భూ సేకరణకు సహకరించండి

ABN , First Publish Date - 2021-11-28T04:59:39+05:30 IST

మండలంలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి కాలువ నిర్మాణానికి భూ సేకరణపై అధికారులు సమావేశ మయ్యారు.

భూ సేకరణకు సహకరించండి
తహసీల్దార్‌ రమాదేవితో సమావేశమైన నీటి పారుదలశాఖ డీఈ సుశీల

పోలవరం కాలువ నిర్మాణానికి 832.05 ఎకరాలు అవసరం

తహసీల్దార్‌ను కోరిన నీటి పారుదల శాఖ డీఈ


సబ్బవరం, నవంబరు 27 : మండలంలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి కాలువ నిర్మాణానికి భూ సేకరణపై అధికారులు సమావేశ మయ్యారు. రైతుల నుంచి భూమి సేకరించేందుకు స్థానిక అధికారులు సహకరించాలని తహసీల్దార్‌ రమాదేవిని నీటిపారుదల శాఖ డిప్యూటి ఇంజనీర్‌ ఎ.సుశీల కోరారు. ఈ మేరకు శనివారం ఆమె తన సిబ్బందితో తహసీల్దార్‌ను కలిసి కాలువ నిర్మాణంపై చర్చించారు. కాలువ నిర్మాణానికి సంబంధించి సర్వేలో స్థానిక వీఆర్వోలు, విలేజీ సర్వేయర్లు, రైతులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ మండలంలో నల్లరేగులపాలెం నుంచి ఎల్లుప్పి వరకు 15.5 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం జరగనున్నదన్నారు. దీనికి సబ్బవరంలోని తొమ్మిది గ్రామాల్లో భూసేకరణ చేపట్టాలన్నారు. నల్లరేగులపాలెంలో 167.81 ఎకరాలు, ఆరిపాకలో 212.49, బంగారమ్మపాలెం 27.30, ఎ.సిరసపల్లి 4.28, రాయపురఅగ్రహారం 78.15, వంగలి 87.95, అంతకాపల్లి 76.21, అయ్యన్నపాలెం 11.06, ఎల్లుప్పిలో 166.80 ఎకరాలు.. మొత్తం 832.05 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సి ఉందన్నారు. కాలువ 37 మీటర్ల వెడల్పుతో నిర్మాణం జరుగుతుందన్నారు. సుమారు 700 అడుగుల వెడల్పున భూమిని సేకరించాల్సి ఉందన్నారు. విశాఖ జిల్లాలో 32 కిలోమీటర్ల కాలువ నిర్మాణం జరగనున్నదని చెప్పారు. తాళ్లపాలెం పెదపూడి రిజర్వాయర్‌ నుంచి విజయనగరం గడిగడ రిజర్వాయరుకు 102 కిలోమీటర్లు మేర కాలువ నిర్మాణం జరగనున్నదన్నారు. పోలవరం లెఫ్ట్‌ కెనాల్‌ నుంచి వరద నీటిని తరలించడం ద్వారా బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నుంచి ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సబ్బవరం మండలంలో 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రానున్న మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని డీఈ తెలిపారు. కాగా అన్ని విధాలుగా సహకరిస్తామని ఆమెకు తహసీల్దార్‌ రమాదేవి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు ఎస్‌టీ రామకాసు, డీటీలు బి.శ్రీనివాసరావు, ఎల్‌బీ నాగలక్ష్మి, సర్వేయర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T04:59:39+05:30 IST