డెడ్‌లైన్‌!

ABN , First Publish Date - 2022-01-22T04:53:19+05:30 IST

‘ప్రభుత్వం అందించిన సాయం ఏ మూలకు చాలదు. పెరిగిన గృహ నిర్మాణ సామగ్రితో ఇల్లు కట్టలేం. సాధ్యమయ్యే పనికాదు’..అంటూ జిల్లాలో వివిధ గృహ నిర్మాణ పథకాల్లో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ముఖ్యంగా జగనన్న లేఅవుట్లలో పట్టాలు పొందిన వారు ఇళ్లు కట్టేందుకు ముందుకు రావడం లేదు.

డెడ్‌లైన్‌!
పార్వతీపురం పట్టణ లబ్ధిదారుల కోసం కేటాయించిన లేఅవుట్‌

31లోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించాల్సిందే

లేకుంటే పట్టాలు రద్దుచేస్తాం

అధికారుల హెచ్చరికతో లబ్ధిదారుల్లో ఆందోళన

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

‘ప్రభుత్వం అందించిన సాయం ఏ మూలకు చాలదు. పెరిగిన గృహ నిర్మాణ సామగ్రితో ఇల్లు కట్టలేం. సాధ్యమయ్యే పనికాదు’..అంటూ జిల్లాలో వివిధ గృహ నిర్మాణ పథకాల్లో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ముఖ్యంగా జగనన్న లేఅవుట్లలో పట్టాలు పొందిన వారు ఇళ్లు కట్టేందుకు ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల హెచ్చరికలతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది మాత్రం ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంటున్నారు. ఈనెల 31లోగా ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఏంచేయాలో పాలుపోక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే అప్పుల్లో మునిగిపోతామని ఒకవైపు.. అధికారుల మాట వినకుంటే పట్టాలు రద్దవుతాయని మరోవైపు భయం వారిని వెంటాడుతోంది. జిల్లాలో గృహ నిర్మాణం విషయంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన జగనన్న కాలనీ లేఅవుట్లలో పరిస్థితి మరింత తీసికట్టుగా ఉంది. ఎక్కడా గృహాల నిర్మాణం సజావుగా జరగడం లేదు.  దీనికి అనేక కారణాలున్నాయి. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు లేకపోవడం, నిర్మాణ సామగ్రి తరలించేందుకు రవాణా సదుపాయం లేకపోవడం, అనువుగా లేనిచోట లేఅవుట్లు ఏర్పాటు చేయడం తదితర కారణాలతో నిర్మాణాలు ప్రారంభం కాలేదు. జిల్లాకు వివిధ గృహ నిర్మాణ పథకాల కింద 77,826 ఇళ్లు మంజూరైతే అందులో శ్లాబు లెవల్‌ వరకూ నిర్మించినవి కేవలం 3,666 మాత్రమే. అసలు 17,005 ఇళ్ల నిర్మాణం ప్రారంభించనే లేదు. 40 వేల ఇళ్లకు సంబంధించి పునాదుల గోతుల తవ్వి విడిచిపెట్టేశారు. ప్రారంభంలో హడావుడి చేసిన అధికారులు అటు తరువాత ఆ మాటే మరిచిపోయారు. 

 నాటి ఆదేశాలేమయ్యాయి?

లేఅవుట్ల గుర్తింపులో అధికార యంత్రాంగం వైఫల్యం ఎక్కడికక్కడే వెలుగుచూసింది. ఈ విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో సైతం అసంతృప్తి నెలకొంది. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు దీనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పార్వతీపురం మునిసిపాల్టీకి సంబంధించి అధికారులు ఎంపిక చేసిన లేఅవుట్‌ పట్టణానికి దూరంగా ఉందని.. కొండల్లో స్థలాలను ఎంపిక చేయడం ఏమిటని ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తక్షణం లేఅవుట్లను మార్పు చేయాలని ఆదేశించారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా అధికారుల చర్యలు మాత్రం శూన్యం. కనీసం అధికారుల్లో చలనం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ నెల 31లోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించకుంటే పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లు కట్టలేమంటూ ఎక్కువ మంది లబ్ధిదారులు తేల్చిచెబుతున్నారు. 


జిల్లాలో గృహ నిర్మాణ పరిస్థితి

=================================

మొత్తం నిర్మించాల్సిన ఇల్లు 77,826

నిర్మాణం ప్రారంభించనివి 17,005

పునాదులు వేసినవి 12,761

పునాదుల గోతుల స్థాయిలో.. 39,976

లింటల్‌ లెవల్‌ స్థాయిలో 4,418

శ్లాబు పూర్తయినవి 3,666


 31లోగా పనులు ప్రారంభించాలి

లేఅవుట్లలో పట్టాలు పొందిన వారు ఈ నెల 31లోగా నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఇదే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేశాం. అనేకసార్లు క్షేత్రస్థాయిలో సిబ్బంది వెళ్లి సూచించారు. కానీ లబ్ధిదారులు ముందుకు రాలేదు. అందుకే దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టాం. 

-కూర్మినాయుడు, గృహ నిర్మాణ శాఖ పీడీ




Updated Date - 2022-01-22T04:53:19+05:30 IST