ఇంకెన్నాళ్లు?

ABN , First Publish Date - 2022-06-28T04:41:46+05:30 IST

పేదోడి సొంతింటి కల.. కలగానే మిగులుతోంది.

ఇంకెన్నాళ్లు?
మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు

  • కదలని డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం
  • జిల్లాలో ఆరేళ్ల కిందట 6,637 ఇళ్లు మంజూరు
  • ఇప్పటికీ 2,637 ఇళ్ల నిర్మాణాలే ప్రారంభం
  • ఆ తరువాత కొత్తగా ఒక్క ఇల్లూ మంజూరు లేదు
  • లక్ష మందికి పైగా ఎదురుచూపు


పేదోడి సొంతింటి కల.. కలగానే మిగులుతోంది. ఇల్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఏండ్లు గడుస్తున్నా వీటి నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు.  వివిధ ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అసలు పనులే మొదలు పెట్టలేదు. దీంతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వస్తాయని ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. పూరిగుడిసెల్లో, కిరాయి ఇళ్లలోనే మగ్గుతున్న పేదలు రెండు పడకల ఇళ్ల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, జూన్‌ 27) : జిల్లాలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ఇళ్లులేని పేదలందరికీ ఉచితంగా డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలను మాత్రం ఇంకా సాగదీస్తూనే ఉంది. 2015-16, 2016-17 ఆర్ధిక సంవత్సరాల్లో అరకొర మంజూరు చేసిన ఇళ్లే ఇంత వరకు పూర్తికాలేదు. తరువాత కాలంలో  కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. దీంతో గతంలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు లక్షకుపైగా కుటుంబాలు తమవంతు ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆరేళ్ల కిందట చేపట్టిన నిర్మాణాల్లో కనీసం 10శాతం కూడా ఇప్పటివరకు పూర్తికాకపోవడం గమనార్హం. పెండింగ్‌ పనులకు సంబంధించి ఇటీవలే రూ.9కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో కొన్ని కూడా పూర్తయ్యే అవకాశాలు లేవు. అసలు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వ ఉద్దేశం కూడా అర్ధం కావడం లేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇళ్ల నిర్మాణాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్న ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలపై కదలిక లేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలపై దృష్టిపెడుతుందని అందరూ భావించారు. కానీ ఇంతవరకు ఈ పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇదిలాఉంటే ఈ ఏడాది డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దగా నిధులు  కేటాయించలేదు. దీంతో కొత్తగా ఆరేళ్లుగా ఇళ్లు మంజూరు చేయలేదు. పేదలందరికీ ఉచిత బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించేందుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియడం లేదు. వాస్తవానికి డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందు ఆసక్తి చూపడం లేదు. అనేకసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. ధరలు గిట్టుబాటు కాకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లే వేయడం లేదు. ఇటీవల కాలంలో సిమెంట్‌, ఇసుక, స్టీల్‌ వంటి నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ధరలు సవరించడంతో కొందరు టెండర్లలో పాల్గొన్నారు. దీంతో ఈ మాత్రమైనా పనులు మొదలయ్యాయి. అయితే బిల్లులు కూడా సక్రమంగా అందకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేస్తున్నారు. 


నిర్మాణ దశలో ఉన్నవి : 2,637 

ఇదిలా ఉంటే రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకం కింద ఇళ్లకోసం 1,30,605 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం 6,637 ఇళ్లు మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లావ్యాప్తంగా 274.35 ఎకరాల భూమిని సేకరించారు. ఇప్పటివరకు 6,175 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలవగా.. ఇందులో 2,836 ఇళ్లకు మాత్రమే ఆమోదం లభించింది. 2,637 ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటివరకు కొన్ని నిర్మాణాలు పూర్తయినా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో గృహప్రవేశాలకు అనుకూలంగా లేవు. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, కల్వకుర్తి, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఇళ్లనిర్మాణ పనులు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులు చూస్తున్నారు. శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల పరిధిలో ఇళ్ల నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ పర్యవేక్షిస్తోంది. ఇందులో పంచాయతీరాజ్‌ 1,705, ఆర్‌అండ్‌బీ 4,932 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాయి. 


ఈ ఏడాది బడ్జెట్‌ కార్యరూపం దాల్చేనా? 

డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకానికి ఈ ఏడాది కొంత నిధులు కేటాయించారు. సొంత స్థలం కలిగిన వారికి తమ స్థలంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షల చొప్పున అందించాలని నిర్ణయించినట్లు మంత్రి హరీ్‌షరావు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. బడ్జెట్‌లో ఈ మేరకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి 3వేల ఇండ్ల చొప్పున నిధులు కేటాయిస్తామన్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 57వేల కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించాల్సి ఉంది. కానీ గత అనుభవాలు చూస్తే ఇది సాకారం కావడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియడం లేదు. గతంలో కేటాయించిన బడ్జెట్‌ ప్రకారం నిధులు మంజూరు కాలేదు.


కలగానే డబుల్‌ బెడ్‌రూం ఇల్లు

ఎన్నో ఏళ్ల నుంచి ఆశిస్తున్న డబుల్‌బెడ్‌ ఇళ్లు తమకు కలగానే మిగిలిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం మొయినాబాద్‌ మండలంలో నీరుగారిపోతోంది. రెండు నెలలు పనులు నడిస్తే ఆరు నెలలు నడవదు. ఇదీ అజీజ్‌నగర్‌లో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌ ఇళ్ల పరిస్థితి. నిత్యం ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వ పెద్దలు ప్రయాణిస్తూనే ఉంటారు. కానీ వారికి అర్ధంతరంగా నిలిచిపోయిన డబుల్‌బెడ్‌రూం పనులు కనిపించకపోవడం విడ్డూరకరం. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే పనులను పూర్తి చేసి ప్రజలకు అందజేయాలి. 

-గోపీకాంత్‌. చిలుకూరు గ్రామం, మొయినాబాద్‌ మండలం


అధికారుల చుట్టూ తిరుగుతున్న

మా గ్రామంలో చాలా ఏళ్ల క్రితం డబుల్‌ బెడ్‌రూం కట్టిస్తమంటే మండల ఆఫీస్‌ చుట్టు నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా కనికరించే వారు లేరు. నాకు సెంటు భూమి లేదు. కూలీ నాలీచేసుకొని బతుకుతున్నా. నేటికి నా కుటుంబం పూరి గుడిసెలో ఉంటున్నం.  నాకు ఇల్లు ఇప్పించమని ఊ ర్ల చాలా మంది పెద్ద మనుషులను అడిగితే చూద్దాం చేద్దామంటున్నరే కానినాకు సాయం చేసి ఆదుకునే వారు లేకుండపోయిండ్రు. కలెక్టర్‌సార్‌ దగ్గరకు పోవాలనకుంటున్న. 

- కంబాలపల్లి పోషయ్య తక్కళ్లపల్లి

---------------------------------------

నియోజకవర్గాల వారీగా ఇళ్లు మంజూరు ఇలా...

చేవెళ్ల 1,060

కల్వకుర్తి 645

ఇబ్రహీంపట్నం 1,200

మహేశ్వరం 392

రాజేంద్రనగర్‌ 240

షాద్‌నగర్‌ 3,052

--------------------------------

జిల్లాలో నాలుగేళ్లలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల పురోగతి

దరఖాస్తు చేసుకున్న వారు 1,30,605

మంజూరైన ఇళ్లు 6,637

టెండర్లు పిలిచినవి 6,175

టెండర్లు పూర్తయినవి 2,836

ఇళ్లనిర్మాణాలకు ఎంపిక చేసిన స్థలాలు 123

ప్రారంభించిన నిర్మాణాలు 2,637

పూర్తికావడానికి సిద్ధంగా ఉన్నవి 2,061



Updated Date - 2022-06-28T04:41:46+05:30 IST