ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు

ABN , First Publish Date - 2022-10-05T08:34:13+05:30 IST

ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు

ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు

అది కేవలం చట్టబద్ధ హక్కు మాత్రమే: హైకోర్టు   

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): నామినేషన్‌ తిరస్కరణ కారణంగా ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకి రాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది చట్టబద్ధమైన హక్కు మాత్రమేనని, దానిని ప్రాథమిక హక్కుగా పరిగణించలేమని పేర్కొంది. నామినేషన్‌ తిరస్కరణ వ్యవహారంలో నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. పిటిషన్‌ను ఆరు నెలల్లో పరిష్కరించాలని జిల్లా కోర్టును ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. ఏపీ సెక్రెటేరియట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల ఎన్నికల్లో తన నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ సెక్షన్‌ ఆఫీసర్‌ సి. వాసుదేవరావు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది తాతా సింగయ్యగౌడ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఓటరు జాబితాలోని సీరియల్‌ నెంబరుతో పిటిషనర్‌ పేరు సరిపోలలేదంటూ నామినేషన్‌ తిరస్కరించారు. నామినేషన్‌ తిరస్కరించడం ద్వారా ఎన్నికల్లో పోటీ చేయకుండా పిటిషనర్‌ ప్రాథమిక హక్కులను హరించారు’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది వి. మహేశ్వర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నామినేషన్‌ తిరస్కరణను జిల్లా కోర్టు లో సవాల్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. అసోసియేషన్‌ తరఫున న్యాయవాది బి. అప్పారావు వాదనలు వినిపిస్తూ.. ఓసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ తన నామినేషన్‌ తిరస్కరణని జిల్లా కోర్టులో సవాల్‌ చేసుకోవాలన్నారు.  

Updated Date - 2022-10-05T08:34:13+05:30 IST