గుండెపోటుతో కాంట్రాక్టు ఉపాధ్యాయుడి మృతి

ABN , First Publish Date - 2021-03-02T08:36:22+05:30 IST

లాక్‌డౌన్‌తో ఉపాధి కరువై, అప్పుల పాలైన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

గుండెపోటుతో కాంట్రాక్టు  ఉపాధ్యాయుడి మృతి

  • లాక్‌డౌన్‌ ఉపాధి లేక అప్పుల పాలు
  • పెట్టుబడి పెట్టిన ప్రైవేటు స్కూలులోనూ నష్టం

సూర్యాపేట, మార్చి 1: లాక్‌డౌన్‌తో ఉపాధి కరువై, అప్పుల పాలైన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని సీతారాంపురం కాలనీకి చెందిన జానపాటి సైదులు(45) పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని అనాజీపురం మోడల్‌ స్కూల్‌లో కాంట్రాక్టు పద్ధతిలో కొంతకాలం తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయన భార్య సరిత టీచర్‌గా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు బంద్‌ కావడంతో ఇద్దరికీ ఉపాధి కరువైంది. సైదులు వాటాలు పెట్టిన ప్రైవేటు పాఠశాలలోనూ నష్టాలు వాటిల్లాయి. కుటుంబం గడవకపోవడంతో సైదులు కూలిపనులకు వెళ్లాడు. అయినా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో అవసరాల కోసం అప్పులు కూడా చేశారు. సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో తిరిగి తనకు కొలువు దక్కుతుందా లేదా అన్న ఆందోళనలో సైదులు ఉండేవారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఛాతి నొప్పి రావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా సైదులు మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2021-03-02T08:36:22+05:30 IST