దుబాయ్‌లో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు.. చివరికి..

ABN , First Publish Date - 2022-03-06T14:01:48+05:30 IST

కన్సల్టెన్సీ ముసుగులో నిరుద్యోగులను ముంచేసిన ఓ సంస్థ సూత్రధారిని అబిడ్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

దుబాయ్‌లో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు.. చివరికి..

కన్సల్టెన్సీ ముసుగులో మోసం!

సూత్రధారి అరెస్టు.. బాధితులు 40కి పైనే!

మంగళ్‌హాట్‌/హైదరాబాద్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): కన్సల్టెన్సీ ముసుగులో నిరుద్యోగులను ముంచేసిన ఓ సంస్థ సూత్రధారిని అబిడ్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ వాహబ్‌ జాకి(27), మహ్మద్‌ అబ్దుల్‌ ముకీత్‌(40) టాలెంట్‌ కెరియర్‌ గ్రూప్‌ కన్సల్టెన్సీ పేరుతో దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 15 మంది నిరుద్యోగుల నుంచి రూ.70వేల చొప్పున వసూలు చేశారు. ముంబైలోని న్యూస్టార్‌ మల్టిపుల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ యజమానులు సాజిద్‌ ఖాన్‌, ఇస్లాం ఉద్దీన్‌ అన్సార్‌లతో కలిసి నకిలీ అపాయింట్మెంట్‌ లెటర్లను సృష్టించారు. వారిని దుబాయ్‌ పంపి అక్కడ 2 నెలలు ఓ గదిలో ఉంచారు. ఆ తర్వాత.. ఉద్యోగం ఇప్పించడం కష్టమని, తిరిగి వెళ్లిపోవాలని చెప్పారు. బాధితులు నిలదీయడంతో తామే తిప్పి పంపుతామని వారిని అనునయించారు.


ఆ తర్వాత  పాస్‌పోర్ట్‌, ఇతర పత్రాలు తీసుకుని అక్కడి కంపెనీల నుంచి జీతాలు పొందుతున్నట్టుగా నకిలీపత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి ఒక్కొక్కరి పేరుతో రూ.3లక్షల మేర రుణాలు తీసుకున్నారు. అనుమానం వచ్చిన కొందరు.. కన్సల్టెన్సీ నిర్వాహకులను నిలదీశారు. తాము మోసపోయినట్టు గ్రహించి అక్కడి లేబర్‌ కోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు ఆదేశాలతో వీరంతా గత నెల హైదరాబాద్‌కు చేరారు. బాధితుడు మహ్మద్‌ రఫీ ఫిర్యాదుతో అబిడ్స్‌ పోలీసులు జాకి(27)ని అరెస్టు చేశారు. ముంబై కన్సల్టెన్సీ నిర్వాహకులతో పాటు మరో నిందితుడు పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు 40 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. 

Updated Date - 2022-03-06T14:01:48+05:30 IST