శ్రమదానంతో రోడ్డు, కర్రల వంతెన నిర్మాణం

ABN , First Publish Date - 2021-06-25T05:53:47+05:30 IST

ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా.. ప్రభుత్వం తమ గ్రామానికి కనీసం రోడ్డు కూడా వేయకపోవడంతో ఆ గ్రామ ప్రజలు శ్రమదానంతో రోడ్డు, కర్రల వంతెనను నిర్మించుకున్నారు.

శ్రమదానంతో రోడ్డు, కర్రల వంతెన నిర్మాణం
శ్రమదానంతో రోడ్డు, చెక్కల వంతెన నిర్మించుకున్న పాములుపుట్టు గ్రామస్థులు



డుంబ్రిగుడ, జూన్‌ 24: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా.. ప్రభుత్వం తమ గ్రామానికి కనీసం రోడ్డు కూడా వేయకపోవడంతో ఆ గ్రామ ప్రజలు శ్రమదానంతో రోడ్డు, కర్రల వంతెనను నిర్మించుకున్నారు. మండలంలోని కితలంగి పంచాయతీ పాములుపుట్టు గ్రామానికి చెందిన వంద మంది గిరిజనులు శ్రమదానంతో రెండు కిలోమీటర్ల మేర మట్టిరోడ్డు నిర్మించుకున్నారు. అలాగే ఆ రోడ్డు మధ్యలో ఉన్న కాలువ వద్ద కర్రల వంతెనను నిర్మించారు. ఈ విషయమై ఈ గ్రామానికి చెందిన గెమ్మెల నూకరాజు, గెమ్మెల సీతారాం మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి ఇంత కాలమైనా తమ గ్రామానికి ప్రభుత్వం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్‌ కూడా రావడం లేదని, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. దీంతో తమ గ్రామస్థులంతా ఏకమై మట్టి రోడ్డు వేసుకున్నామని, ఒకచోట కర్రల వంతెన ఏర్పాటు చేసుకున్నామన్నారు. అధికారులు స్పందించి ఈ మట్టిరోడ్డుపై ఉపాధి హామీ పథకంలో బీటీ రోడ్డు వేయాలని కోరారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని సీపీఎం  నాయకులు కె.సురేంద్ర, సూర్యనారాయణ పరిశీలించారు. ఈ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-06-25T05:53:47+05:30 IST