కాసులిస్తేనే..కన్వర్షన్‌..!

ABN , First Publish Date - 2021-06-20T05:36:06+05:30 IST

కాసులు ముట్టందే కార్యాలయాల్లో భూముల కన్వర్షన్‌కు సంబంధించి ఫైళ్లకు చలనం రావడం లేదు. కన్వర్షన్‌ చేసే భూమి ఉన్న ప్రాంతాన్ని బట్టి కమీషన్‌ రేటు మారుతోంది. ఎవరు తీసుకుంటారా పైసలూ అంటే ఫైళ్లు పట్టుకొని చూసిన ప్రతివాడి చేయి తడవాల్సిందే. అది అధికారైనా... అంటెండర్‌ అయినా తప్పని పరిస్థితి. ఇదీ మార్కాపురం ప్రాంతంలో రెవెన్యూ లీల.

కాసులిస్తేనే..కన్వర్షన్‌..!
నివేశన స్థలాలుగా మారిన వ్యవసాయ భూమి

 ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.80 వేల మేర వసూలు

సంతకానికో రేటు

ఆఫీస్‌ సిబ్బంది, వీఆర్వోలే మధ్యవర్తులు

మార్కాపురం, జూన్‌ 18: కాసులు ముట్టందే కార్యాలయాల్లో భూముల కన్వర్షన్‌కు సంబంధించి ఫైళ్లకు చలనం రావడం లేదు.  కన్వర్షన్‌ చేసే భూమి ఉన్న ప్రాంతాన్ని బట్టి కమీషన్‌ రేటు మారుతోంది. ఎవరు తీసుకుంటారా పైసలూ అంటే ఫైళ్లు పట్టుకొని చూసిన ప్రతివాడి చేయి తడవాల్సిందే. అది అధికారైనా... అంటెండర్‌ అయినా తప్పని పరిస్థితి. ఇదీ మార్కాపురం ప్రాంతంలో రెవెన్యూ లీల.


పెరిగిన రియల్‌ ఎస్టెట్‌

మొన్నటివరకూ వెలిగొండ ప్రాజెక్ట్‌, నిన్న పునరావాస కాలనీలు, నేడు మెడికల్‌ కళాశాల. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు రియల్టర్లు చేయని ప్రయత్నాలంటూ లేవు. ఇలా డబ్బులు సంపాదించడంలో ప్రతి రియల్‌ భాగస్వామ్య కూటమి పోటీ పడుతోంది. దీంతో పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు నుంచి మార్కాపురం మండలం రాయవరం వరకూ ఉన్న వ్యవసాయ భూములపై రియల్టర్లు కన్నేశారు. అవకాశం ఉన్న చోటల్లా కొద్దిమొత్తంలో బయానాలు ఇచ్చి అగ్రిమెంట్లతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాటిని ప్లాట్లుగా వేసి భూయజమాని పేరుపై వ్యవసాయ భూములను నివాస భూములుగా మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.


చలానా నుంచి చేయి తడిపే వరకూ.. 

ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యవసాయ భూమిని నివాస స్థలాలుగా మార్చేందుకు ప్రభుత్వ విలువలో 3 శాతం చలానా కడితే సరిపోతుంది. కానీ అది మార్కాపురం డివిజన్‌లో అమలు జరగడం లేదు. చలానా కట్టినప్పటి నుంచి తుది ఉత్తర్వులు వెలువడే వరకూ ఎకరాకు రూ.50వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. అదీ వారి సంతకానికి ఉన్న విలువ ఆధారంగా వసూలు చేస్తున్నారు. చివరకు సంబంధిత ఉత్తర్వులపై సీలు వేసే అటెండర్‌కు సైతం చేయి తడపాల్సిన పరిస్థితి.


6 ఎకరాలకు రూ.3.40లక్షలు వసూలు

ఇటీవల మార్కాపురం మండలం రాయవరం వద్ద  ఓ భూమి కన్వర్షన్‌కు సంబంధించి భారీస్థాయిలో లావాదేవీలు జరిగినట్లు సమాచారం.  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలో ఈ స్థలం ఉంది. ఆ స్థలంలో ఇప్పటికే ప్లాట్ల క్రయావిక్రయాలు జరిగాయి. ఆరు ఎకరాల స్థలానికి సంబంధించి భూయజమానులు రెవెన్యూ సిబ్బందికి ముడుపుల రూపంలో రూ.3.40లక్షలు చెల్లించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా ఇంకా బయటకు రానివి చాలా ఉన్నాయి. అనేక కన్వర్షన్‌ వ్యవహారాలు జోరుగా జరుగుతున్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-06-20T05:36:06+05:30 IST