రాహుకేతు పూజల్లో వసూళ్ల వివాదం

ABN , First Publish Date - 2022-06-30T07:20:55+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలోని రూ.500 రాహుకేతు పూజా మండపంలో బుధవారం అక్రమ వసూళ్ల వివాదం చెలరేగింది.

రాహుకేతు పూజల్లో వసూళ్ల వివాదం

ఉన్నతాధికారులకు భక్తుడి ఫిర్యాదు

నలుగురు ఒప్పంద ఉద్యోగులపై చర్యలు

శ్రీకాళహస్తి, జూన్‌ 29 : శ్రీకాళహస్తీశ్వరాలయంలోని రూ.500 రాహుకేతు పూజా మండపంలో బుధవారం అక్రమ వసూళ్ల వివాదం చెలరేగింది. ఓ భక్తుడు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అక్కడ పనిచేసే నలుగురు ఒప్పంద ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో రూ.500 రాహుకేతు పూజామండపంలో భక్తుల నుంచి బలవంతంగా దక్షిణ రూపంలో వసూళ్లు చేస్తున్నట్లు చాలా కాలంగా విమర్శలున్నాయి. రెండు వారాల క్రితం భక్తుల నుంచి ఎవరూ బలవంతంగా వసూళ్లు చేయకూడదంటూ ఆలయ ఈవో సాగర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ అడపా దడపా గుట్టుచప్పుడు కాకుండా మండపంలో పనిచేసే అర్చకులు, సిబ్బంది వసూళ్లకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం భక్తుల నుంచి వసూళ్లు చేసిన కారణంగా రూ.500 రాహుకేతు పూజామండపంలో ఇద్దరు అర్చకులను ఈవో సస్పెండ్‌ చేశారు. అయినా మళ్లీ వసూళ్లు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించారు.



ఈ నేపథ్యంలో బుధవారం మరో భక్తుడు కుటుంబసభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చాడు. రాహుకేతు పూజ చేయించుకునేందుకు టిక్కెట్టు కోసం కౌంటర్‌ వద్దకు వెళ్లాడు.రూ.500 పూజామండపంలో పనిచేసే ఓ ఉచిత సేవకుడు తాను అడ్డదారిలో టిక్కెట్టు తీసుకువచ్చి క్యూలైన్‌లో కాకండా నేరుగా మండపంలో పూజకు కూర్చోబెడతానని భక్తుడితో బేరం కుదుర్చుకున్నాడు. ఆ మేరకు భక్తుడి వద్ద రూ.500 టిక్కెట్టుగాను రూ.700చొప్పున మూడు టిక్కెట్లుకు నగదు తీసుకుని అడ్డదారిలో మండపంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. పూజ ముగిసిన తరువాత అర్చకులు ఇన్‌ఛార్జి సిబ్బంది ఖచ్చితంగా దక్షిణ సమర్పించాలని భక్తులను ఆదేశించారు.దీంతో భక్తుడు దక్షిణ ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించాడు. ఖచ్చితంగా దక్షిణ  ఇస్తేనే దోష పరిహారం జరుగుతుందని లేకపోతే పాపం మూటగట్టుకోవాల్సి వస్తుందని అక్కడ పనిచేస్తున్న వారు తనను మాటలతో ఆవేదనకు గురిచేశారని భక్తుడు వాపోయాడు.



దర్శనానంతరం కుటుంబంతో సహా భక్తుడు ఆలయ పరిపాలన భవనానికి చేరుకుని అధికారులకు అక్రమవసూళ్లపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మండపంలో పూజ జరుగుతున్న సమయంలో విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి అక్కడే నోట్లో ఖైనీ నములుతూ ఉమ్ముతుండడం తమను  కలచివేసిందని అధికారులకు మొరపెట్టుకున్నాడు.దీంతో ఉదయం విధుల్లో ఉన్న బాలసుబ్రహ్మణ్యం అలియాస్‌  బాచి, కుమారరాజారెడ్డి, గంగాధర్‌, పార్థసారథిరెడ్డి అనే నలుగురు ఒప్పంద ఉద్యోగులను మండపంలోని విధుల నంచి తప్పిస్తున్నట్లు ఈవో ఆదేశాలు జారీ చేశారు.గురువారం ఈ ఘటనపై పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అయితే రాహుకేతు మండపంలో అసలు  సూత్రధారులను పక్కన పెట్టి ఒప్పంద ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మండపంలో వసూళ్లు చేసిన అర్చకులు, అర్చక విభాగం  సిబ్బంది, ఇన్‌ఛార్జి అధికారులను వదిలి వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే దళారీలుగా మారి అధిక ధరలతో రాహుకేతు టిక్కెట్లు తీసుకువచ్చిన ఉచిత సేవకులను విస్మరించడం కూడా గమనార్హం. 

Updated Date - 2022-06-30T07:20:55+05:30 IST