వద్దే వద్దు..!

ABN , First Publish Date - 2022-06-19T05:37:28+05:30 IST

తుంగభద్ర ఎగువ కాలువ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు చెల్లించడానికి నిధులు లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.

వద్దే వద్దు..!
బొమ్మనహాళ్‌ మండలం హెచఎల్‌ఎంసీ 115వ కిలోమీటరు మలికేటిపురం వద్ద తెగిన బ్రిడ్జి

హెచ్చెల్సీ పనులపై కాంట్రాక్టర్ల అనాసక్తి

నిధులు ఉన్నప్పుడు బిల్లులు ఇస్తామన్నందుకే..!

రూ.16 కోట్ల పనులకు ఆనలైన టెండర్లు

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 18: తుంగభద్ర ఎగువ కాలువ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు చెల్లించడానికి నిధులు లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. హెచ్చెల్సీ పరిధిలోని హెచఎల్‌ఎంసీ కింద రూ.16 కోట్ల పనులకు అత్యవసరంగా ఆనలైన టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో హెచ్చెల్సీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. జూలై 15న టీబీ డ్యాం నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తారు. ఆ లోగా పనులు పూర్తి చేసి, కాలవను సిద్ధంగా ఉంచాలని హెచ్చెల్సీ అధికారులు అత్యవసరంగా టెండర్లు పిలిచారు. బిల్లులు కోసం ఒత్తిడి చేయకూడదని, నిధులు ఉన్నప్పుడు వడ్డీ లేకుండా చెల్లిస్తామని అందులో నిబంధన పొందుపరిచారు. దీన్ని చూసి కంగుతిన్న కాంట్రాక్టర్లు, పనులు వద్దు.. ఆ ఇబ్బందులు వద్దు అని తేలిపోయారు. గత ప్రభుత్వ హయాంలో హెచ్చెల్సీలో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. 


మూడు పనులకు..

హెచఎల్‌ఎంసీ కింద లోకలైజేషన పరిధిలోని మూడు పనులకు హెచ్చెల్సీ అధికారులు ఆనలైన టెండర్లు ఆహ్వానించారు. హెచఎల్‌ఎంసీపై బొమ్మనహాళ్‌ మండలం మలికేటిపురం 115వ కి.మీ. వద్ద బ్రిడ్జి కూలిపోయింది. ఈ పనులకు రూ.1.7 కోట్ల అంచనాతో టెండర్‌ ఆహ్వానించారు. కణేకల్‌ మండలం మీదపల్లి-గరుడచేడు 165వ కి.మీ. వద్ద ఉన్న ఓ బ్రిడ్జి కుంగిపోయింది. ఈ పనులకు రూ.1.3 కోట్ల అంచనాతో టెండర్లు ఆహ్వానించారు. హెచఎల్‌ఎంసీ కింద మరమ్మతులకు రూ.13 కోట్ల అంచనాతో అత్యవసర టెండర్లు పిలిచారు. జూలై 15లోపు పనులు పూర్తి చేయాలని టెండర్లు ఆహ్వానించినా, కాంట్రాక్టర్లు ఎవరూ నామినేషన్లు వేయలేదు. 


నిజమే.. స్పందించలేదు..

జూలై 15వ తేదీన టీబీ డ్యాం నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. గత వర్షాకాలంలో తెగిపోయిన బ్రిడ్జిలను నిర్మించేందుకు, వివిధ మరమ్మతు పనులకు టెండర్లు పిలిచాం. హెచఎల్‌ఎంసీ పరిధిలో 3 పనులకు రూ.16 కోట్ల అంచనాతో అత్యవసరం కింద ఆనలైన టెండర్లు వేశాం. నిధులు ఉన్నప్పుడు వడ్డీ లేకుండా బిల్లులు చెల్లిస్తామని టెండర్లలో స్పష్టంగా పొందుపరిచాం. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటాం.

- రాజశేఖర్‌, హెచ్చెల్సీ ఎస్‌ఈ


Updated Date - 2022-06-19T05:37:28+05:30 IST