ధిక్కారమా..?

ABN , First Publish Date - 2022-07-03T06:42:09+05:30 IST

రెవెన్యూ బదిలీల రగడ ముదిరినట్లు కనిపిస్తోంది. తాము సిఫార్సు చేసిన వారిని కాకుండా వేరేవారికి పోస్టింగ్‌ ఇవ్వడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

ధిక్కారమా..?

రెవెన్యూ బదిలీలపై ఎమ్మెల్యేల అసంతృప్తి

సిఫార్సులను బేఖాతరు చేయడమే కారణం

తహసీల్దార్ల జాబితా మార్చాలని డిమాండ్‌

కలెక్టర్‌ను కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

ఉన్నతాధికారులకు మరికొందరు ఎమ్మెల్యేల ఫోన


అనంతపురం టౌన -

రెవెన్యూ బదిలీల రగడ ముదిరినట్లు కనిపిస్తోంది. తాము సిఫార్సు చేసిన వారిని కాకుండా వేరేవారికి పోస్టింగ్‌ ఇవ్వడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐల ఎంపిక వ్యవహారం జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వివాదాన్ని రాజేసిందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. తహసీల్దార్ల బదిలీ ఉత్తర్వులు గురువారం అర్ధరాత్రి విడుదల చేశారు. ఇందులో తాము చెప్పినవారు కాకుండా ఇతరులు ఉన్నారని కొందరు ఎమ్మెల్యేలు అధికారులపై మండిపడుతున్నారని సమాచారం. 23 మంది తహసీల్దార్లు బదిలీ అయితే, రెండు రోజుల్లో ఐదారుగురు మాత్రమే బదిలీ స్థానాల్లో చేరారు. ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్న కారణంగా మిగిలిన వారు వేచి చూస్తున్నారు. 

- అనంతపురం టౌన


రంగంలోకి ఎమ్మెల్యేలు

జిల్లా అధికారులు సిఫార్సులకు ప్రాధాన్యం ఇస్తూనే.. మరికొందరి విషయంలో సీనియారిటీ, పనితీరు, నిబంధనలను పరిగణనలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఈ కారణంగా కొన్ని మండలాలకు ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చినా పాటించలేదని సమాచారం. ఇదే వివాదానికి దారితీసిందని ప్రచారం జరుగుతోంది. కోరిన స్థానాలకు తాము చెప్పిన వారిని వేయకుండా మరొకరిని ఎలా వేస్తారని కొందరు ఎమ్మెల్యేలు అధికారులను ప్రశ్నిస్తున్నారని తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయంలో నేరుగా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి శనివారం కలెక్టరేట్‌కు వచ్చి, కలెక్టర్‌ ఇతర అధికారులను కలిశారని సమాచారం. బదిలీలపై అసంతృప్తి వ్యక్తం చేశారని, కొందరిని మార్చాలని చెప్పివెళ్లారని తెలిసింది. మంత్రితో పాటు రాప్తాడు, రాయదుర్గం ఎమ్మెల్యేలు సైతం జిల్లా ఉన్నతాధికారులకు ఫోన చేసి నియామకాలు విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. జాబితాలో కొందరిని మార్చాలని, తాము చెప్పిన వారిని నియమించాలని కోరినట్లు రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. 


డీటీల జాబితా మార్పు

జిల్లాలో 57 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేశారు. వీరి విషయంలో కూడా ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాము సూచించిన పేర్లను పరిగణనలోకి తీసుకోలేదని ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శుక్రవారం ఇచ్చిన డీటీల బదిలీ ఆర్డర్లో దాదాపు 13 పేర్లను మారుస్తూ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. తహసీల్దార్ల జాబితాలో మార్పులు చేస్తారా, అలాగే కొనసాగిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. బదిలీ అయిన వారిని వెంటనే విధుల్లో చేర్చుకోవాలని, వారి సమాచారం పంపాలని ఆర్డీవోలకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరింత టెన్షన నెలకొంది.


నిబంధనలు గాలికి..

ఆర్‌ఐల బదిలీల్లో ఉన్నతాధికారులు నిబంధనలను గాలికి వదిలేశారు. ఒకే చోట మూడేళ్లు సేవలు అందించినవారు దరఖాస్తు చేసుకున్నా, బదిలీ చేయలేదు. కొన్ని నెలలు మాత్రమే పనిచేసిన వారిని మాత్రం మరోచోటుకు పంపించారు. తాడిపత్రి నుంచి ఓ ఆర్‌ఐ నాలుగు నెలల క్రితం పామిడికి వచ్చారు. ఇప్పుడు బదిలీల్లో ఆయనను గుంతకల్లుకు నియమించారు. ఓ మహిళ 9 నెలల క్రితం ఆర్‌ఐగా ఉద్యోగోన్నతి పొందారు. ఆమెను నార్పలకు బదిలీ చేశారు. ఇలా ఏడాదిలోపు సర్వీస్‌ ఉన్నా బదిలీ చేసి, మూడేళ్లు పైబడి ఒకేచోట పనిచేసిన వారిని విస్మరించడం విమర్శలకు తావిస్తోంది.


గుంతకల్లుకు డీటీనే..

తహసీల్దార్ల బదిలీలో కొన్నిచోట్ల ఉన్నతాధికారుల తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. నిబంధనలు, సీనియారిటీ కన్నా అధికార పార్టీ నాయకుల ఆదేశాలే ముఖ్యమన్నట్లు వ్యవహరించారు. ఇందుకు ఉదాహరణ.. ఖాళీగా ఉన్న గుంతకల్లు తహసీల్దారు పోస్టు. ఇక్కడ ఏడాదికి పైగా తహసీల్దార్‌ లేరు. డిప్యూటీ తహసీల్దార్‌ రాము ఇనచార్జిగా కొనసాగుతున్నారు. తాజా బదిలీల్లో అక్కడికి వెళ్లడానికి పలువురు తహసీల్దార్లు ఆసక్తి చూపారు. కానీ ఏ ఒక్కరినీ నియమించలేదు. దీంతో డీటీనే తహసీల్దారుగా కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


Updated Date - 2022-07-03T06:42:09+05:30 IST