రగడ

ABN , First Publish Date - 2020-05-30T10:56:25+05:30 IST

రిమ్స్‌ ఆసుపత్రిలో మళ్లీ రగడ మొదలయ్యింది. ముందు నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా

రగడ

రిమ్స్‌లో డైరెక్టర్‌, వైద్యుల మధ్య వివాదం

తరుచూ మెమోల జారీపై అభ్యంతరాలు

విపత్కర పరిస్థితుల్లోనూ ఆందోళనలు

ఒకరిపై మరొకరు కలెక్టర్‌కు ఫిర్యాదులు

జూన్‌ 4న రిమ్స్‌ వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం


ఆదిలాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి) : రిమ్స్‌ ఆసుపత్రిలో మళ్లీ రగడ మొదలయ్యింది. ముందు నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో తాజాగా వైద్య సిబ్బంది, డైరెక్టర్‌ మధ్య విభేదాలకు దారి తీసింది. గత వారం రోజులుగా డైరెక్టర్‌ వర్సెస్‌ వైద్య సిబ్బంది మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది. నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి వైద్యులే నిరసనలు, ఆందోళనల బాట పడుతున్నారు.దీంతో అత్యవసర సేవలు అందక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.రిమ్స్‌ ఆసుపత్రి కి నిత్యం 1500నుంచి రెండు వేల వరకు రోగులు వస్తుంటారు. ఇలా 24గంటల పాటు రద్దీగా కనిపించే ఆసుపత్రిలో తరుచు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.


గతంలో జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన అహ్మద్‌బాబు, జ్యోతిబుద్దప్రకాష్‌, దివ్యదేవరాజన్‌లు రిమ్స్‌ ఆసుపత్రిపై ప్రత్యేకదృష్టిని సారించి ప్రక్షాళన దిశగా అడుగులు వేసిన ఆసుపత్రి తీరు మారినట్లు కనిపించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న రిమ్స్‌ వైద్యుల పని తీరుతో వైద్య సేవలు అబాసుపాలవుతున్నాయి. గత కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ రిమ్స్‌ ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేసి ఇద్దరు వైద్యులపై క్రమశిక్ష ణ చర్యలు తీసుకొని వేటువేసి కొరడా ఝలిపించారు. ఎవరూ ఊహించని రీతిలో జిల్లా కలెక్టర్‌ వైద్యులపై ఈ రకమైన చర్యలు తీసుకోవడం తో అప్పట్లో జిల్లా వైద్యాధికారుల్లో కలకలం రేపింది.


అయితే రిమ్స్‌ డైరెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన డా.బలరాంనాయక్‌ తనదైన ముద్ర వేసుకునేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ వస్తున్నారు. దీంతో ఆయన తీరు నచ్చని కొందరు వైద్యులు డైరెక్టర్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే రిమ్స్‌లో గత కొంతకాలంగా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇటీవల కరోనా పరిస్థితులతో దాన్ని కొన్నాళ్ల పాటు పక్కన పెట్టారు. తాజాగా బయోమెట్రిక్‌ ప్రారంభించడాన్ని కొందరు వైద్యులు వ్యతిరేకించడంతో అసలు వివాదం మొదలైనట్లు తెలుస్తుంది. 


కరోనా సమయంలో ఆందోళనలు

అసలే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు ఆందోళన బాట పట్టడం  ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉన్న ఎలాంటి అనుమతులు లేకుండానే సుమారుగా వంద మందికి  పైగా వైద్య సిబ్బంది డైరెక్టర్‌ ఛాంబర్‌ ముందు ఆందోళన చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇప్పటికే కరోనా పరీక్షలు చేసేందుకు రిమ్స్‌లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి అనుమతులు ఇచ్చారు. దీంతో వచ్చి పోయే రోగుల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే రోగులు, వారి బందువులకు కరోనా వైరస్‌ పై అవగాహన కల్పించాల్సిన సమయంలోనే ఆందోళనలు చేయడం సరికాదన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ విధంగా వ్యవహరించడమే పలు విమర్శలకు కారణమవుతుంది.రిమ్స్‌ ఉన్నతాధి కారిగా పని చేస్తున్న డైరెక్టర్‌ సమయపాలన పాటించి అందరి సహాయ సహాకారాలతో వైద్య సేవలను మరింత మెరుగు పర్చాలనే వాదనలు వస్తున్నాయి. 


విధుల పట్ల హెచ్చరికలు

రిమ్స్‌లో పని చేసే వైద్య సిబ్బందికి తరుచు హెచ్చరికలు చేస్తూ మెమోలు జారీ చేయడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు సుమారుగా 15 మంది సిబ్బందికి గడిచిన నాలుగైదు నెలల్లో మెమోలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి చర్యలతో దూకుడుగా వ్యవహరించిన డైరెక్టర్‌కు వ్యతిరేకత మొదలైంది. అలాగే దురుసుగా మాట్లాడడాన్ని కొంతమంది వైద్యులు తప్పుబడుతూ వస్తున్నారు. అనకూడని మాటల తో సిబ్బందిని వేదించడం సరైన పద్ధతి కాదని కొందరు సీనియర్‌ వైద్యులు డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన మార్పు కనిపించడం లేదని చెబుతున్నారు. గత్యంతరం లేకనే ఆందోళన చేయాల్సి వచ్చిందంటున్నారు. వైద్య సిబ్బందిపై పనిఒత్తిడి చేయడం లాంటి విషయాలు కూడా కొంత వ్యతిరేకతకు కారణమంటున్నారు. 


కలెక్టర్‌ వద్దకు రిమ్స్‌ పంచాయితీ

డైరెక్టర్‌, వైద్యుల మధ్య తలెత్తిన విభేదాలు జిల్లా కలెక్టర్‌ వద్దకు చేరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే డైరెక్టర్‌, వైద్యులు వేరు వేరుగా జిల్లా కలెక్టర్‌తో సమావేశమై ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు సమాచారం. గతంలోను ఇలాంటి సమస్యలే తలెత్తడంతో కలెక్టర్లు కల్పించుకొని ఆందోళనలు సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. అయినా వైద్యుల తీరు మారినట్లు కనిపించడం లేదు. ఇరు వర్గాల వాదనలు విన్న జిల్లా కలెక్టర్‌ జూన్‌ 4న రిమ్స్‌ వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశ మయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులతో చర్చించి ఆందోళనలు సద్దుమనిగేలా చర్యలు తీసుకోనున్నారు. 


కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది: బానోత్‌ బలిరాంనాయక్‌, రిమ్స్‌ డైరెక్టర్‌, ఆదిలాబాద్‌

గత వారం రోజుల క్రితం వైద్యులు, సిబ్బంది ఆందోళన చేసిన విషయమై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తదుపరి ఎలాంటి ఆదేశాలు అందలేదు. వైద్యులమంతా ఒకే కుటుంబంగా కలిసి పని చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు ఉండడం సహజమే. రిమ్స్‌లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలంటే వైద్యుల సహాయ సహాకారాలు ఎంతో అవసరం. ఇప్పటి వరకు అందరు సహకరిస్తున్నారు.  కొందరికి నా ఆలోచన విధానాలు నచ్చకపోవడంతోనే వ్యతిరేక వస్తుందని అనుకుంటున్నా.


Updated Date - 2020-05-30T10:56:25+05:30 IST