Abn logo
Nov 29 2020 @ 01:57AM

వ్యాక్సిన్‌ తయారీలో సహకారం

బయోటెక్నాలజీ కంపెనీలతో కలిసి పనిచేస్తాం

వ్యాక్సిన్‌ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలి

లేదంటే.. టీకా వేయించుకునేందుకు వెనుకడుగు వేయొచ్చు 

మూడు నగరాల్లో  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘వ్యాక్సిన్‌’ టూర్‌

భారత్‌ బయోటెక్‌, సీరం, జైడస్‌ క్యాడిలా ఉత్పత్తి ప్లాంట్ల సందర్శన 

కొవిడ్‌-19 వ్యాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తిపై సమీక్ష


హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న కొవ్యాక్సిన్‌ గురించి శాస్త్రవేత్తలు వివరించారు. సాధ్యమైనంత త్వరగా టీకాను అందించాలన్న ఉద్దేశంతో ఐసీఎంఆర్‌తో కలిసి భారత్‌ బయోటెక్‌ బృందం చాలా కృషి చేస్తోంది. ఇప్పటివరకు నిర్వహించిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇందుకుగాను శాస్త్రవేత్తల బృందాన్ని అభినందిస్తున్నా.

- ప్రధాని మోదీ


హైదరాబాద్‌/మేడ్చల్‌/అల్వాల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): వ్యాక్సిన్‌ తయారీలో బయోటెక్‌ సంస్థలతో కలిసి కేంద్రం పనిచేస్తుందని, వాటికి పూర్తి సహకారం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, పుణె నగరాల్లో సుడిగాలి పర్యటన చేశారు. కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్న ఆయా నగరాల్లోని మూడు కీలక బయోటెక్‌ సంస్థలను సందర్శించారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, దాని ఉత్పత్తితో ముడిపడిన అంశాలపై ఆయా కంపెనీల నిర్వాహకులు, ముఖ్య శాస్త్రవేత్తలతో చర్చించారు. వ్యాక్సిన్‌ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. లేదంటే అవగాహనా రాహిత్యంతో.. వ్యాక్సిన్‌ను వేయించుకునేందుకే ప్రజలు వెనుకడుగు వేసే ప్రమాదాలు ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. శనివారం మధ్యాహ్నం 1.14కు ఆహ్మదాబాద్‌ నుంచి వాయుసేన విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట్‌ విమానాశ్రయానికి మోదీ చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, ఎయిర్‌ఫోర్స్‌ అధికారి స్వాగతం పలికారు. ప్రధాని హకీంపేట్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా జినోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ సంస్థకు మధ్యాహ్నం 1.32 గంటలకు చేరుకున్నారు. కంపెనీ ప్రధాన ద్వారం నుంచి రోడ్డుపైకి రాగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కారులో నుంచి కిందికి దిగారు.


అక్కడున్న మీడియాతోపాటు ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మోదీ జిందాబాద్‌, మోదీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ప్రధాని అక్కడున్న వారందరికీ అభివాదం చేస్తూ బయలుదేరారు. పీపీఈ కిట్‌ను ధరించి భారత్‌ బయోటెక్‌లోని కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ల్యాబ్‌ను ప్రధాని సందర్శించారు. ఈసందర్భంగా కోవ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షల తాజా పరిస్థితిపై ముఖ్య శాస్త్రవేత్తలతో సమీక్షించారు. అనంతరం భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) కృష్ణ ఎల్లా, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.కృష్ణమోహన్‌, శాస్త్రవేత్తలు కోవ్యాక్సిన్‌పై ప్రధానికి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇక్కడ ప్రధాని దాదాపు గంటకు పైగా గడిపారు. మధ్యాహ్నం 2.38 గంటలకు జినోమ్‌ వ్యాలీ నుంచి తిరిగి హకీంపేట్‌ విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు ఐఏఎఫ్‌ విమానంలో నేరుగా మహారాష్ట్రలోని పుణెకు వెళ్లారు. 


మా కంపెనీకి ప్రత్యేక రోజు : పూనావాలా

పుణె కేంద్రంగా ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం సందర్శించారు. ఆయనకు ‘సీరం’ గ్రూప్‌ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా, సీఈవో అదర్‌ పూనావాలా స్వాగతం పలికారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను తీసుకురావాలని తమకు ప్రధాని సూచించారని సైరస్‌ పూనావాలా తెలిపారు. ఆయన సందర్శనను తమ కంపెనీకి ప్రత్యేక రోజుగా అభివర్ణించారు. అంతకుముందు శనివారం ఉదయం గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని జైడస్‌ క్యాడిలా కంపెనీ బయోటెక్‌ ప్లాంట్‌ సందర్శనతో ప్రధాని పర్యటన మొదలైంది. ఈ కంపెనీ అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘జై సీఓవీ-డీ’తో రెండోదశ ప్రయోగ పరీక్షలు ప్రస్తుతం తుదిదశకు చేరాయి. ఈ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది (2021) మార్చికల్లా అందుబాటులోకి వస్తుందని, ఏడాదికి 10 కోట్ల డోసుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైడస్‌ క్యాడిలా చైర్మన్‌ పంకజ్‌ పటేల్‌ తెలిపారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ సందర్శన అనంతరం ప్రధాని మోదీ తన హైదరాబాద్‌ పర్యటనపై ట్వీట్‌ చేశారు. శాస్త్రవేత్తలను అభినందించారు.


ఉత్తేజితులమయ్యాం

  • ప్రధాని మోదీ సందర్శన ప్రోత్సాహాన్నిచ్చింది
  • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్‌ తెస్తాం
  • బయో సేఫ్టీ లెవల్‌-3 ల్యాబ్‌లో టీకా ఉత్పత్తి
  • భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా


ప్రోత్సాహాన్నిచ్చింది: భారత్‌ బయోటెక్‌

కోవ్యాక్సిన్‌పై సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్లాంట్‌ను సందర్శించడం మరింత ప్రోత్సాహాన్నిచ్చిందని భారత్‌ బయోటెక్‌ సంస్థ తెలిపింది. ప్రధాని సందర్శన అనంతరం సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రధాని రాకతో తాము మరింత ఉత్తేజితులమయ్యామని తెలిపింది. ‘‘ప్రధాని అందించిన ప్రోత్సాహం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో భాగస్వాములు కావడానికి, ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి, శాస్త్రీయ అన్వేషణలు చేపట్టడానికి ఊతమిచ్చింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్‌ ప్రస్తుతం మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా ప్రయోగాలు చేస్తున్నాం. దేశంలోని 25 ప్రదేశాల్లో దాదాపు 26 వేల మంది స్వచ్ఛందంగా ఈ ప్రయోగాల్లో పాల్గొంటున్నారు. బయో సేఫ్టీ లెవల్‌-3 ల్యాబ్‌లో దీన్ని ఉత్పత్తి చేయనున్నాం. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంలో నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, నియంత్రణా విభాగం అధికారులు, వ్యాక్సిన్‌ అభివృద్ధి భాగస్వాములు, వైద్య శాఖ అధికారులు, వైద్య పరిశోధకులు, ఆస్పత్రులకు కృతజ్ఞతలు ’’ అని కంపెనీ పేర్కొంది. ఈ ప్రయోగాల్లో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వలంటీర్లు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. దీని ద్వారా వారంతా జాతికి సేవలందిస్తున్నారని కొనియాడింది. అందరికీ అత్యంత భద్రమైన, సమర్థమైన టీకాను అందించడంలో మున్ముందు కూడా కట్టుబడి ఉంటామని తెలిపింది. కాగా, హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడానికి సీఎం కేసీఆర్‌కు అనుమతి లభించలేదు. ప్రధానిని ఆహ్వానించేవారిలో సీఎం కేసీఆర్‌ పేరును కూడా రాష్ట్ర అధికారులు పంపించినట్లు తెలిసింది. కానీ ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతి లభించింది. 


రెండు వారాల్లో దరఖాస్తు: సీరం

దేశంలో ఆస్ర్టాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ లైసెన్స్‌ కోసం రెండు వారాల్లో దరఖాస్తు చేసే పనిలో ఉన్నట్టు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పునావాలా తెలిపారు. భారత్‌లో తొలుత వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతుందని, తర్వాత కంపెనీ ఆఫ్రికాలో ప్రధానంగా ఉన్న కోవాక్స్‌ దేశాలపై దృష్టి పెడుతుందని చెప్పారు. బ్రిటన్‌, యూరోపియన్‌ మార్కెట్లను ఆస్ర్టాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ చూసుకుంటాయని తెలిపారు. 


ఎన్నికల అనుభవంతో వ్యాక్సినేషన్‌ ప్రణాళిక 

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే.. దాని పంపిణీ, వ్యాక్సినేషన్‌ కోసం దేశంలోని వైద్య వ్యవస్థను సన్నద్ధం చేసే చర్యలు ఊపందుకున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె.విజయ్‌రాఘవన్‌ తెలిపారు. ఇందుకోసం కేంద్ర ఆరోగ్యశాఖ సహకారంతో ఓ నిపుణుల బృందం ముమ్మర కసరత్తు చేస్తోందన్నారు. ఎన్నికల నిర్వహణ, సార్వత్రిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల్లో దేశానికి ఉన్న అపార అనుభవమే ప్రాతిపదికగా.. వ్యాక్సినేషన్‌కు నిపుణులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.


గుజరాత్‌లో వ్యాక్సిన్‌ ట్రాన్స్‌పొర్టేషన్‌ ప్లాంట్‌ ఎన్నికల అనుభవంతో వ్యాక్సినేషన్‌ ప్రణాళిక 

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే.. దాని పంపిణీ, వ్యాక్సినేషన్‌ కోసం దేశంలోని వైద్య వ్యవస్థను సన్నద్ధం చేసే చర్యలు ఊపందుకున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె.విజయ్‌రాఘవన్‌ తెలిపారు. ఇందుకోసం కేంద్ర ఆరోగ్యశాఖ సహకారంతో ఓ నిపుణుల బృందం ముమ్మర కసరత్తు చేస్తోందన్నారు. ఎన్నికల నిర్వహణ, సార్వత్రిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల్లో దేశానికి ఉన్న అపార అనుభవమే ప్రాతిపదికగా.. వ్యాక్సినేషన్‌కు నిపుణులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement