ఒకేసారి వంద ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2022-05-20T05:47:43+05:30 IST

అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారి ఆశలు ఆరు నెలల తరువాత చిగురించాయి. పులపత్తూరులోని రెండు లే అవుట్లలో ఒకే సారి వంద ఇళ్ల నిర్మాణాలకు గురువారం శ్రీకారం చుట్టారు. ఆ గ్రామ సర్పంచ్‌ భీము శ్రీదేవమ్మ, ఆ గ్రామ నాయకులు భీము జగన్‌మోహన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుణ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సునీల్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణ, సర్వేయరు సురేష్‌, వీఆర్వో నరేష్‌ నేతృత్వంలో ఇంటి నిర్మాణాలకు కావాల్సిన గునాదులు తీశారు.

ఒకేసారి వంద ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం
పులపత్తూరు గ్రామంలోని ఓ లేవుట్‌లో గురువారం ప్రారంభమైన ఇంటి నిర్మాణాలు

6 నెలల తర్వాత చిగురించిన ఆశలు

యుద్ధప్రాతిపదికన మోటార్లు బిగింపు 

రాజంపేట, మే 19: అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారి ఆశలు ఆరు నెలల తరువాత చిగురించాయి. పులపత్తూరులోని రెండు లే అవుట్లలో ఒకే సారి వంద ఇళ్ల నిర్మాణాలకు గురువారం శ్రీకారం చుట్టారు. ఆ గ్రామ సర్పంచ్‌ భీము శ్రీదేవమ్మ, ఆ గ్రామ నాయకులు భీము జగన్‌మోహన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుణ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సునీల్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణ, సర్వేయరు సురేష్‌, వీఆర్వో నరేష్‌ నేతృత్వంలో ఇంటి నిర్మాణాలకు కావాల్సిన గునాదులు తీశారు. ఇళ్ల వద్దకు కావాల్సిన గునాది రాళ్లు, ఇటుకలు, సిమెంటు, కంకర  తోలారు. ప్రత్యేక కాంక్రీటు వేసే యంత్రాలు తెప్పించి గునాది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమి పూజ నిర్వహించారు. ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి కాలనీలో వేసిన బోర్లలో యుద్ధప్రాతిపదికన మోటార్లు బిగించి బోర్ల నుంచి నీటిని తెప్పించారు. పునరావాస గ్రామాల్లో పేదలు కట్టుకునే కాలనీల్లో గంగమ్మ గలలు కనిపించడంతో పేద ప్రజల ఆనందానికి అంతేలేకుండా పోయింది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడం కోసం ఆరు నెలలుగా ‘ఆంధ్రజ్యోతి దినపత్రిక’లో వారి ఈతిబాధలపై వరుస కథనాలు ఇవ్వడం జరుగుతోంది. అందులో భాగంగా బుధవారం ’ఆదుకునేవారేరీ’. అన్న శీర్షికన పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేట తదితర వరద బాధిత గ్రామాల సమస్యలు వివరించడం జరిగింది. ఈ కథనంపై జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెనువెంటనే ఇంటినిర్మాణాలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు గురువారమే ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇళ్లు స్వతహాగా కట్టుకునే వారికి కావాల్సిన రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందివ్వడానికి హౌసింగ్‌ అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ భీము శ్రీదేవమ్మ మాట్లాడుతూ తమ గ్రామంలో 300 ఇళ్లకు మూడు కాలనీల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి నిధులు కూడా మంజూరయ్యాయని, స్వతహాగా కట్టుకునే వారు కొందరు, అత్యధికంగా కాంట్రాక్టర్‌ ద్వారా, ప్రభుత్వం ద్వారా కట్టించుకునేవారు అధికంగా ఉన్నారని తెలిపారు.  అందరి సమన్వయంతో ఈ ముంపు గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయించి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని తెలిపారు.

Updated Date - 2022-05-20T05:47:43+05:30 IST