ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కాంగ్రెస్‌ నేతలు

ABN , First Publish Date - 2022-04-15T17:56:56+05:30 IST

రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య వివాదం మంత్రి ఈశ్వరప్ప పదవిని కోల్పోయేలా చేసింది. బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌

ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కాంగ్రెస్‌ నేతలు

               - రాజీనామాతో సద్దుమణిగేనా..?


బెంగళూరు: రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య వివాదం మంత్రి ఈశ్వరప్ప పదవిని కోల్పోయేలా చేసింది. బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ మంగళవారం ఉడుపిలోని ఓ లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు తాను చేపట్టిన పనులకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమీషన్‌ కోరుతున్నారని ఆరోపిస్తూ సోషల్‌మీడియాలో పోస్టు చేసి... ఒత్తిడి భరించలేకపోతున్నానని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ మంత్రి రాజీనామాకు డిమాండ్‌ చేసింది. మూడు రోజులుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ ఇదే అంశంపై వాగ్వాదాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత బెళగావికి వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. గురువారం సీఎం నివాసం ముట్టడి, ఆ తర్వాత 24 గంటలపాటు విధానసౌధలో నిరంతర నిరసనకు సిద్ధమయ్యారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి పెంచిన నేపథ్యంలో బీజేపీ నేతలు మంత్రి ఈశ్వరప్పకు మద్దతుగా నిలిచినా కాంగ్రెస్‌ పోరాటాలకు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులుగా కాంట్రాక్టర్‌ ఆత్మహత్య విషయంలో రాజీనామా చేసేది లేదంటూ భీష్మించుకున్న మంత్రి ఈశ్వరప్ప గురువారం రాత్రి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సంతోష్ పాటిల్‌ ఆత్మహత్యతో సంబంధం లేకున్నా పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదనే కారణంతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు శివమొగ్గలో బహిరంగ ప్రకటన చేశారు. శుక్రవారం బెంగళూరుకు చేరుకుని ముఖ్యమంత్రిని కలసి రాజీనామా లేఖను సమర్పిస్తానన్నారు. కాగా మంత్రి ఈశ్వరప్పను కుట్ర పన్ని రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తున్నారని తోటి మంత్రులు ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలకు మరో పనిలేదని ప్రతి అంశాన్ని వివాదం చేస్తున్నారని మంత్రి ఉమేశ్‌కత్తి మండిపడ్డారు. రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మంత్రి గోపాలయ్య సహా పలువురు అభిప్రాయపడ్డారు. కాం ట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్యకర్త అ ని రాహుల్‌గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేశారనే కారణంతో పార్టీ నుంచి తొలగించారనే అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సహా బెళగావి జిల్లా ఎమ్మెల్యే కుట్ర ఉందని బీజేపీ ట్వీట్‌ ద్వారా ఆరోపించింది. 


మంత్రి రాజీనామాతో కథ ముగిసేనా..? 

కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్యతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈశ్వరప్ప రాజీనామాకు సిద్ధమయ్యారు. మూడు రోజులుగా ఇదే అంశమై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర, జాతీయ నేతలు పోరాటాలు సాగిస్తున్నారు. మంత్రి ఈశ్వరప్పను అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. రెండు రోజులుగా నిరంతరంగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ, మంత్రి రాజీనామా తర్వాత ఎటువంటి అడుగులు వేయనుందనేది కీలకం అవుతోంది. తొలుత రాజీనామాను డిమాండ్‌ చేసిన పార్టీ నేతలు ఆ తర్వాత అరెస్టు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతానికి రాజీనామా ఖరారు కావడంతో కాంగ్రెస్‌ నిరసనలు విరమించుకుంటుందా..? లేదా అరెస్టు పేరిట కొనసాగిస్తుందా..? అనేది వేచి చూడాలి. 

Updated Date - 2022-04-15T17:56:56+05:30 IST