక్రమంగా లేనందున రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు.  రామకృష్ణ సంఘటనతో పాటు ఇతర రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తుల జాబితాను   కేంద్ర మంత్రి నితిన గడ్గరీ దృష్టికి తీసుకు వెళ్లి వాస్తవ పరిస్థితిని వివరిస్తానని, ఎనిమిది వరసల ఎక్స్‌ప్రెస్‌ హైవే ను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ బ్లాక్‌, పట్టణ, మండల అధ్యక్షులు ఉబ్బు వెంకటయ్య, ఎం.రమేష్‌ గౌడ్‌, శ్రీనాథ్‌,  డీసీసీ కార్యదర్శులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నర్సింహ,  కౌన్సిలర్‌లు కొయ్యడ సైదులు, కాసర్ల మంజుల శ్రీనివాస్‌రెడ్డి, కామిశెట్టి శైలజ భాస్కర్‌, ఎల్‌.బీమయ్య పాల్గొన్నారు.

భావోద్వేగానికి గురైన ఎంపీ

 రామకృష్ణ తల్లి శారదమ్మ, ముగ్గురు అక్కలు, తమ్ముడు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండడంతో తల్లడిల్లిన ఎంపీ వెంకట్‌రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీరు కార్చారు. ఎంపీ కన్నీరు పెట్టడంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం అలముకుంది.


Updated Date - 2022-01-23T06:06:10+05:30 IST