అంతన్నారు.. ఇంతన్నారే..

ABN , First Publish Date - 2022-05-19T06:26:31+05:30 IST

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తామని వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించింది.

అంతన్నారు..  ఇంతన్నారే..
బిల్లులు అందక తుది మెరుగులకు నోచుకోని బూదరాళ్ళ సచివాలయ భవనం

- వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు ప్రారంభం

- బిల్లులు చెల్లించక నిలిచిపోయిన పనులు

- ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో అర్థంకాని పరిస్థితి


గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తామని వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించింది. అన్నట్టుగానే పనులు ప్రారంభించింది. అయితే బిల్లుల చెల్లింపులు జరగక పనులన్నీ నిలిచిపోయాయి. మండలంలో 23 గ్రామ సచివాలయాలకు గాను ఒకటి మాత్రమే పూర్తి కావడం, 23 రైతుభరోసా కేంద్రాలకు 3, అలాగే 14 హెల్త్‌ క్లినిక్‌లకు రెండు, 23 అంగన్‌వాడీ కేంద్రాలకు రెండు మాత్రమే తుది దశకు చేరుకోవడం పనుల ప్రగతికి అద్దం పడుతున్నాయి. 

కొయ్యూరు, మే 18: మండలంలోని 33 పంచాయతీలకు గాను 23 గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలకు రూ.9.20 కోట్లు, 23 రైతు భరోసా కేంద్రాలకు రూ.5.02 కోట్లు, 14 హెల్త్‌ క్లినిక్‌ భవనాలకు రూ.2.10 కోట్లు, 23 అంగన్‌వాడీ కేంద్ర భవనాలకు రూ.2.30 కోట్లు..ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు మంజూరు చేస్తున్నట్టు 2019లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే సంవత్సరం డిసెంబరులో పనులు ప్రారంభించింది. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగ మండల ఇంజనీరింగ్‌ అధికారి ఆధ్వర్యంలో సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల పర్యవేక్షణలో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. పనులు శరవేగంగా జరుగుతుండడంతో వెంటనే అందుబాటులోకి వస్తాయని అందరూ ఆశించారు. అయితే 23 సచివాలయ భవనాలకు గాను యు.చీడిపాలెం భవనం ఒక్కటే పూర్తయి మూడు నెలల క్రితమే ప్రారంభమైంది. బూదరాళ్లు, డౌనూరు భవనాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. మిగిలిన 20 భవనాలు శ్లాబ్‌ల వరకు పూర్తయి మిగతా పనులు సుమారుగా ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయాయి. ఈ భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారుగా రూ.4.50 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్లకు చెల్లించింది. ఇంకా కోటి రూపాయల మేర  బకాయిలు ఉన్నాయి. గత మార్చి నెలలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల నుంచి రూ.70 లక్షల చెల్లింపులు జరిపేందుకు అన్ని సిద్ధం చేసి బిల్లులు అప్‌లోడ్‌ చేయగా తీరా ఎంపీడీవో కీ పెట్టే సమయానికి ఆ నిధులు ఖాళీ అయ్యాయి. దీంతో చెల్లింపులు లేక భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. త్వరలో బకాయిలు చెల్లిస్తామని,  పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఇంజనీరింగ్‌ సిబ్బంది నిత్యం బతిమాలుతున్నా ఏ ఒక్కరూ పనులు చేపట్టేందుకు ఇష్టపడటం లేదు. దీంతో సచివాలయాల నిర్వహణకు సొంత భవనాలు లేక కొన్ని అద్దె ఇళ్లలో, మరికొన్ని పాఠశాలల్లో, ఇంకొన్ని మహిళా మండలి భవనాల్లో కొనసాగుతున్నాయి.

ఆర్‌బీకేలు రెండే పూర్తి

రైతు భరోసా కేంద్రాల విషయానికి వస్తే సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రం వంతున 23 ఆర్‌బీకేలు మంజూరవ్వగా ఇప్పటికి డౌనూరు, రావణాపల్లి భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. బంగారమ్మపేట, అంతాడ, శరభన్నపాలెం, చిట్టింపాడు భవనాల పనులు శ్లాబ్‌ వరకు వచ్చాయి. మిగిలిన భవనాలు లింటల్స్‌ లెవిల్‌ దాటలేదు. నిర్మాణాలు జరిపిన మేరకు వీటికి గానూ ఇంకా రూ.2 కోట్ల మేర కాంట్రాక్టర్లకు బకాయి చెల్లించాల్సి ఉండటంతో వాటి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.

హెల్త్‌ క్లినిక్‌ల భవనాల నిర్మాణం నత్తనడక

 2020 మే నెలలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల పేరిట మండలంలో ఒక్కో హెల్త్‌ క్లినిక్‌కు రూ.15 లక్షల వంతున 14 మంజూరు చేశారు. వీటి నిర్మాణాల వ్యయం ఎక్కువ అవుతుందనే అభిప్రాయంతో  కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో అదనంగా భవన నిర్మాణ వ్యయం మరో రూ.2 లక్షలు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదే సంవత్సరం నవంబరులో వీటి నిర్మాణాలను కాంట్రాక్టర్లు చేపట్టారు. ఇప్పటికి బంగారమ్మపేట, అంతాడ గ్రామాలలో శ్లాబ్‌ల వరకు పనులు జరగగా, మిగిలిన భవనాల నిర్మాణాలు పునాదుల స్థాయిలో కొన్ని, గోడల నిర్మాణాలతో మరికొన్ని ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. కాంట్రాక్టర్లకు సుమారుగా కోటి రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. 

ప్రారంభంకాని 10 అంగన్‌వాడీ భవనాలు

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల భవన సౌకర్యం లేని వాటికి గాను భవన నిర్మాణాలు చేసేలా ఒక్కో భవనాన్ని రూ.10 లక్షలు వంతున 23 భవనాలు మంజూరు చేసింది. వీటికి గాను రూ.5 లక్షలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు, రూ.2 లక్షలు ఐసీడీఎస్‌, మరో రూ 2.50 లక్షలు ఎస్‌డీపీ నిధులతో పాటు పంచాయతీ నిధుల నుంచి రూ.50 వేలు చెల్లించాలని నిర్ణయించి ఈ భవనాలు మంజూరు చేసింది. అయితే నిర్దేశించిన శాఖల ఖాతాలలో నిధులన్నీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల అమలుకు వెచ్చించే దిశగా వారి ఖాతాలలో నిధులు జీరో చేయడంతో వీటికి గ్రహణం పట్టింది. దీంతో బూదరాళ్ళ పంచాయతీకి సంబంధించి మంజూరైన 10 భవనాల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రారంభించిన వలసంపేట, చింతలపూడి, పరదేశిపాకలు భవనాలు పునాదులు పూర్తయి ఏడాదిన్నర కావస్తున్నా సంబంధిత కాంట్రాక్టర్లకు ఒక్క పైసా కూడా చెల్లించకపోవటంతో తదుపరి పనులు నిలిచిపోయాయి. బిల్లులు చెల్లిస్తారనే  నమ్మకంతో అప్పులు చేసి శ్లాబ్‌ వేసిన చింతలపూడి పంచాయతీ శింగరాలపాడు భవన నిర్మాణ కాంట్రాక్టరు బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేశారు. ఇలా పనులన్నీ నిలిచిపోవడంతో ఇవి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి.

త్వరలో దశలవారీగా బిల్లులు చెల్లిస్తాం

నిలిచిన పనులన్నింటికీ త్వరలో దశలవారీగా బిల్లులు చెల్లిస్తాం. తిరిగి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి త్వరలో పనులన్నీ పూర్తి చేసి సంబంధిత శాఖలకు అప్పగిస్తాం.

- బసవేశ్వరరావు, మండల ఇంజనీరింగ్‌ అధికారి

    

Updated Date - 2022-05-19T06:26:31+05:30 IST