పేదల ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా జరగాలి

ABN , First Publish Date - 2022-09-28T05:30:00+05:30 IST

పేదల ఇళ్ల నిర్మాణాల చురుగ్గా జరగాలని.. ప్రతి పేదవాడి ఇంటికల నెరవేరేలా అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు.

పేదల ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా జరగాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా


రాయచోటి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 28: పేదల ఇళ్ల నిర్మాణాల చురుగ్గా జరగాలని.. ప్రతి పేదవాడి ఇంటికల నెరవేరేలా అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని... ఆ దిశగా అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. జిల్లాలో 73,069 ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో ఇప్పటికీ 12,814 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. వచ్చే వారంలోపు పునాదుల స్థాయికి తీసుకురావాలని సచివాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను ఆదేశించారు. కొన్ని మండలాల్లో అనుకున్న స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరగడం లేదని, వచ్చే వారం నాటికి ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలన్నారు. సచివాలయం వారీగా ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతి సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణశాఖ పీడీ శివయ్య, ఆర్డీవోలు రంగస్వామి, కోదండరామిరెడ్డి, మురళి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, హౌసింగ్‌ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-09-28T05:30:00+05:30 IST