షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణంతో అభివృద్ధికి దోహదం

ABN , First Publish Date - 2022-07-01T06:28:06+05:30 IST

మార్కా పురం మున్సిపాలిటీ ఆదాయం పెరిగేలా వివిధ మున్సిపల్‌ స్థలాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడతున్నట్లు ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి తెలిపారు.

షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణంతో అభివృద్ధికి దోహదం
మాట్లాడుతున్న నాగార్జునరెడ్డి

మార్కాపురం(వన్‌టౌన్‌), జూన్‌ 30: మార్కా పురం మున్సిపాలిటీ ఆదాయం పెరిగేలా వివిధ మున్సిపల్‌ స్థలాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ల  నిర్మాణం చేపడతున్నట్లు ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి తెలిపారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. 14 అంశాలను కౌన్సిల్‌ ఆమోదించింది. అనంతరం కౌన్సిల్‌ అత్యవసర టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో రూ.22 కోట్లతో సాగర్‌ జలాల పనులు చేపడతామన్నారు. కూరగాయల మార్కెట్‌ స్థానంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ పూలసుబ్బయ్య కాలనీలో 20 షాపులు, మాగుంట సుబ్బరామిరెడ్డి పార్క్‌ వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ రహదారి 565 పక్కనే ఉన్న మున్సిపల్‌ స్థలం 2.88 ఎకరాలలో హోల్‌సెల్‌ షాపుల గోడౌన్లు, ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల కోసం గోడౌన్లు నిర్మించనున్నామన్నారు. పాతబస్టాండ్‌లో పూలు, పండ్ల దుకాణాల కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణంలో 1, 2 లైన్ల వన్‌వే ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయనని తగిన విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను చైర్మన్‌ కోరారు. టీడీపీ కౌన్సిలర్‌ ఏరువ వెంకటనారాయణరెడ్డి మాట్లాడుతూ, 2018 గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో టిడ్కో పథకం కింద డబుల్‌ బెడ్‌రూంల కోసం 240 మంది రూ.25 వేలు, 3700 మంది రూ.500 ప్రకారం కట్టారని వారికి ఇళ్లు కట్టిస్తారా లేదంటే డబ్బులు వెనక్కి ఇస్తారా అని ప్రశ్నించారు. పట్టణంలో కోతులు, కుక్కలు, పందుల బెడద తొలగించాలన్నారు. సమావేశంలో  కౌన్సిలర్లు బుశ్శెట్టి నాగేశ్వరరావు, వి.రమ్యస్వాతి, వైస్‌ చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌ కమిషనర్‌ నయీం అహ్మద్‌, డీఈ షేక్‌ సుభానీ, ఏఈ ఆదినారాయణ  పాల్గొన్నారు.

సాదాసీదాగా సమావేశం 

గిద్దలూరు టౌన్‌ : మున్సిపల్‌  సర్వసభ్య సమావేశం గురువారం జరగ్గా, సమావేశం సాదాసీదాగా జరిగింది. 21 అంశాలతో సమావేశంలో తీర్మాణాలు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు సమస్యలను పరిష్కరించాలని టీడీపీ సభ్యులు సమావేశంలో ఏకరువు పెట్టారు.

 టీడీపీ కౌన్సిల్‌ సభ్యులు చంద్రశేఖర్‌యాదవ్‌, బిల్లా జయలక్ష్మి సమావేశంలో లేవనెత్తారు. తమ వార్డులలో ప్రజాసమస్యలను పరిష్కారం కావడం లేదని, తమ వార్డులు ఉన్నాయా..? లేవా..? అని అర్ధంకావడం లేదని వారు పేర్కొన్నారు. సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ముందుగా రూ.30లక్షలు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం అనుమతులు కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టగా టీడీపీ సభ్యులు నిలదీశారు. వాటర్‌ ట్యాంకర్ల సరఫరాలో అవినీతి రాజ్యమేలుతున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్లు ఆర్‌.డి.రామక్రిష్ణ, కాతా దీపిక, కమిషనర్‌ రామక్రిష్ణయ్య, ఇతర శాఖల పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:28:06+05:30 IST