డబుల్‌.. గుబుల్‌..!

ABN , First Publish Date - 2022-07-05T08:29:32+05:30 IST

నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా పేర్కొంటూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం..

డబుల్‌.. గుబుల్‌..!

  • ఇళ్ల పంపిణీపై తర్జనభర్జన
  • లాటరీ తీద్దామా.. డ్రైవ్‌ చేపడదామా?
  • ‘డబుల్‌’ ఇళ్లపై అధికారుల సమాలోచనలు
  • లక్షల సంఖ్యలో ఇళ్ల ఆశావహులు 
  • నిర్మాణం పూర్తైన ఇళ్లు 1.13 లక్షలే
  • దీర్ఘకాలంగా పంపిణీ చేయని సర్కారు
  • ఆశావహుల్లో పెరిగిపోతున్న అసహనం
  • కాంట్రాక్టర్లకూ రెండేళ్లుగా బిల్లుల్లేవు
  • పెండింగ్‌లో రూ.705 కోట్ల బిల్లులు


హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా పేర్కొంటూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని లబ్ధిదారులకు అందజేసే విషయంలో మాత్రం తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 13 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి కాగా, ఇళ్లను ఆశిస్తున్నవారి సంఖ్య కొన్ని లక్షల్లో ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చాలా కాలం క్రితమే ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. వీటిని పంపిణీ చేస్తే ఇల్లు దక్కనివారి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇన్నాళ్లుగా పెండింగ్‌లో పెడుతూ వస్తోంది. అయితే ఈ జాప్యం కారణంగా లబ్ధిదారుల్లో అసహనం పెరిగిపోయి.. ఇళ్ల కోసం ఆందోళనలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు ఏకంగా తాళాలు పగులగొట్టి ఇళ్లను ఆక్రమించేసుకున్నారు. మరికొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతినడం కూడా జరుగుతోంది. ఇది స్థానిక ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. దీనిని ఇంకా పెండింగ్‌లో పెడితే ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తుందన్న ఆందోళన వారిలో నెలకొంది. దీంతో మరింత ఆలస్యం చేయకుండా ఈ విషయంపై దృష్టి సారించాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఈ మేరకు ఇళ్లను ఎలా పంచాలన్న దానిపై తెలంగాణ గృహనిర్మాణ శాఖ సమాలోచనలు జరుపుతోంది. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడమా? లేక లాటరీ విధానాన్ని అవలంబించడమా? అని చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని రాష్ట్రప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,91,057 ఇళ్లు నిర్మించాలని సంకల్పించింది. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రచించింది. కానీ, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,535 ఇళ్లను మాత్రమే పూర్తి చేసింది. వీటిలో గ్రేటర్‌లో 56,066, ఇతర జిల్లాల్లో 57,469 ఉన్నాయి. వీటిలో కేవలం 17 వేల ఇళ్లను మాతమ్రే లబ్ధిదారులకు పంపిణీ చేసింది. మరో 69,488 ఇళ్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి ఇంకా నిర్మాణం ప్రారంభించని ఇళ్లే 61,606 ఉన్నాయని హౌసింగ్‌ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పూర్తయిన ఇళ్లను పంపిణీ చేద్దామా? మొత్తం పూర్తయ్యాకే పంపిణీ ప్రారంభిద్దామా? అన్న అంశంపై హౌసింగ్‌ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై సీఎం కేసీఆర్‌ నుంచి స్పష్టమైన ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. 


స్పెషల్‌ డ్రైవ్‌ లేదా లాటరీ?

ఇప్పటివరకు పూర్తయిన 1,13,535 ఇళ్లను పంపిణీ చేేసందుకు ఒకేసారి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడం లేదా లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడంలో ఏదో ఒక దానిని ఎంచుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తే.. ఎక్కువ మంది ఇల్లు లేని పేదలు తమకు ఇల్లు కావాలంటూ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఇల్లు దక్కనివారు అక్కడికొచ్చి గొడవ చేస్తే.. సమస్యగా పెద్దది అవుతుందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాటరీ విధానాన్ని చేపడితే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. ఇటీవల రాజీవ్‌ స్వగృహ ఇళ్ల విక్రయానికి నిర్వహించినట్లుగానే ఎక్కడికక్కడ అర్హులైన వారితో లాటరీ తీయాలని భావిస్తున్నారు. లాటరీ వచ్చిన వారిని లబ్ధిదారులుగా గుర్తించడం, రానివారిని వెయిటింగ్‌ లిస్టులో పెట్టి తర్వాత ఎంపిక చేస్తామని చెప్పొచ్చని హౌసింగ్‌ శాఖ అధికారులు యోచిస్తున్నారు. దీంతో రానివారు కూడా ఎక్కడా ఆందోళన ఘటనలు చేపట్టే అవకాశం ఉండదని భావిస్తున్నారు. 


పెండింగ్‌లో బిల్లులు.. కష్టాల్లో కాంట్రాక్టర్లు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం కాంట్రాక్టర్లకు కూడా కష్టాలను తెచ్చిపెట్టింది. 2020 మే నెల తర్వాత ఈ పథకం కింద జరిగిన పనులకుగాను చెల్లించాల్సిన రూ.705 కోట్ల బిల్లులను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన విధంగా ఇళ్లు కట్టించుకొని.. పెండింగ్‌ బిల్లుల చెల్లింపు విషయాన్ని వారి వద్ద ప్రస్తావిస్తే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,13,535 ఇళ్లను పూర్తిస్థాయిలో నిర్మించగా.. ఈ ఇళ్లకుగాను రూ.14,786 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇందులో ఖర్చుచేసింది రూ.10,800 కోట్లు మాత్రమేనని తెలుస్తోంది. ఈ నిధుల్లోనూ హడ్కో నుంచి వచ్చిన రుణమే రూ.8,744  కోట్లకు పైగా ఉందని హౌసింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణాల్లో రూ. 5.30 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో  అయితే రూ.7 లక్షల చొప్పున ప్రభుత్వం ధర నిర్థారించింది.


 అయితే 2016 తర్వాత సిమెంట్‌, ఇసుక, ఐరన్‌ లాంటి ముడిసరుకుల ధరలు, కూలి రేట్లు పెరగడంతో చాలా చోట్ల సర్కారు ఇచ్చే బడ్జెట్‌ సరిపోవడంలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దాంతోపాటు, ఈ స్కీమ్‌ ప్రారంభించిన తర్వాత స్టాండర్డ్‌ షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌ (ఎస్‌ఎ్‌సఆర్‌) కూడా పెంచకపోవడంతో ఆర్థికంగా మరింత భారాన్ని మోయాల్సి వస్తోందని అంటున్నారు. అయితే హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ) నుంచి రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పు పుడితేనే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్‌ నిధులు రూ.705 క్లియర్‌ చేయాలని సర్కారు యోచిస్తున్నట్టు హౌసింగ్‌ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. రూ. 2 వేల కోట్ల రుణం కోసం హౌసింగ్‌ శాఖ అధికారులు కొంతకాలంగా హడ్కో అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై హౌసింగ్‌ స్పెషల్‌ సీఎస్‌ సునీల్‌ శర్మ ఇటీవల ఢిల్లీ వెళ్లి హడ్కో అధికారులతో భేటీ అయినా.. ఇంతవరకు రుణంపై  స్పష్టతరాలేదు. 


Updated Date - 2022-07-05T08:29:32+05:30 IST