Abn logo
Sep 25 2021 @ 01:15AM

పదవి కోసం మతమార్పిడి!


అచ్యుతాపురం, సెప్టెంబరు 24 :  కో-ఆప్షన్‌ సభ్యుడి పదవి కోసం స్వచ్ఛమైన ఓ హిందువు అయిన నాయకుడు మైనార్టీ సర్టిఫికెట్‌ తెచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మండలంలో అతి పెద్ద మత్స్యకార్ల గ్రామమైన పూడిమడకలో చేపల ఇంటి పేరు గల మత్స్యకార కుటుంబానికి ప్రతేక గుర్తింపు ఉంది. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినా ఈ కుటుంబానికి చెందిన వారే సర్పంచులుగా ఎన్నికవుతున్నారు. ఇందులో చేపల శ్రీరాములు అంటే పూడిమడకలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈయన కరడుగట్టిన తెలుగుదేశం నాయకుడు. ఇతని తండ్రితో పాటు ఈయన, ఈయన భార్య కూడా గతంలో సర్పంచులుగా చేశారు. పరిస్థితులు ప్రభావం వల్ల ఈయన వైసీపీలో చేరారు. పూడిమడకలో మత్స్యకార్ల కులదేవతల పండుగలకు ఈ కుటుంబమే ముందుండేది. అటువంటి శ్రీరాములు ఎటువంటి ప్రాధాన్యం లేని కేవలం కో- ఆప్షన్‌ సభ్యుడి పదవి కోసం అప్పటికప్పుడు క్రిస్టియన్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకున్నారు. దీంతో ఆయన కో-ఆప్షన్‌ సభ్యుడుగా ఎన్నికయ్యారు.  అయితే ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా.. పలు కొర్రీలు వేసే రెవెన్యూ అధికారులు, అప్పటికప్పుడు శ్రీరాములుకి క్రిస్టియన్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారన్నదే ఇప్పుడు అందరిలో చర్చగా మారింది.