అనుమతి లేకుండానే ఇళ్ల నిర్మాణాలు

ABN , First Publish Date - 2022-06-24T05:26:05+05:30 IST

అనుమతి లేకుండానే ఇళ్ల నిర్మాణాలు

అనుమతి లేకుండానే ఇళ్ల నిర్మాణాలు
కొల్తూర్‌ గ్రామ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న గదులు


  • పట్టించుకోని అధికారులు

శామీర్‌పేట, జూన్‌ 23: మూడుచింతలపల్లి మండలం కొల్తూర్‌ గ్రామంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. కొల్తూర్‌ గ్రామ పరిధిలోని చెరువుకు సమీపంలో సర్వేనెంబర్‌-3 భూమిలో కొందరు వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడ గదులు నిర్మించడమే కాదు.. గోడలు కట్టి వాటిపై రేకులు కూడా వేశారు. నిర్మాణాలు జరిగే భూమి వారి సొంతదే అయినా, ఇళ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ, గ్రామ పంచాయతీ నుంచి గానీ అనుమతులు తీసుకోలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత బహిరంగంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

నోటీసులిచ్చాం

కొల్తూర్‌ పరిధిలో అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై సంబంధిత యజమానులకు నోటీసులిచ్చాం. గ్రామంలో యజమానులు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా పది గదులను నిర్మిస్తున్న విషయం వాస్తవమే. సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. 

                                                             -శ్వేత, కొల్తూర్‌, పంచాయతీ కార్యదర్శి 

అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి

కొల్తూర్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పందించి వాటిని వెంటనే కూల్చివేయాలి. ఇలాంటి వాటిని అధికారులు ప్రోత్సహించకుండా ఉండాలి. అక్రమార్కులు దర్జాగా అనుమతులు లేకుండా పది గదులను నిర్మిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు.

                                                                     - ఎన్‌. రవీందర్‌గౌడ్‌, స్థానికుడు

Updated Date - 2022-06-24T05:26:05+05:30 IST