నగరంపై డేగ కన్ను

ABN , First Publish Date - 2021-10-25T16:55:21+05:30 IST

దీపావళి పండుగను ప్రత్యేకంగా జరుపుకోవడం రాష్ట్రంలో ఆనవాయితీ. పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా తమ తాహతుకు తగినట్ట్లుగా పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే 4వ తేదీన జరుగనున్న

నగరంపై డేగ కన్ను

సీసీ కెమెరాలతో నిఘా... డ్రోన్లతో పర్యవేక్షణ 

6 వేల మంది బలగాలతో భద్రత

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రత్యేక చర్యలు


చెన్నై: దీపావళి పండుగను ప్రత్యేకంగా జరుపుకోవడం రాష్ట్రంలో ఆనవాయితీ. పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా తమ తాహతుకు తగినట్ట్లుగా పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే 4వ తేదీన జరుగనున్న పండుగ కోసం బాణసంచా, దుస్తులు, బంగారం, ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు దుకాణాలకు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా భావించి చోరులు, అసాంఘిక శక్తులు చేతివాటం ప్రదర్శించే అవకాశముండడంతో నగర పోలీసు శాఖ అప్రమత్త మైంది. ఎక్కడికకక్కడ పటిష్టమైన చర్యలు చేపట్టి అవాం ఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంది. పండగ సీజన్‌లో నేరాలు జరుగకుండా, కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగకుండా అడ్డుకునేందుకు వీలు గా నగర పోలీసులు తమవంతు చర్యలను చేపట్టను న్నారు. ఇందుకోసం పండుగ సీజన్‌లో నగరంలో తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. ఈ నిఘా కోసం సాధారణ సీసీ కెమెరాలతో పాటు.. ‘పోలీసుల షర్ట్‌ కెమెరా’లు, డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించారు. ముఖ్యంగా, కొనుగోలు దారులు, నగరవాసులు అధికంగా గుమికూడే ప్రదేశాల్లో ఈ నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. ప్రధానం గా నగరంలో ఉన్న ప్రధాన వ్యాపార కేంద్ర ప్రాంతాలైన టి.నగర్‌, పురుషవాక్కం, ప్యారీస్‌, వాషర్‌మెన్‌పేట, పాడి, క్రోంపేట, తాంబరం, మైలాపూర్‌, ట్రిప్లికేన్‌, వేళచ్చేరి తదితర ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి నిఘాపెట్ట నున్నారు. ఈ ప్రాంతాల్లో జేబు దొంగల బెడద నుంచి కొనుగోలు దార్లను రక్షించేందుకు వీలుగా గోపురాలు, ఎత్తైన భవనాలపై సీసీటీవీ కెమెరాలను అమర్చి వాటిని కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రజలు, కొనుగోలుదార్లు అధికంగా గుమికూడే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించా లని నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జీవాల్‌ ఆదేశించారు. 


పటిష్ట భద్రత 

స్థానిక టి.నగర్‌తో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రత కోసం 6 వేల మంది పోలీసులను ఉపయోగించనున్నారు. దీపావళి పండగ సమయంలో నగరంలో 5 లేదా 6 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి 6వేలకు పైగా పోలీసులతో నగరంలో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దీపావళికి ముందు వచ్చే ఆదివారం, అంటే ఈనెల 31వ తేదీ నుంచి నగరంలో అదనపు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా అనేక ప్రధానమైన వాణిజ్య సముదాయ కేంద్రాలు వున్నప్పటికీ నగర వాసులు అధిక సంఖ్యలో టి.నగర్‌కు వస్తుంటారు. అందువల్ల ఈ ప్రాంతంపై మరింత దృష్టిని కేంద్రీకరించి, డ్రోన్ల సాయంతో గస్తీ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. 


40 ప్రాంతాల్లో టపాసుల విక్రయాలు

దీపావళి పండుగను పురస్కరించుకుని నగరంలో 40 ప్రాంతాల్లో టపాకాయల విక్రయాలను సహకార దుకాణాల్లో చేపట్టనున్నారు. ఈ దుకాణాల్లో అతి తక్కువ ధరకే వీటిని అందుబాటులో ఉంచనున్నారు. నగరంలోని తేనాంపేట అన్నాసాలై, రాజా అన్నామలైపురం, రాయపేట, బీసెంట్‌నగర్‌, అడయారు, గాంధీనగర్‌, తిరువళ్ళికేణి, పెరియార్‌ వీధి, మైలాపూర్‌, ఆర్‌కే మఠం, సైదాపేట, సాలిగ్రామం, ఆర్కాట్‌ శాలై, విల్లివాక్కం బాలియమ్మన్‌ ఆలయ వీధి, నుంగంబాక్కం, పెరంబూరు పెరియార్‌ నగర్‌ కార్తికేయన్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ సహకార టపాకాయల విక్రయాలను ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సహకార శాఖ ఆధ్వర్యంలో ఈ దుకాణాలను ఏర్పాటు చేసి, టపాకాయలను చౌక ధరకు విక్రయించనున్నారు. 


కిటకిటలాడిన వ్యాపార దుకాణాలు 

దీపావళి సరుకులను కొనుగోలు చేసేందుకు నగర వాసులు క్యూకట్టారు. దీంతో నగరంలోని ప్రధాన ప్రాతాల్లోని వ్యాపార దుకాణాలన్నీ ఆదివారం కిటకిటలాడాయి. టి.నగర్‌లోని రంగనాథన్‌ వీధి, ఉస్మాన్‌ రోడ్డు, పాండిబజార్‌, వాషర్‌మెన్‌పేటలోని ఎంసీ రోడ్డు, రాయపురంలోని జీఏ రోడ్డు, కల్‌మండపం ప్యారీస్‌, పురుషవాక్కం, పాడి, క్రోంపేట, వేళచ్చేరి ఫీనిక్స్‌ మాల్‌ వంటి ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఈ ప్రాంతాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా నిబంధనలు పాటించపకోవడంతో కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


దీపావళికి 2500 ప్రైవేటు బస్సులు

దీపావళి పండుగకు తమ సొంతూళ్లకు వెళ్ళే నగర వాసుల కోసం ప్రభుత్వ రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే, దక్షిణ రైల్వే కూడా స్పెషల్‌ రైళ్ళను నడిపేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్లు కూడా ఈ దీపావళి పండుగకు 2500 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. తమిళనాడు ప్రైవేట్‌ బస్సుల యజమానుల సంఘం నిర్వాహకుడు ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల 30వ తేదీ నుంచి ప్రతిరోజూ 2500 బస్సులను నడపేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అయితే, ఇప్పటివరకు బస్సుల్లో ప్రయాణించేందుకు నగరవాసులు ఊహించిన స్థాయిలో రిజర్వేషన్లు చేసుకోలేదన్నారు. ఈ పండగ సీజన్‌లో చెన్నై - మదురైల మధ్య సాధారణ బస్సులో టిక్కెట్‌ ధర రూ.1000గాను, బెర్త్‌ సౌకర్యం కలిగిన సీటు రూ.1200, ఏసీ బస్సులో రూ.1200, బెర్త్‌ రూ.1400 చొప్పున వసూలు చేయనున్నారు. అలాగే, చెన్నై - నెల్లైకు సాధారణ బస్సులో ప్రయాణ చార్జీ రూ.780 నుంచి రూ.900 వరకు, ఏసీ బస్సులో రూ.930 నుంచి రూ.1030 వరకు వసూలు చేస్తారు. చెన్నై - తూత్తుకుడికి సాధారణ బస్సులో రూ.1200 నుంచి రూ.1500 వరకు, ఏసీ బస్సులో రూ.1400 నుంచి రూ.1700 వరకు వసూలు చేయనున్నారు. 

Updated Date - 2021-10-25T16:55:21+05:30 IST