పాలసీ బాండ్‌ పేపర్లు ఇవ్వకపోతే.. ఇకపై ఇలా ఉంటుంది..!

ABN , First Publish Date - 2022-05-24T20:34:48+05:30 IST

పాలసీ గడువు ముగిసినా, బాండ్‌ పేపర్లు ఇవ్వడంలో జాప్యం చేసిన ఇన్సూరెన్స్‌ సంస్థ..

పాలసీ బాండ్‌ పేపర్లు ఇవ్వకపోతే.. ఇకపై ఇలా ఉంటుంది..!

  • రూ.15 వేలు పరిహారం చెల్లించాలని ఫోరం తీర్పు


హైదరాబాద్‌ సిటీ : పాలసీ గడువు ముగిసినా, బాండ్‌ పేపర్లు ఇవ్వడంలో జాప్యం చేసిన ఇన్సూరెన్స్‌ సంస్థ తీరును జిల్లా వినియోగదారుల ఫోరం (Consumer Forum) తప్పుబట్టింది. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన పి. వెంకటకూనమణి(65) ఆగస్టు 1994లో ఎల్‌ఐసీ బీమా కిరణ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నారు. నెలకు రూ.757 చొప్పున 25 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించింది. పాలసీ 2019 ఆగస్టు నాటికి ముగిసింది. దాంతో ఆమె పాలసీ ధ్రువపత్రాలను సదరు కార్యాలయానికి స్పీడ్‌ పోస్ట్‌ద్వారా పంపింది. పాలసీ మొత్తం డబ్బు ఆమె ఖాతాలో జమ అయ్యాయి. పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా 10 ఏళ్లపాటు బీమా సౌకర్యం ఉంటుంది. దానికి సంబంధించి పాలసీ ధ్రువపత్రాలను చూపాల్సి ఉంటుంది.


కానీ సంస్థకు ఇచ్చిన పాలసీ ధ్రువ పత్రాలు తనకు అందకపోవడంతో పలుమార్లు లేఖలు రాసింది. . సమాధానం రాకపోవడంతో ఆమె వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. తమవద్దకు పాలసీ ధ్రువ పత్రాలు స్పీడ్‌ పోస్ట్‌లో వచ్చాయని, పరిశీలించిన అనంతరం కవర్‌పై ఉన్న అడ్ర్‌సకు తిరిగి పంపామని, అందులో ప్రస్తుత అడ్రస్‌ కాకుండా పాత అడ్రస్‌ ఉండటంతో ఆమెకు పాలసీ ధ్రువపత్రాలు అందలేదని, అందులో సేవాలోపం లేదని ఎల్‌ఐసీ ప్రతినిధులు  తమ వాదన వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఫోరం పాలసీ దారును మనోవేదనకు గురిచేసినందుకు రూ.15వేలు పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు 45 రోజులలో చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం 1 ప్రెసిడెంట్‌ జస్టిస్‌ బి. ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు జస్టిస్‌ సీ లక్ష్మీప్రసన్నలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

Updated Date - 2022-05-24T20:34:48+05:30 IST