రూ.2 కోట్ల బిల్లులు ఇవ్వకుండా వేధింపులు.. కాంట్రాక్టర్‌ కుటుంబం ఆత్మహత్యాయత్నం..

ABN , First Publish Date - 2022-05-26T20:28:17+05:30 IST

రూ.2 కోట్ల బిల్లులు ఇవ్వకుండా వేధింపులు.. కాంట్రాక్టర్‌ కుటుంబం ఆత్మహత్యాయత్నం..

రూ.2 కోట్ల బిల్లులు ఇవ్వకుండా వేధింపులు.. కాంట్రాక్టర్‌ కుటుంబం ఆత్మహత్యాయత్నం..

  • సెల్ఫీ వీడియో తీసి.. నిద్రమాత్రలు మింగి.. 
  • పిల్లలకు తక్కువ మోతాదులో.. 

హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌ : పనులు చేసినా డబ్బులు చెల్లించకుండా బడా కాంట్రాక్టర్‌ వేధింపులకు గురిచేస్తుండడంతో ఓ సబ్‌ కాంట్రాక్టర్‌ భార్య, ఇద్దరు కుమారులతో కలిసి లాడ్జిలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగింది. వెంటనే వాంతులు చేసుకోవడంతో చిన్నారులిద్దరు క్షేమంగా బయటపడగా, దంపతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించి  సరూర్‌నగర్‌ పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా ఖానాపూర్‌, ప్రశాంత్‌నగర్‌ కాలనీకి చెందిన శశికుమార్‌ రఘ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పేరిట ఎలక్ర్టికల్‌ సబ్‌ కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. 2019, ఫిబ్రవరిలో జి.వి.ప్రతా‌ప్‌రెడ్డి ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ(క్లాస్‌వన్‌ కాంట్రాక్టర్‌) నుంచి విద్యుత్‌ పనులు శశికుమార్‌ సబ్‌కాంట్రాక్టు కింద తీసుకున్నాడు. సుమారు రెండున్నర కోట్ల విలువైన పనులు చేశాడు. ఇందుకు సంబంధించి రెండేళ్లుగా రూ.2కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుత్‌ శాఖ నుంచి జి.వి.ప్రతాప్‌రెడ్డి కంపెనీకి బిల్లులు మంజూరైనా, సబ్‌కాంట్రాక్ట్‌ పనులు చేసిన శశికుమార్‌కు మాత్రం డబ్బులు చెల్లించకుండా రెండేళ్లుగా తిప్పుతున్నారు.


సెల్ఫీ వీడియో..

పనులు చేసినా డబ్బులు రాకపోవడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమవడంతో శశికుమార్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. డబ్బుల కోసం శుక్రవారం శశికుమార్‌ నగరానికి వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని గణేష్‌ లాడ్జిలో బస చేశాడు. పంజాగుట్టలోని జి.వి.ప్రతాప్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లి డబ్బుల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మూడు రోజులైనా భర్త రాకపోవడంతో ఆదివారం శశికుమార్‌ భార్య శ్వేత, కుమారులు రఘరాం, వరుణ్‌లను తీసుకుని దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చింది. బుధవారం ఉదయం శశికుమార్‌ జి.వి.ప్రతాప్‌రెడ్డి ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్‌ దినే‌ష్‌రెడ్డికి ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాలని కోరగా, అతను దూషించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన శశికుమార్‌ భార్య, పిల్లలిద్దరికి నిద్రమాత్రలు ఇచ్చి, తాను నిద్రమాత్రలు మింగారు. అయితే పిల్లలిద్దరికి రెండు మాత్రలు ఇచ్చి, శశికుమార్‌, శ్వేత దంపతులు సుమారు 45 మాత్రలు మింగారు. అంతకు ముందు డబ్బులు ఇవ్వకుండా దినే‌ష్‌రెడ్డి  వేధింపులకు గురిచేయడంతో పాటు,  దొంగతనం నేరం కూడా మోపాడని సెల్ఫీ వీడియో తీశారు.


తన కుటుంబం ఆత్మహత్యకు దినేష్‌రెడ్డి వేధింపులే కారణమంటూ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం తన బావమర్ది సురే‌ష్‌కు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఆందోళనకు గురైన సురేష్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి పోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. సరూర్‌నగర్‌ పోలీసులు గణేష్‌ లాడ్జికి వెళ్లి పరిశీలించగా, అప్పటికే దంపతులు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్వేత పరిస్థితి నిలకడగా ఉండగా, శశికుమార్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు సరూర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే తనకు జి.వి.ప్రతాప్‌రెడ్డి కంపెనీ నుంచి రూ.1.99కోట్లు రావాలని, తాను రుణదాతలకు రూ.1.18కోట్లు చెల్లించాలనే  వివరాలతో శశికుమార్‌ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


మాకూ టాబ్లెట్‌లు ఇచ్చారు: రఘరాం, కుమారుడు

మా నాన్నను కాంట్రాక్టర్‌ తిట్టి, డబ్బులు ఇవ్వనని చెప్పడంతో బాధపడుతున్నాడు. ఉదయం మాకు కూడా రెండు నిద్రమాత్రలు ఇచ్చారు. మాకు వాంతులు కావడంతో ఏమీ కాలేదు.

Updated Date - 2022-05-26T20:28:17+05:30 IST