తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-15T08:23:47+05:30 IST

తిరుమల కొండపై ఆదివారం ఎటుచూసినా భక్తులే కనిపించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఆస్థాన మండపం వద్ద సర్వదర్శనం క్యూలైన్‌

తిరుమల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల కొండపై ఆదివారం ఎటుచూసినా భక్తులే కనిపించారు. శనివారం తరహాలోనే రద్దీ కొనసాగుతోంది. ఔటర్‌ రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్‌ భవనం వరకు సర్వదర్శనం క్యూలైన్‌ వ్యాపించింది. దీంతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనంతోపాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, తాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. జేఈవో వీరబ్రహ్మం.. నారాయణగిరి, రింగ్‌రోడ్డు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్ల వద్ద భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఆదివారం మధ్యాహ్నం సమయానికి 50వేల మందికిపైగా అన్నప్రసాదాలు అందించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 1.30 లక్షల ప్లేట్ల ఉప్మా, పొంగల్‌ పంపిణీ చేశారు. క్యూలైన్లలో ఎలాంటి తొక్కిసలాటలు, తోపులాటలు జరగకుండా టీటీడీ విజిలెన్స్‌, పోలీసు సిబ్బంది పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి దాదాపు 60వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 



Updated Date - 2022-08-15T08:23:47+05:30 IST